Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

న్యాయాధి 18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


లాయిషులో దానీయులు స్థిరపడుట

1 ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు. ఆ రోజుల్లో దాను గోత్రికులు తాము స్థిరపడడానికి ఒక స్థలం కోసం వెదుకుతున్నారు, ఎందుకంటే ఇశ్రాయేలు గోత్రాల్లో అప్పటికింకా వారికి వారసత్వం లభించలేదు.

2 కాబట్టి దానీయులు తమ వంశాల నుండి అయిదుగురు సమర్థులైన యోధులను ఎన్నుకుని దానీయులందరి తరుపున జోరహు నుండి ఎష్తాయోలు నుండి దేశాన్ని పరిశీలించడానికి పంపి వారితో, “మీరు వెళ్లి దేశాన్ని పరిశీలించి రండి” అని అన్నారు. కాబట్టి వారు ఎఫ్రాయిం కొండసీమకు వెళ్లి మీకా ఇంటికి వచ్చి అక్కడే ఆ రాత్రి గడిపారు.

3 వారు మీకా ఇంటిని సమీపించినప్పుడు, యువకుడైన లేవీయుని స్వరం గుర్తుపట్టి, అతని దగ్గరకు వెళ్లి అతనితో, “నిన్ను ఇక్కడకు ఎవరు తీసుకువచ్చారు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?” అని అడిగారు.

4 అతడు మీకా తనకు చేసిందంతా వారికి చెప్తూ, “అతడు నన్ను జీతానికి పెట్టుకున్నాడు, నేను అతని యాజకుడిని” అని అన్నాడు.

5 అప్పుడు వారు అతనితో, “మా ప్రయాణం సఫలమవుతుందో లేదో దయచేసి దేవుని దగ్గర విచారించి మాకు చెప్పు” అని అన్నారు.

6 యాజకుడు వారికి జవాబిస్తూ, “క్షేమంగా వెళ్లండి, మీ ప్రయాణానికి యెహోవా యొక్క ఆమోదం ఉంది” అన్నాడు.

7 కాబట్టి ఆ అయిదుగురు మనుష్యులు ప్రయాణిస్తూ లాయిషుకు వచ్చి అక్కడి ప్రజలు సీదోనీయుల్లా సమాధానం భద్రత కలిగి క్షేమంగా జీవించడం చూశారు. ఆ దేశాన్ని ఆక్రమించుకుని వారిని బాధించేవారు ఎవరూ లేరని, వారు వృద్ధి చెందుతున్నారని చూశారు. అంతేకాక వారు సీదోనీయులకు దూరంగా ఉంటూ ఎవరితో సంబంధం లేకుండా ఉండడం చూశారు.

8 వారు జోరహుకు ఎష్తాయోలుకు తిరిగి వచ్చినప్పుడు, వారి తోటి దానీయులు, “మీరు ఏం తెలుసుకున్నారు?” అని వారిని అడిగారు.

9 వారు జవాబిస్తూ, “పదండి, వారి మీద దాడి చేద్దాం! ఆ ప్రాంతాన్ని చూశాం, అది చాలా బాగుంది. ఇంకా వేచి ఉండడం ఎందుకు? వెళ్లి స్వాధీనం చేసుకోవడానికి ఆలస్యం చేయవద్దు,

10 మీరు అక్కడికి చేరిన తర్వాత ధైర్యంగా ఉన్న జనాన్ని విశాల ప్రదేశాన్ని, ఏ కొరత లేని స్థలాన్ని మీరు చూస్తారు, దానిని దేవుడు మీ చేతులకు అప్పగిస్తారు” అన్నారు.

11 అప్పుడు దాను గోత్రం నుండి ఆరువందలమంది యుద్ధం చేయడానికి ఆయుధాలు ధరించి జోరహు, ఎష్తాయోలు నుండి బయలుదేరారు.

12 వారు ప్రయాణమై యూదాలోని కిర్యత్-యారీము దగ్గర మకాం చేశారు. అందుకు ఈనాటికీ కిర్యత్-యారీముకు పడమరగా ఉన్న స్థలాన్ని మహానే-దాను అంటారు.

13 వారు అక్కడినుండి ఎఫ్రాయిం కొండ సీమకు వెళ్లి మీకా ఇంటికి వచ్చారు.

14 అప్పుడు లాయిషు ప్రాంతానికి వేగులవారిగా వెళ్లిన ఆ అయిదుగురు తమ తోటి దానీయులతో, “ఈ ఇళ్ళలో ఒక ఇంట్లో ఏఫోదు, కొన్ని గృహదేవతలు, వెండితో పొదిగించిన విగ్రహం ఉన్నాయని మీకు తెలుసా? ఇప్పుడు ఏమి చేయాలో ఆలోచించండి” అన్నారు.

15 కాబట్టి వారు తిరిగి ఆ లేవీ యువకుడు నివసిస్తున్న మీకా ఇంటికి వెళ్లి, అతన్ని క్షేమసమాచారం అడిగారు.

16 ద్వారం దగ్గర యుద్ధాయుధాలు ధరించిన ఆరువందలమంది దానీయులు నిలబడ్డారు.

17 యాజకుడు, యుద్ధాయుధాలు ధరించిన ఆరువందలమంది ద్వారం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, దేశాన్ని పరిశోధించడానికి వెళ్లిన ఆ అయిదుగురు మనుష్యులు లోనికి వెళ్లి విగ్రహాన్ని, ఏఫోదును గృహదేవతలను తీసుకున్నారు.

18 ఆ అయిదుగురు మీకా ఇంట్లోకి వెళ్లి విగ్రహాన్ని, ఏఫోదును, గృహదేవతలను తీసుకున్నప్పుడు, ఆ యాజకుడు, “మీరు ఏం చేస్తున్నారు?” అని వారిని అడిగాడు.

19 వారు అతనితో, “నోరు మూసుకో! ఒక్క మాట మాట్లాడకుండ మాతో వచ్చి మాకు తండ్రిగా యాజకునిగా ఉండు. ఒక మనిషి కుటుంబానికి మాత్రమే యాజకునిగా ఉండడం కంటే ఇశ్రాయేలులో ఒక గోత్రమంతటికి, కుటుంబానికి యాజకునిగా ఉండడం మంచిది కాదా?” అన్నారు.

20 యాజకుడు చాలా సంతోషించాడు. అతడు ఏఫోదును, గృహదేవతలను, విగ్రహాన్ని తీసుకుని ఆ ప్రజలతో వెళ్లాడు.

21 వారు తమ చిన్న పిల్లలను, పశువులను, ఆస్తులను ముందుగా పెట్టుకొని అక్కడినుండి బయలుదేరారు.

22 వారు మీకా ఇంటి నుండి కొంత దూరం వెళ్లాక, మీకా పొరుగువారు సమకూడి దానీయుల వెంటపడ్డారు.

23 వారు కేకలు వేస్తుండగా, దానీయులు తిరిగి మీకాను, “నీ మనుష్యులను పోరాడడానికి పిలిచావు, నీకేమి కావాలి?” అని అడిగారు.

24 మీకా జవాబిస్తూ, “నేను చేసిన దేవుళ్ళను, నా యాజకుని మీరు తీసుకెళ్లారు. ఇక నా దగ్గర ఏముంది? ‘ఏంటి విషయం?’ అని నన్ను అడుగుతారేంటి?” అన్నాడు.

25 దానీయులు అతనితో అన్నారు, “మాతో వాదించకు; కోపంతో మా మనుష్యుల్లో కొందరు నీపై దాడి చేసి నిన్ను నీ కుటుంబాన్ని చంపుతారు.”

26 కాబట్టి దానీయులు తమ దారిన తాము వెళ్లిపోయారు. వారు అతనికంటే బలంగా ఉన్నారని గ్రహించి, మీకా తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు.

27 దానీయులు మీకా తయారుచేసుకున్న వాటిని, అతని యాజకుడిని తీసుకుని లాయిషుపై, సమాధాన భద్రతలతో ఉన్న ప్రజలను చేరుకున్నారు. వారిపై ఖడ్గంతో దాడి చేసి, పట్టణాన్ని తగలబెట్టారు.

28 ఆ ప్రజలు సీదోనుకు దూరంగా ఉండడం, ఎవరితో సంబంధం లేకపోవడం చేత వారిని కాపాడే మనుష్యులే లేరు. ఆ పట్టణం బేత్-రెహోబు దగ్గర లోయలో ఉంది. దానీయులు ఆ పట్టణాన్ని పునర్నిర్మించి అక్కడ స్థిరపడ్డారు.

29 దానికి ఇశ్రాయేలు కుమారుడైన దాను అని తమ పూర్వికుడైన దాను పేరు పెట్టారు; మొదట ఆ పట్టణం లాయిషు అని పిలువబడేది.

30 అక్కడ దానీయులు తమ కోసం ఆ విగ్రహాన్ని నిలుపుకున్నారు. దేశం చెరగా అయ్యేవరకు, మోషే కుమారుడు గెర్షోము యొక్క కుమారుడైన యోనాతాను, అతని కుమారులు దాను గోత్రానికి యాజకులుగా ఉన్నారు.

31 షిలోహులో దేవుని మందిరం ఉన్న కాలమంతా వారు మీకా చేసిన విగ్రహాన్ని పూజించారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan