Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 “యూదా పాపం వారి హృదయ పలకలపై, వారి బలిపీఠాల కొమ్ములపై, ఇనుప పనిముట్టుతో చెక్కబడింది. వజ్రపు మొనతో లిఖించబడింది.

2 వారి పిల్లలు కూడా మహా వృక్షాల ప్రక్కన ఎత్తైన కొండలమీద ఉన్న తమ బలిపీఠాలను, అషేరా స్తంభాలను జ్ఞాపకం చేసుకుంటారు.

3 నీవు పాపం నీ దేశమంతటా ఉంది కాబట్టి దేశంలోని నా కొండలను, నీ ధనాన్ని, నీ సంపదను, నీ క్షేత్రాలతో పాటు దోపుడు సొమ్ముగా ఇస్తాను.

4 నీవు చేసిన తప్పు వల్ల నేను నీకు ఇచ్చిన వారసత్వాన్ని నీవు కోల్పోతావు. నీకు తెలియని దేశంలో నిన్ను నీ శత్రువులకు బానిసగా చేస్తాను, నీవు నా కోపాన్ని రెచ్చగొట్టావు, అది ఎప్పటికీ మండుతూ ఉంటుంది.”

5 యెహోవా ఇలా అంటున్నారు: “మనుష్యుల మీద నమ్మకం పెట్టుకునేవారు, కేవలం శరీర బలం మీద ఆధారపడేవారు, యెహోవా నుండి తమ హృదయాన్ని త్రిప్పివేసుకునేవారు శాపగ్రస్తులు.

6 వారు బంజరు భూములలో పొదలా ఉంటారు; వృద్ధి కలిగినప్పుడు వారు దానిని చూడరు. వారు ఎడారిలోని ఎండిన ప్రదేశాల్లో, ఎవరూ నివసించని ఉప్పు భూమిలో నివసిస్తారు.

7 “కాని యెహోవా మీద నమ్మకముంచేవారు ధన్యులు, ఆయనయందు నమ్మకం ఉంచేవారు ధన్యులు.

8 వారు నీళ్ల ప్రక్కన నాటిన చెట్టులా ఉంటారు వాటి వేర్లు నీటి ప్రక్కన లోతుగా పాదుకుంటాయి. కాబట్టి వేడి తగిలినా అవి భయపడవు; వాటి ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. కరువు వచ్చిన సంవత్సరంలో వాటికి చింత ఉండదు, ఫలాలు ఇచ్చే విషయంలో ఎప్పుడూ విఫలం కావు.”

9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది నయం చేయలేని వ్యాధి కలది. దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?

10 “యెహోవానైన నేను హృదయాన్ని పరిశోధించి మనస్సును పరీక్షించి, ప్రతి వ్యక్తికి వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తాను.”

11 అన్యాయంగా ధనాన్ని సంపాదించేవారు పెట్టని గుడ్ల మీద పొదిగిన కౌజుపిట్టలాంటి వారు. వారి జీవితం సగం ముగిసినప్పటికే సంపద వారిని వదిలివేస్తుంది, చివరికి వారు మూర్ఖులు అని నిరూపించబడతారు.

12 మన పరిశుద్ధాలయం, ఆది నుండి హెచ్చింపబడిన ఒక మహిమగల సింహాసనము.

13 యెహోవా, మీరే ఇశ్రాయేలీయుల నిరీక్షణ; మిమ్మల్ని విడిచిపెట్టేవారందరూ అవమానానికి గురవుతారు. మిమ్మల్ని విడిచిపెట్టినవారి గమ్యం నాశనమే, ఎందుకంటే వారు జీవజలపు ఊటయైన యెహోవాను విడిచిపెట్టారు.

14 యెహోవా, నన్ను స్వస్థపరచండి, నేను స్వస్థపడతాను; నన్ను రక్షించండి, నేను రక్షింపబడతాను, నేను స్తుతించేది మిమ్మల్నే.

15 వారు నాతో ఇలా అంటారు: “యెహోవా మాట ఏమైంది? అది ఇప్పుడు నెరవేరాలి!”

16 నేను మీకు కాపరిగా ఉండకుండ పారిపోలేదు; వారికి నిరాశ దినం రావాలని నేను కోరుకోలేదని మీకు తెలుసు. నా పెదవుల నుండి బయటకు వచ్చే ప్రతీ మాట మీకు తెలుసు.

17 నాకు భయాన్ని కలిగించకండి; ఆపద దినాన మీరే నాకు ఆశ్రయము.

18 నన్ను హింసించేవారు అవమానించబడాలి, కాని అవమానపాలుకాకుండ నన్ను కాపాడండి. వారికి భయభ్రాంతులు కలగాలి, కాని నాకు భయభ్రాంతులు కలుగకుండా కాపాడండి. వారి మీదికి నాశన దినాన్ని రప్పించండి; రెట్టింపు విధ్వంసంతో వారిని నాశనం చేయండి.


సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించడం

19 యెహోవా నాతో ఇలా అన్నారు: “నీవు వెళ్లి యూదా రాజులు వెళ్లే ప్రజల ద్వారం దగ్గర నిలబడు. యెరూషలేము యొక్క అన్ని ఇతర ద్వారాల దగ్గర కూడా నిలబడు.

20 నీవు వారితో, ‘ఈ ద్వారాల గుండా వచ్చే యూదా రాజులారా, సర్వ యూదా ప్రజలారా, యెరూషలేములో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ యెహోవా మాట వినండి.

21 యెహోవా ఇలా అంటున్నారు: సబ్బాతు దినాన ఏ బరువులు మోయకుండా, వాటిని యెరూషలేము ద్వారాల గుండా తీసుకురాకుండా జాగ్రత్తపడండి.

22 సబ్బాతు దినాన మీ ఇళ్ళ నుండి బరువులు తేకండి, ఏ పని చేయకండి, అయితే నేను మీ పూర్వికులకు ఆజ్ఞాపించినట్లుగా విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలి.

23 కాని వారు వినలేదు, పట్టించుకోలేదు; వారు మొండి వారై నా మాటలు వినలేదు, క్రమశిక్షణకు ప్రతిస్పందించలేదు.

24 అయితే యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, మీరు నా మాటకు విధేయత చూపుతూ, సబ్బాతు దినాన ఈ పట్టణపు ద్వారాల గుండా ఎలాంటి బరువులు తీసుకురాకుండా, ఏ పని చేయకుండా సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తే,

25 దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజులు తమ అధికారులతో కలిసి ఈ నగర ద్వారాల గుండా వస్తారు. వారు, వారి అధికారులు రథాల మీద, గుర్రాల మీద స్వారీ చేస్తూ, యూదా వారితో, యెరూషలేము నివాసులతో కలిసి వస్తారు, ఈ పట్టణం శాశ్వతంగా ఉంటుంది.

26 యూదా పట్టణాల నుండి, యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల నుండి, బెన్యామీను ప్రాంతం నుండి, పడమటి కొండ దిగువ ప్రదేశాల నుండి, కొండ ప్రదేశాల నుండి, దక్షిణ వైపు నుండి ప్రజలు దహనబలులను, బలులను, భోజనార్పణలను, ధూపద్రవ్యాలను, కృతజ్ఞతార్పణలను యెహోవా ఆలయానికి తీసుకువస్తారు.

27 అయితే మీరు సబ్బాతు దినాన యెరూషలేము గుమ్మాల గుండా వస్తున్నప్పుడు ఎలాంటి బరువును మోస్తూ రాకుండ సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించడంలో మీరు నాకు విధేయత చూపితే సరి, లేకపోతే నేను యెరూషలేము గుమ్మాల్లో ఆర్పలేని అగ్నిని రప్పిస్తాను, అది దాని భవనాలను దహించివేస్తుంది.’ ”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan