Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

న్యాయాధి 19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


లేవీయుడు అతని ఉంపుడుగత్తె

1 ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు. అప్పుడు ఎఫ్రాయిం కొండ సీమలో మారుమూల ప్రాంతంలో నివసించే లేవీయుడు ఒకడు యూదాలోని బేత్లెహేముకు లో ఒక ఉంపుడుగత్తెను తెచ్చుకున్నాడు.

2 కాని ఆ ఉంపుడుగత్తె ఒక నమ్మకద్రోహి. ఆమె అతన్ని వదిలి యూదా బేత్లెహేములోని తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది. అక్కడ ఆమె నాలుగు నెలలు ఉన్న తర్వాత,

3 ఆమె భర్త తనను బ్రతిమాలి తీసుకువద్దామని ఆమె దగ్గరకు వెళ్లాడు. అతడు వెళ్తూ తనతో తన పనివాన్ని, రెండు గాడిదలను తీసుకెళ్లాడు. ఆమె అతన్ని తన తండ్రి ఇంట్లోకి తీసుకెళ్లినప్పుడు ఆమె తండ్రి అతన్ని చూసి సంతోషంగా అతన్ని ఆహ్వానించాడు.

4 ఆమె తండ్రి అనగా అతని మామ అతన్ని ఉండమని బలవంతం చేశాడు; కాబట్టి అతడు మూడు రోజులు అతని దగ్గరే తింటూ, త్రాగుతూ, పడుకుంటూ అక్కడే ఉన్నాడు.

5 నాలుగవ రోజు వారు ప్రొద్దున్నే లేచి లేవీయుడు వెళ్లడానికి సిద్ధపడ్డాడు కాని ఆమె తండ్రి తన అల్లుడితో, “భోజనం చేసి సేదతీరిన తర్వాత వెళ్లవచ్చు” అన్నాడు.

6 కాబట్టి వారిద్దరు కూర్చుని కలిసి తిని త్రాగారు. తర్వాత ఆమె తండ్రి తన అల్లునితో, “దయచేసి ఈ రాత్రి సరదాగా గడుపు” అని అన్నాడు.

7 ఆ మనుష్యుడు వెళ్లడానికి లేచినప్పుడు, తన మామ బలవంతం చేశాడు కాబట్టి అతడు ఆ రాత్రి అక్కడే ఉన్నాడు.

8 అయిదవ రోజు ప్రొద్దున అతడు వెళ్లడానికి లేచినప్పుడు, ఆమె తండ్రి, “మధ్యాహ్నం వరకు ఉండి కొంచెం సేద తీర్చుకో” అన్నాడు. కాబట్టి వారిద్దరు కలిసి భోజనం చేశారు.

9 తర్వాత అతడు తన ఉంపుడుగత్తె, తన పనివానితో కలిసి వెళ్లడానికి లేచినప్పుడు, అతని మామ, “ఇదిగో చూడు, సాయంత్రం అవుతుంది, రాత్రి ఇక్కడ గడిపి ప్రొద్దున్నే లేచి మీ దారిన మీ ఇంటికి వెళ్లవచ్చు” అన్నాడు.

10 కాని ఇంకొక రాత్రి ఉండడానికి అతడు ఒప్పుకోకుండా తన ఉంపుడుగత్తెను తీసుకుని కట్టిన రెండు గాడిదలతో యెబూసు అనగా యెరూషలేము వైపు వెళ్లాడు.

11 వారు యెబూసును సమీపించినప్పటికి దాదాపు రోజు గడిచింది. పనివాడు తన యజమానితో, “ఈ యెబూసీయుల పట్టణంలో ఆగి ఈ రాత్రి గడుపుదాం” అన్నాడు.

12 తన యాజమాని జవాబిస్తూ, “లేదు, ఇశ్రాయేలీయులు కాని ఏ ప్రజల పట్టణంలోకి వెళ్లక మనం గిబియాకు వెళ్దాం” అన్నాడు.

13 “మనం గిబియాకు గాని రామాకు గాని చేరి ఒకచోట రాత్రి గడుపుదాం” అన్నాడు.

14 కాబట్టి వారు ముందుకు వెళ్తూ ఉండగా బెన్యామీనులోని గిబియాను చేరుకునేటప్పటికి సూర్యాస్తమయం అయ్యింది.

15 వారు ఆ రాత్రి గడపడానికి గిబియాలో ఆగారు. వారు వెళ్లి పట్టణం మధ్యలో కూర్చున్నారు కాని ఆ రాత్రి ఎవరూ వారిని తమ ఇంట్లోకి ఆహ్వానించలేదు.

16 ఆ సాయంత్రం గిబియాలో నివసిస్తున్న ఎఫ్రాయిం కొండ సీమకు చెందిన ఒక వృద్ధుడు పొలాల్లో పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు (ఆ పట్టణంలో నివసిస్తున్నవారు బెన్యామీనీయులు).

17 ఆ వృద్ధుడు ఊరి మధ్యలో ప్రయాణికున్ని చూసి, “మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ నుండి వస్తున్నారు?” అని అడిగాడు.

18 అందుకతడు, “మేము యూదాలోని బేత్లెహేము నుండి ప్రయాణమై నేను నివసించే ఎఫ్రాయిం కొండసీమలో ఉన్న మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాం, నేను అక్కడివాడను. నేను యూదాలోని బేత్లెహేముకు వెళ్లి వస్తున్నాను. ఇప్పుడు యెహోవా మందిరానికి వెళ్తున్నాను. ఎవరూ నన్ను ఇంటికి చేర్చుకోలేదు.

19 మా గాడిదలకు గడ్డి, ఎండుగడ్డి మేత మా దగ్గర ఉంది. నాకు మీ దాసికి, మాతో ఉన్న యువకుడికి రొట్టె, ద్రాక్షరసం కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మాకెలాంటి ఇబ్బంది లేదు” అన్నాడు.

20 ఆ వృద్ధుడు, “మీకు క్షేమం కలుగును గాక! మీరు మా ఇంటికి రండి, మీకు అవసరమైంది నేను చూసుకుంటాను. ఇలా రాత్రివేళ వీధిలో మాత్రం గడపకండి” అని అన్నాడు.

21 అతడు వారిని ఇంటికి తీసుకెళ్లి తమ గాడిదలకు మేత వేశాడు. వారు తమ కాళ్లు కడుక్కున్న తర్వాత భోజనపానీయాలు పుచ్చుకున్నారు.

22 అలా వారు ఆనందిస్తూ ఉండగా, ఆ పట్టణంలో ఉన్న కొందరు దుష్టులు ఆ ఇంటి చుట్టూ చేరి తలుపును తడుతూ ఆ ఇంటి యజమానియైన ఆ వృద్ధునితో, “నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని బయటకు తీసుకురా, మేము అతనితో పడుకుంటాం” అని బిగ్గరగా అరిచారు.

23 అప్పుడు ఆ ఇంటి యజమాని బయటకు వెళ్లి వారితో అన్నాడు, “అలా అనవద్దు. నా సోదరులారా, అంత నీచానికి దిగజారకండి, ఈ మనిషి నా అతిథి కాబట్టి ఇంత అవమానకరమైన పని చేయవద్దు.

24 ఇదిగో, కన్యగా ఉన్న నా కుమార్తె అతని ఉంపుడుగత్తె ఉన్నారు, వారిని బయటకు తెస్తాను, మీరు వారిని వాడుకొని ఏమి చేయాలనుకుంటే అది చేసుకోండి. అయితే ఈ మనిషి పట్ల ఇంత అవమానకరమైన పని చేయకండి.”

25 అయితే ఆ మనుష్యులు అతని మాట వినలేదు. కాబట్టి ఆ మనుష్యుడు తన ఉంపుడుగత్తెను బయటకు వారి దగ్గరకు పంపాడు, వారు ఆమెను మానభంగం చేస్తూ, రాత్రంతా వేదిస్తూ ఉన్నారు. తెల్లవారినప్పుడు వారు ఆమెను వెళ్లనిచ్చారు.

26 ప్రొద్దున్నే ఆమె తన యజమాని ఉంటున్న ఇంటికి తిరిగివెళ్లి ద్వారం దగ్గర వెలుగు వచ్చేవరకు పడి ఉంది.

27 ప్రొద్దున ఆమె యజమాని లేచి, ఇంటి తలుపు తీసి తన దారిన వెళ్లడానికి బయటకు వచ్చి చూస్తే, అక్కడ ఇంటి ద్వార మార్గంలో తన ఉంపుడుగత్తె తన చేతులు గడప మీద పెట్టుకొని పడి ఉన్నది.

28 అతడు ఆమెతో అన్నాడు, “లే, మనం వెళ్దాము.” అయితే ఆమె నుండి జవాబు రాలేదు. అప్పుడు ఆ మనిషి ఆమెను తన గాడిద మీద ఉంచి ఇంటికి బయలుదేరాడు.

29 అతడు ఇంటికి చేరుకుని ఒక కత్తి తీసుకుని తన ఉంపుడుగత్తెను పన్నెండు ముక్కలుగా ఏ అవయవానికి ఆ అవయవం కోసి, ఇశ్రాయేలీయుల ప్రాంతాలన్నిటికీ పంపాడు.

30 అది చూసినవారందరు, “ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన రోజు నుండి ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఈ విషయమై ఆలోచించండి! మనం ఏమి చేయాలో తెలుపండి!” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan