Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “మోషే, సమూయేలు నా ముందు నిలబడినా, నా హృదయం ఈ ప్రజల వైపుకు వెళ్లదు. వారిని నా సన్నిధి నుండి దూరంగా పంపివేయి! వారిని వెళ్లనివ్వు!

2 వారు నిన్ను, ‘మేము ఎక్కడికి వెళ్లాలి?’ అని అడిగితే, వారితో చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: “ ‘మరణానికి నిర్ణయించబడినవారు, మరణానికి; ఖడ్గానికి నిర్ణయించబడినవారు, ఖడ్గానికి; ఆకలికి నిర్ణయించబడినవారు, ఆకలికి; చెరకు నిర్ణయించబడినవారు, చెరకు వెళ్లాలి.’

3 “నేను నాలుగు రకాల బాధలను వారి మీదికి పంపుతాను. చంపడానికి ఖడ్గాన్ని, చీల్చడానికి కుక్కలను, తిని నాశనం చేయడానికి పక్షులను, అడవి జంతువులను పంపుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

4 యూదా రాజైన హిజ్కియా కుమారుడైన మనష్షే యెరూషలేములో చేసిన దానిని బట్టి భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలకు నేను వారిని అసహ్యమైన వారిగా చేస్తాను.

5 “యెరూషలేమా, నీ మీద ఎవరు జాలి చూపిస్తారు? నీకోసం ఎవరు దుఃఖిస్తారు? నీ క్షేమసమాచారం ఎవరు అడుగుతారు?

6 నీవు నన్ను తిరస్కరించావు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నీవు విశ్వాసభ్రష్టత్వం కొనసాగిస్తూనే ఉన్నావు. కాబట్టి నేను నా చేయి చాపి నిన్ను నాశనం చేస్తాను; నీ మీద జాలి చూపడానికి నేను అలసిపోయాను.

7 దేశపు పట్టణ ద్వారం దగ్గర నేను వారిని చేటతో చెరుగుతాను. నా ప్రజలు తమ మార్గాలను మార్చుకోలేదు వారికి బంధువియోగం కలిగించి నాశనం చేస్తాను.

8 నేను వారి విధవరాండ్ర సంఖ్యను సముద్రపు ఇసుక కంటే ఎక్కువ చేస్తాను. మధ్యాహ్న సమయంలో నేను వారి యువకులు తల్లుల మీదికి నాశనం చేసేవాన్ని రప్పిస్తాను; అకస్మాత్తుగా నేను వారి మీదికి వేదనను, భయాందోళనను రప్పిస్తాను.

9 ఏడుగురు పిల్లల తల్లి మూర్ఛపోయి తుది శ్వాస విడుస్తుంది. పగలు ఉండగానే ఆమెకు ప్రొద్దు గ్రుంకుతుంది; ఆమె అవమానం పాలవుతుంది, కించపరచబడుతుంది. ప్రాణాలతో బయటపడిన వారిని వారి శత్రువుల ముందు ఖడ్గానికి అప్పగిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

10 అయ్యో, నా తల్లీ, దేశమంతటితో పోరాటాలు, కలహాలు పెట్టుకునేవానిగా, నీవు నాకు జన్మనిచ్చావు! నేను అప్పు ఇవ్వలేదు, అప్పు తీసుకోలేదు, అయినా ప్రతిఒక్కరు నన్ను శపిస్తున్నారు.

11 యెహోవా ఇలా అన్నారు, “ఖచ్చితంగా నేను నిన్ను మంచి ఉద్దేశంతో విడిపిస్తాను; ఆపద సమయాల్లోనూ, కష్ట సమయాల్లోనూ నీ శత్రువులు నిన్ను సాయం కోరేలా నేను చేస్తాను.

12 “ఉత్తరానికి చెందిన ఇనుమును గాని ఇత్తడిని గాని ఎవరైనా విరగ్గొట్టగలరా?

13 “మీ దేశమంతటా మీరు చేసిన పాపాలన్నిటి కారణంగా మీ సంపదను, మీ ఖజానాను నేను ఎలాంటి రుసుము లేకుండా దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను.

14 నీకు తెలియని దేశంలో నీ శత్రువులకు నిన్ను బానిసగా చేస్తాను, నా కోపం మంటలు రేపుతుంది అది నీకు వ్యతిరేకంగా మండుతుంది.”

15 యెహోవా, మీరు అర్థం చేసుకోండి; నన్ను జ్ఞాపకముంచుకొని నా పట్ల శ్రద్ధ చూపండి. నన్ను హింసించేవారి మీద నా కోసం ప్రతీకారం తీర్చుకోండి. మీ ఓర్పును బట్టి నన్ను తీసుకెళ్లనివ్వకండి; మీ కోసం నేనెలా నిందలు అనుభవిస్తున్నానో ఆలోచించండి.

16 మీ మాటలు దొరికినప్పుడు ఒకడు ఆహారం తిన్నట్లుగా నేను వాటిని తిన్నాను; అవే నాకు ఆనందం నా హృదయానికి సంతోషం, ఎందుకంటే సైన్యాల యెహోవా దేవుడు అనే, మీ పేరును నేను కలిగి ఉన్నాను.

17 నేనిప్పుడు ఆనందించే వారితో కలిసి కూర్చోలేదు, వారితో ఎప్పుడూ సంతోషించలేదు. మీ చేయి నా మీద ఉంది మీరు నాలో కోపాన్ని నింపారు కాబట్టి నేను ఒంటరిగా కూర్చున్నాను.

18 అలాంటప్పుడు నా బాధ ఎందుకు అంతం కావడం లేదు? నా గాయం ఎందుకు నయం చేయలేనిది? మీ సహాయం నమ్మలేని వాగులా, ఎండిపోయే ఊటలా వంటిది.

19 కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “నీవు పశ్చాత్తాపపడితే మీరు నాకు సేవ చేసేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. నీవు పనికిరాని మాటలు కాక, యోగ్యమైన మాటలు మాట్లాడితే, నీవు నా పక్షంగా మాట్లాడే వక్తవవుతావు. ఈ ప్రజలు నీ వైపుకు తిరగాలి, కాని నీవు వారివైపు తిరగకూడదు.

20 నిన్ను ఈ ప్రజలకు గోడగా, ఇత్తడి కోటగోడగా చేస్తాను; వారు నీతో పోరాడతారు, కాని నిన్ను జయించలేరు, ఎందుకంటే నిన్ను విడిపించి రక్షించడానికి నేను నీతో ఉన్నాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

21 “దుష్టుల చేతుల నుండి నేను నిన్ను రక్షించి క్రూరమైన వారి పట్టు నుండి నిన్ను విడిపిస్తాను.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan