యిర్మీయా 1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 బెన్యామీను దేశంలో అనాతోతు అనే పట్టణంలో ఉన్న యాజకులలో ఒకడైన హిల్కీయా కుమారుడైన యిర్మీయా మాటలు. 2 ఆమోను కుమారుడు యూదా రాజైన యోషీయా పాలనలో పదమూడవ సంవత్సరంలో యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చి, 3 యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము పాలన నుండి, యోషీయా కుమారుడును యూదా రాజునైన సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం పూర్తయ్యే వరకు అంటే ఆ సంవత్సరం అయిదవ నెలలో యెరూషలేము ప్రజలు చెరలోకి వెళ్లేవరకు యిర్మీయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతూ ఉంది. యిర్మీయాకు దేవుని పిలుపు 4 యెహోవా వాక్కు నాకు వచ్చి, 5 “గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు, నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను; దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను” అని చెప్పింది. 6 అప్పుడు నేను, “అయ్యో, ప్రభువైన యెహోవా, నేను చిన్నవాన్ని, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు” అన్నాను. 7 అయితే యెహోవా నాతో, “ ‘నేను చిన్నవాన్ని’ అని నీవు అనవద్దు. నేను నిన్ను ఎవరి దగ్గిరికి పంపితే నీవు వారి దగ్గరికి వెళ్లి నేను ఏది ఆజ్ఞాపించానో అది వారికి చెప్పాలి. 8 నీవు వారికి భయపడవద్దు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను అని యెహోవా చెప్తున్నారు.” 9 తర్వాత యెహోవా తన చేయి చాపి, నా నోటిని ముట్టి, “నీ నోటిలో నా మాటలు పెట్టాను. 10 పెళ్లగించడానికి, కూల్చివేయడానికి, నాశనం చేయడానికి, పడద్రోయడానికి, కట్టడానికి నాటడానికి నిన్ను దేశాల మీద, రాజ్యాల మీద నియమిస్తున్నాను” అని నాతో చెప్పారు. 11 తర్వాత యెహోవా నాతో మాట్లాడుతూ, “యిర్మీయా, నీకేం కనబడుతోంది?” అని అడిగారు. అందుకు నేను, “బాదం చెట్టు కొమ్మ కనబడుతోంది” అని జవాబిచ్చాను. 12 యెహోవా నాతో, “నీవు సరిగ్గా చూశావు, ఎందుకంటే నా మాట నెరవేరడం చూడాలని నేను కనిపెట్టుకుని ఉన్నాను” అన్నారు. 13 మరోసారి యెహోవా నాతో మాట్లాడుతూ, “నీవు ఏం చూస్తున్నావు?” అని అడిగారు. అందుకు నేను, “మసలుతున్న బాన, అది ఉత్తర దిక్కునుండి మన వైపు వంగి ఉంది” అని చెప్పాను. 14 అప్పుడు యెహోవా నాతో, “ఉత్తరం నుండి దేశంలో నివసించే వారందరి మీద విపత్తు కుమ్మరించబడుతుంది. 15 నేను ఉత్తర రాజ్యాల జనాంగాలన్నిటిని పిలిపించబోతున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “వారి రాజులు వచ్చి తమ సింహాసనాలను యెరూషలేము గుమ్మాల్లో ఏర్పరచుకుంటారు; వారు దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రాకారాలన్నింటి మీద అలాగే యూదా పట్టణాలన్నింటి మీద దాడి చేస్తారు. 16 నా ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, వారి చేతులు చేసిన విగ్రహాలను వారు పూజించి, వారు చేసిన దుర్మార్గాన్ని బట్టి నేను నా ప్రజల మీద నా తీర్పులను ప్రకటిస్తాను. 17 “నిన్ను నీవు సిద్ధం చేసుకో! లేచి నిలబడి నేను నీకు ఏది ఆజ్ఞాపిస్తే అది వారితో చెప్పు. వారికి భయపడవద్దు, లేకపోతే వారి ముందు నేను నిన్ను భయపెడతాను. 18 ఈ రోజు నేను మిమ్మల్ని దేశమంతటికి వ్యతిరేకంగా యూదా రాజులకు, దాని అధికారులకు, యాజకులకు, కోటగోడలు గల పట్టణంగా, ఇనుప స్తంభంగా ఇత్తడి గోడగా చేశాను. 19 వారు నీతో యుద్ధం చేస్తారు గాని, నీ మీద విజయం పొందలేరు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.