Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

న్యాయాధి 2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


బోకీములో యెహోవా దూత

1 యెహోవా దూత గిల్గాలు నుండి వెళ్లి బోకీముకు వెళ్లి ఇలా అన్నాడు, “నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి తీసుకువచ్చి మీ పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన వాగ్దాన దేశానికి మిమ్మల్ని నడిపించాను. ‘నేను మీతో చేసిన నా ఒడంబడికను ఎన్నడు మీరను,

2 మీరు ఈ దేశస్థులతో నిబంధన చేసుకోవద్దు, కాని వారి బలిపీఠాలను పడగొట్టాలి’ అని ఆజ్ఞ ఇచ్చాను. అయినా మీరు నా మాట వినలేదు. మీరెందుకు ఇలా చేశారు?

3 అంతేకాక నేను, ‘వారిని మీ ఎదుట నుండి తరమను; వారు మీకు ఉచ్చుగా ఉంటారు, వారి దేవుళ్ళు మీకు ఉరిగా మారుతారు’ అని చెప్పాను.”

4 యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ విషయాలు చెప్పినప్పుడు ప్రజలు బిగ్గరగా ఏడ్చారు,

5 ఆ స్థలానికి బోకీము అని పేరు పెట్టారు. అక్కడ యెహోవాకు బలులు అర్పించారు.


అవిధేయత అపజయం

6 యెహోషువ ఇశ్రాయేలీయులను పంపించిన తర్వాత వారు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు తమ వారసత్వ స్థలాలకు వెళ్లారు.

7 యెహోషువ జీవించినంత కాలం, అతనికంటే ఎక్కువకాలం జీవించి యెహోవా ఇశ్రాయేలులో చేసిన గొప్ప కార్యాల గురించి తెలిసిన పెద్దలు ఉన్నంతకాలం ప్రజలు యెహోవాను సేవించారు.

8 యెహోవా సేవకుడు, నూను కుమారుడైన యెహోషువ నూటపది సంవత్సరాల వయస్సుగలవాడై చనిపోయాడు.

9 వారు అతన్ని గాయషు పర్వతానికి ఉత్తర దిక్కున ఉన్న ఎఫ్రాయిం కొండ సీమలో ఉన్న తిమ్నత్ హెరెసు అనే తన వారసత్వ భూమిలో పాతిపెట్టారు.

10 ఆ తరమంతా తమ పూర్వికుల దగ్గరకు చేర్చబడిన తర్వాత యెహోవాను, ఆయన ఇశ్రాయేలు కోసం చేసిన కార్యాలు తెలియని వేరే తరం మొదలైంది.

11 ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో చెడు కార్యాలు చేసి బయలు దేవుళ్లను పూజించారు.

12 వారు తమను ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన తమ పూర్వికుల దేవుడైన యెహోవాను తిరస్కరించారు. తమ చుట్టూ ఉన్న జనాంగాల దేవుళ్ళను వెంబడించి పూజించారు. వారు యెహోవాకు కోపం రప్పించారు.

13 వారు యెహోవాను విడిచి, బయలు అష్తారోతు ప్రతిమలను సేవించారు.

14 యెహోవా ఇశ్రాయేలుపై కోపం వచ్చి, వారిని దోచుకునేవారి చేతికి అప్పగించారు. ఆయన వారి చుట్టూ ఉన్న శత్రువుల చేతికి వారిని అమ్మివేశారు, వారు ఆ శత్రువుల ఎదుట నిలువలేకపోయారు.

15 ఇశ్రాయేలు పోరాడడానికి వెళ్లినప్పుడు, యెహోవా వారికి ప్రమాణం చేసినట్టు వారిని ఓడించడానికి ఆయన హస్తం వారికి విరుద్ధంగా ఉండేది. వారు ఎంతో బాధపడ్డారు.

16 అప్పుడు యెహోవా న్యాయాధిపతులను పుట్టించారు. కాబట్టి వారు దోచుకునేవారి చేతిలో నుండి వారిని కాపాడారు.

17 అయినప్పటికీ వారు న్యాయాధిపతుల మాట వినక ఇతర దేవుళ్ళతో వ్యభిచారం చేసి వాటిని పూజించారు. యెహోవా ఆజ్ఞలకు విధేయులైన తమ పూర్వికుల మార్గాల నుండి వారు వెంటనే తప్పిపోయారు.

18 యెహోవా వారి కోసం న్యాయాధిపతిని పుట్టించినప్పుడు, ఆయన ఆ న్యాయాధిపతితో ఉంటూ, అతడు జీవించినంత కాలం వారిని తమ శత్రువుల చేతిలో నుండి రక్షించారు; ఎందుకంటే శత్రువులు వారిని అణచివేస్తూ బాధిస్తుండగా యెహోవా వారి వేదన చూసి జాలిపడ్డారు.

19 అయితే న్యాయాధిపతి చనిపోయిన తర్వాత, ప్రజలు ఇతర దేవుళ్ళను సేవిస్తూ పూజిస్తూ తమ పూర్వికులకంటే మరి ఎక్కువ చెడు మార్గాల్లో నడిచారు. వారి చెడు విధానాలు, మొండి మార్గాలు విడవడాన్ని తిరస్కరించారు.

20 కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయులపై చాలా కోప్పడి, “ఈ ప్రజలు నేను వారి పూర్వికులతో చేసిన నా నిబంధనను మీరి నా మాట వినలేదు కాబట్టి,

21 యెహోషువ చనిపోయినప్పుడు అతడు జయించకుండా మిగిలిన ఏ జనాన్నైనా వారి ఎదుట నుండి నేను వెళ్లగొట్టను.

22 ఇశ్రాయేలీయులు తమ పూర్వికులు జీవించిన ప్రకారం యెహోవా మార్గాలను పాటిస్తారో లేదో అని పరీక్షించడానికి ఆ జనులను వాడుకుంటాను” అన్నారు.

23 ఆ కారణంగానే ఆ జనులను యెహోవా యెహోషువ చేతికి అప్పగించి వెంటనే వెళ్లగొట్టకుండా వారిని ఉండనిచ్చారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan