Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

న్యాయాధి 9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


అబీమెలెకు

1 యెరుబ్-బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సోదరుల దగ్గరకు వెళ్లి వారితో, తన తల్లి కుటుంబీకులందరితో ఇలా అన్నాడు,

2 “షెకెము యజమానులను అడగండి, ‘మీకు ఏది మంచిది: యెరుబ్-బయలు డెబ్బైమంది కుమారులు మిమ్మల్ని పాలించడమా లేదా ఒక్కడు పాలించడమా?’ అని అడగండి. నన్ను గుర్తుంచుకోండి నేను మీ సమీప రక్తసంబంధిని.”

3 అతని తల్లి సోదరులు అతని గురించి షెకెము పౌరులకు చెప్పినప్పుడు వారు, “అతడు మా బంధువు” అని, అబీమెలెకును అనుసరించడానికి మొగ్గు చూపారు.

4 వారు బయల్-బెరీతు క్షేత్రం నుండి డెబ్బై షెకెళ్ళ వెండితెచ్చి అబీమెలెకుకు ఇవ్వగా వాటితో అతడు అల్లరిమూకను కూలికి పెట్టుకున్నాడు, వారు అతని అనుచరులయ్యారు.

5 అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లి, తన అన్నదమ్ములైన డెబ్బైమంది యెరుబ్-బయలు కుమారులను ఒకే బండ మీద చంపాడు. అయితే యెరుబ్-బయలు చిన్న కుమారుడైన యోతాము తప్పించుకుని దాక్కున్నాడు.

6 తర్వాత షెకెము, బేత్-మిల్లో పౌరులందరూ కలిసివచ్చి షెకెములో స్తంభం ఉన్న మస్తకిచెట్టు క్రింద అబీమెలెకును రాజుగా నియమించారు.

7 అది యోతాముకు తెలిసినప్పుడు అతడు గెరిజీము పర్వత శిఖరం ఎక్కి బిగ్గరగా వారితో ఇలా అన్నాడు, “షెకెము పౌరులారా, మీరు చెప్పేది దేవుడు వినాలంటే, నేను చెప్పేది మీరు వినాలి.

8 ఒక రోజు చెట్లన్నీ తమకు ఒక రాజును అభిషేకించుకోవాలని బయలుదేరి వెళ్లి ఒలీవ చెట్టుతో, ‘మాకు రాజుగా ఉండు’ అన్నాయి.

9 “అయితే ఒలీవచెట్టు, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం దేవుడిని మానవులను గౌరవించడానికి వాడే నా తైలాన్ని నేను వదిలేయాలా?’ అన్నది.

10 “తర్వాత చెట్లు అంజూర చెట్టుతో, ‘రా, మాకు రాజుగా ఉండు’ అన్నాయి.

11 “అయితే అంజూర చెట్టు, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం మధురుమైన నా మంచి ఫలాలను వదిలేయాలా?’ అన్నది.

12 “తర్వాత చెట్లు ద్రాక్షవల్లితో అన్నాయి, ‘రా, మా రాజుగా ఉండు.’

13 “అయితే ద్రాక్షవల్లి, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం దేవునికి మనుష్యులకు సంతోషాన్ని ఇచ్చే నా ద్రాక్షరసాన్ని ఇవ్వడం మానివేయాలా?’ అన్నది.

14 “చివరికి చెట్లన్నీ ముళ్ళపొదతో, ‘నీవు వచ్చి మాకు రాజుగా ఉండు’ అని అడిగాయి.

15 “ముళ్ళపొద చెట్లతో, ‘మీరు నిజంగా నన్ను మీ రాజుగా అభిషేకించాలనుకుంటే రండి, నా నీడలో ఆశ్రయం తీసుకోండి; లేదా ముళ్ళపొద నుండి అగ్ని వచ్చి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయును గాక!’ అన్నది.

16 “అబీమెలెకును రాజుగా చేసి మీరు మర్యాదగా సరిగా వ్యవహరించారా? మీరు యెరుబ్-బయలుకు, అతని కుటుంబానికి న్యాయం చేశారా? మీరు అతని పట్ల సరియైన విధంగా వ్యవహరించారా?

17 నా తండ్రి మీ కోసం పోరాడి మిద్యాను చేతి నుండి మిమ్మల్ని కాపాడడానికి తన ప్రాణం పణంగా పెట్టాడని జ్ఞాపకం చేసుకోండి.

18 అయితే మీరు నా తండ్రి కుటుంబానికి విరోధంగా లేచారు. ఒకే బండ మీద అతని డెబ్బైమంది కుమారులను చంపిన అతని దాసి కుమారుడైన అబీమెలెకు మీకు బంధువు కాబట్టి షెకెము పౌరుల మీద రాజుగా నియమించారు.

19 యెరుబ్-బయలు, అతని కుటుంబంపట్ల సత్యంగా యథార్థంగా ఉన్నారా? ఒకవేళ మీరు అలా ఉంటే, అబీమెలెకును బట్టి సంతోషించండి అతడు మిమ్మల్ని బట్టి సంతోషించును గాక!

20 లేకపోతే, అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని అనగా షెకెము, బేత్-మిల్లో పౌరులను కాల్చివేయును గాక. మీ నుండి అనగా షెకెము, బేత్-మిల్లో పౌరుల నుండి అగ్ని వచ్చి అబీమెలెకును కాల్చివేయును గాక!”

21 తర్వాత యోతాము తన సోదరుడైన అబీమెలెకుకు భయపడి పారిపోయి బెయేర్‌కు వెళ్లి అక్కడ నివసించాడు.

22 అబీమెలెకు మూడేళ్ళు ఇశ్రాయేలు మీద పాలించిన తర్వాత,

23 దేవుడు అబీమెలెకుకు, షెకెము పౌరులకు వైరం కలిగించారు, కాబట్టి వారు అబీమెలెకుకు ద్రోహం చేశారు.

24 యెరుబ్-బయలు డెబ్బైమంది కుమారులను చంపి వారికి చేసిన ద్రోహానికి, వారిని చంపిన వారి సోదరుడైన అబీమెలెకు మీదికి, తన సోదరులను చంపడానికి అతనికి సహాయం చేసిన షెకెము పౌరుల మీదికి ప్రతిఫలం వచ్చేలా దేవుడు చేశారు.

25 అతనికి వ్యతిరేకంగా ఈ షెకెము పౌరులు దారిలో వెళ్లే వారందరి మీద దాడి చేసి దోచుకునేలా కొండ శిఖరాల మీద మనుషులను ఉంచారు. ఇది అబీమెలెకుకు తెలిసింది.

26 ఎబెదు కుమారుడైన గాలు అతని సోదరులతో షెకెముకు వెళ్లగా షెకము నాయకులు అతనిపై నమ్మకం ఉంచారు.

27 వారు పొలాలలోనికి వెళ్లి ద్రాక్షపండ్లను ఏరుకుని వాటిని త్రొక్కిన తర్వాత, తమ దేవుని గుడిలో పండగ చేసుకున్నారు. వారు తింటూ, త్రాగుతూ అబీమెలెకును శపించారు.

28 అప్పుడు ఎబెదు కుమారుడైన గాలు ఇలా అన్నాడు, “మనం సేవ చేయడానికి అబీమెలెకు ఎవరు, షెకెము ఎవరు? అతడు యెరుబ్-బయలు కుమారుడు కాడా? జెబూలు తన క్రింది అధికారి కాడా? మనం షెకెము తండ్రియైన హమోరు కుటుంబానికి సేవ చేద్దాం! అబీమెలెకుకు ఎందుకు మనం సేవ చేయాలి?

29 ఈ ప్రజలు నా ఆధీనంలో ఉండి ఉంటే నేను అతన్ని తొలగించేవాన్ని. ‘నీ సైన్యమంతటిని పిలిపించు!’ అని అబీమెలెకుకు చెప్పేవాన్ని.”

30 పట్టణ అధికారియైన జెబూలు ఎబెదు కుమారుడైన గాలు మాటలను విన్నప్పుడు అతడు చాలా కోప్పడ్డాడు.

31 రహస్యంగా అబీమెలెకు దగ్గరకు దూతలను పంపి, “ఎబెదు కుమారుడైన గాలు అతని సోదరులు షెకెముకు వచ్చి నీ మీదికి పట్టణాన్ని రెచ్చగొడుతున్నారు.

32 కాబట్టి రాత్రివేళ నీవు, నీ మనుష్యులు వచ్చి పొలాల్లో దాక్కొని ఉండండి.

33 ఉదయం సూర్యోదయ సమయంలో పట్టణం మీద దాడి చేయండి. గాలు అతని మనుష్యులు నీ మీదికి వచ్చినప్పుడు అవకాశం చూసి వారిపై దాడి చేయి” అని చెప్పాడు.

34 కాబట్టి అబీమెలెకు, అతని మనుష్యులంతా రాత్రివేళ వచ్చి షెకెము దగ్గర దాక్కొని నాలుగు గుంపులుగా సిద్ధంగా ఉన్నారు.

35 ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణ ద్వారం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, అబీమెలెకు, అతని మనుష్యులు దాక్కున్న స్థలం నుండి బయటకు వచ్చారు.

36 గాలు వారిని చూసినప్పుడు జెబూలుతో, “చూడు, ప్రజలు పర్వత శిఖరాల నుండి వస్తున్నారు!” అన్నాడు. అందుకు జెబూలు, “పర్వతాల నీడలు నీకు మనుష్యులుగా కనబడుతున్నాయి” అన్నాడు.

37 అయితే గాలు మళ్ళీ, “చూడు, దేశపు ఎత్తైన స్థలం నుండి మనుష్యులు దిగివస్తున్నారు, ఓ గుంపు భవిష్యవాణి చెప్పేవారి మస్తకిచెట్టు త్రోవ నుండి వస్తుంది.”

38 అప్పుడు జెబూలు అతనితో, “ ‘మనం అతన్ని సేవించడానికి అబీమెలెకు ఎవడు?’ అని నీవు చెప్పిన గొప్పలు ఏమయ్యాయి, నీవు హేళన చేసింది వీరిని కాదా? ఇప్పుడు లేచి వెళ్లి వారితో పోరాడు!” అన్నాడు.

39 కాబట్టి గాలు షెకెము పౌరులను నడిపిస్తూ వెళ్లి అబీమెలెకుతో పోరాడాడు.

40 అబీమెలెకు అతన్ని ద్వారం వరకు వెంటాడగా వారు పారిపోతూ చాలామంది చంపబడ్డారు.

41 తర్వాత అబీమెలెకు అరుమలో నివసించాడు. జెబూలు గాలును అతని సోదరులను షెకెము నుండి తరిమివేశాడు.

42 మరుసటిరోజు షెకెము ప్రజలు పొలాలలోనికి వెళ్లారు, ఈ విషయం అబీమెలెకుకు తెలిసింది.

43 కాబట్టి అతడు దాడి చేయడానికి పొలాల్లో తన మనుష్యులను మూడు గుంపులుగా చేశాడు. ప్రజలు పట్టణం నుండి రావడం చూసి అతడు లేచి వారిపై దాడి చేశాడు.

44 అబీమెలెకు, అతనితో ఉన్న గుంపులు, ముందుకు వెళ్లి పట్టణ ద్వారం దగ్గర నిలిచి ఉన్నప్పుడు, ఆ రెండు గుంపులు పొలాల్లో ఉన్నవారిపై దాడి చేసి వారిని చంపారు.

45 ఆ రోజంతా అబీమెలెకు పట్టణంపై దాడి చేసి, ముట్టడిచేసి, దాని ప్రజలను చంపాడు. తర్వాత పట్టణాన్ని నాశనం చేసి దానిపై ఉప్పు చల్లాడు.

46 ఈ వార్త విని, షెకెము గోపుర పౌరులు ఏల్-బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడ్డారు.

47 షెకెము గోపుర పౌరులు అక్కడ గుమికూడారని అబీమెలెకు విన్నప్పుడు,

48 అతడు, అతనితో ఉన్న మనుష్యులందరు, సల్మోను కొండ ఎక్కారు. అబీమెలెకు ఒక గొడ్డలి తీసుకుని కొన్ని కొమ్మలను నరికి, తన భుజంపై పెట్టుకున్నాడు. తన మనుష్యులను ఆదేశిస్తూ, “త్వరపడండి! నేను ఏమి చేస్తున్నానో అదే మీరు చేయండి!” అన్నాడు.

49 కాబట్టి ఆ మనుష్యులందరు కొమ్మలు నరికి అబీమెలెకును వెంబడించారు. వారు బలమైన కోటను ముట్టడిచేసి ప్రజలు అందులో ఉన్నప్పుడే దానిని కాల్చారు. కాబట్టి షెకెము గోపురంలో ఉన్న దాదాపు వేయిమంది పురుషులు స్త్రీలు చనిపోయారు.

50 తర్వాత అబీమెలెకు తేబేసుకు వెళ్లి దాని మీద దాడి చేసి దానిని వశపరచుకున్నాడు.

51 అయితే ఆ పట్టణం మధ్యలో బలమైన గోపురం ఉంది. స్త్రీలు, పురుషులు, నాయకులు అందరు దానిలోకి వెళ్లారు. వారు లోనికి వెళ్లి, తాళం వేసుకుని గోపురం కప్పుమీదికి ఎక్కారు.

52 అబీమెలెకు ఆ గోపురం దగ్గరకు వెళ్లి, దానిపై దాడి చేసి దాన్ని కాల్చివేయడానికి ఆ గోపుర ద్వారం దగ్గరకు వెళ్లినప్పుడు,

53 ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరగలి రాతిని పడవేయడంతో అతని కపాలం పగిలింది.

54 అతడు తన ఆయుధాలు మోసేవాన్ని కంగారుగా పిలిచి, “ ‘అబీమెలెకును ఒక స్త్రీ చంపింది’ అని ఎవరూ చెప్పుకోకుండా నీ కత్తి తీసి నన్ను చంపు” అన్నాడు. కాబట్టి అతని దాసుడు అతన్ని పొడవగా అతడు చనిపోయాడు.

55 అబీమెలెకు చనిపోయాడని ఇశ్రాయేలీయులు చూసి తమ గృహాలకు వెళ్లారు.

56 ఈ విధంగా అబీమెలెకు తన డెబ్బైమంది సోదరులను చంపి తన తండ్రికి చేసిన ద్రోహాన్ని దేవుడు తిరిగి అతని మీదికి రప్పించారు.

57 అంతేకాదు, షెకెము వారు కూడా తమ చెడు కార్యాలన్నిటికి వెల చెల్లించేలా దేవుడు చేశారు. యెరుబ్-బయలు కుమారుడైన యోతాము శాపం వారి మీదికి వచ్చింది.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan