Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


అనావృష్టి, కరువు, ఖడ్గం

1 అనావృష్టి గురించి యిర్మీయాకు వచ్చిన యెహోవా వాక్కు ఇది:

2 “యూదా దుఃఖిస్తుంది, ఆమె పట్టణాలు వాడిపోతున్నాయి. వారు భూమి కోసం విలపిస్తున్నారు, యెరూషలేము నుండి కేకలు వినిపిస్తున్నాయి.

3 అధిపతులు నీళ్ల కోసం తమ సేవకులను పంపుతారు; వారు నీళ్ల తొట్టెల దగ్గరకు వెళ్తారు కానీ నీళ్లు దొరకవు. వారు ఖాళీ పాత్రలతో తిరిగి వస్తారు; నిరాశ నిస్పృహలతో, వారు తమ తలలను కప్పుకుంటారు.

4 దేశంలో వర్షం కురవకపోవడం వల్ల నేల చీలిపోయింది; రైతులు సిగ్గుతో తలలు కప్పుకున్నారు.

5 పొలంలో ఉన్న జింక కూడా గడ్డి లేనందున అప్పుడే పుట్టిన తన పిల్లలను విడిచిపెడుతుంది.

6 అడవి గాడిదలు బంజరు కొండలమీద నిలబడి నక్కల్లా రొప్పుతాయి. మేత లేకపోవడంతో వాటి కళ్లు క్షీణిస్తున్నాయి.”

7 మా పాపాలు మాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నా, యెహోవా, మీ నామం కోసం ఏదైనా చేయండి. ఎందుకంటే మేము చాలాసార్లు దారితప్పాం; మేము మీకు వ్యతిరేకంగా పాపం చేశాము.

8 మీరు ఇశ్రాయేలీయులకు నిరీక్షణ, ఆపద సమయంలో వారికి రక్షకుడవు, దేశంలో నీవు అపరిచితునిలా ఎందుకు ఉన్నావు? ఒక రాత్రి మాత్రమే బసచేసే ప్రయాణికునిలా ఎందుకు ఉన్నావు?

9 నీవు ఆందోళనకు గురియైన వ్యక్తిలా ఎందుకు ఉన్నావు? రక్షించడానికి శక్తిలేని యోధునిలా ఎందుకు ఉన్నావు? యెహోవా, మీరు మా మధ్య ఉన్నారు, మేము మీ పేరును కలిగి ఉన్నాము; మమ్మల్ని విడిచిపెట్టకండి!

10 ఈ ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నారు: “వారికి తిరగడం అంటే చాలా ఇష్టం; వారు తమ పాదాలను అదుపు చేసుకోరు. కాబట్టి యెహోవా వారిని అంగీకరించరు; ఆయన ఇక వారి దుర్మార్గాన్ని జ్ఞాపకం ఉంచుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తారు.”

11 తర్వాత యెహోవా నాతో ఇలా అన్నారు: “ఈ ప్రజల క్షేమం కోసం ప్రార్థించవద్దు.

12 వారు ఉపవాసం ఉన్నప్పటికీ నేను వారి మొర వినను; వారు దహనబలులను భోజనార్పణలను అర్పించినప్పటికీ నేను వాటిని అంగీకరించను. నేను వారిని ఖడ్గంతో కరువుతో తెగులుతో నాశనం చేస్తాను.”

13 అయితే నేను, “అయ్యో, ప్రభువా యెహోవా! ప్రవక్తలు వారితో, ‘మీరు ఖడ్గాన్ని చూడరు, మీకు కరువు రాదు. నిజానికి, ఈ స్థలంలో నేను మీకు శాశ్వతమైన సమాధానం ఇస్తాను’ అని చెబుతున్నారు.”

14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “ప్రవక్తలు నా పేరుతో అబద్ధాలు ప్రవచిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారిని నియమించలేదు, అసలు వారితో మాట్లాడలేదు. వారు మీకు తప్పుడు దర్శనాలు, భవిష్యవాణి, బూటకపు మాటలు వారి సొంత మనస్సు యొక్క భ్రమలు ప్రవచిస్తున్నారు.

15 కాబట్టి నా పేరుతో ప్రవచిస్తున్న ప్రవక్తల గురించి యెహోవా ఇలా అంటున్నారు: నేను వారిని పంపలేదు, అయినా వారు, ‘ఖడ్గం గాని కరువు గాని ఈ దేశాన్ని తాకవు’ అని చెప్తున్నారు. అలా ప్రవచిస్తున్న ప్రవక్తలే ఖడ్గం కరువుతో నశిస్తారు.

16 వారు ఎవరికి ప్రవచిస్తున్నారో ఆ ప్రజలు కరువు, ఖడ్గం కారణంగా యెరూషలేము వీధుల్లోకి విసిరివేయబడతారు. వారిని, వారి భార్యలను, వారి కుమారులను వారి కుమార్తెలను పాతిపెట్టడానికి ఎవరూ ఉండరు. నేను వారికి తగిన విపత్తును వారిపై కురిపిస్తాను.

17 “వారితో ఈ మాట చెప్పు: “ ‘నా కళ్లలో కన్నీరు రాత్రింబగళ్ళు ఆగకుండా పొంగిపారును గాక; ఎందుకంటే, కన్యయైన నా ప్రజల కుమార్తెకు, తీవ్రమైన గాయం తగిలింది, అది ఆమెను నలిపివేస్తుంది.

18 నేను పొలాల్లోకి వెళ్తే, ఖడ్గంతో చంపబడినవారు కనబడతారు; నేను పట్టణంలోకి వెళ్తే, కరువు బీభత్సాన్ని చూస్తాను. ప్రవక్త యాజకుడు ఇద్దరూ తమకు తెలియని దేశానికి వెళ్లారు.’ ”

19 యెహోవా, మీరు యూదాను పూర్తిగా తిరస్కరించారా? మీరు సీయోనును తృణీకరిస్తున్నారా? మేము స్వస్థత పొందలేనంతగా మమ్మల్ని ఎందుకు బాధించారు? మేము సమాధానం కోసం నిరీక్షించాం కానీ ఏ మంచి జరగలేదు, స్వస్థత జరిగే సమయం కోసం నిరీక్షించాం కానీ కేవలం భయమే ఉండింది.

20 యెహోవా, మా దుర్మార్గాన్ని, మా పూర్వికుల అపరాధాన్ని మేము ఒప్పుకుంటున్నాం; మేము మీకు విరోధంగా పాపం చేశాము.

21 మీ పేరు కోసం మమ్మల్ని తృణీకరించకండి; మహిమతో నిండిన మీ సింహాసనాన్ని అగౌరపరచకండి. మాతో మీ ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకోండి దానిని భంగం చేయకండి.

22 జనాంగాల పనికిమాలిన విగ్రహాలేవైనా వర్షాన్ని కురిపిస్తాయా? ఆకాశాలు వాటంతట అవి జల్లులు కురిపిస్తాయా? లేదు, యెహోవా, మా దేవా మీరే కదా. కాబట్టి మీ మీదనే మా నిరీక్షణ ఉంది, ఎందుకంటే ఇదంతా చేసింది మీరే.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan