Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

న్యాయాధి 13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


సంసోను జననం

1 ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు, కాబట్టి యెహోవా వారిని నలభై సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు.

2 జోరహులో దాను వంశానికి చెందిన మనోహ అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య గొడ్రాలు కాబట్టి ఆమెకు పిల్లలు లేరు.

3 యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, “నీవు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు, అయితే నీవు గర్భం ధరించి కుమారునికి జన్మనిస్తావు.

4 కాబట్టి నీవు ద్రాక్షరసం కాని మద్యం కాని త్రాగకుండ జాగ్రతపడాలి, అపవిత్రమైనది ఏది తినకూడదు.

5 నీవు గర్భవతివై కుమారుని కంటావు, ఆ బాలుని జుట్టు ఎప్పటికీ కత్తిరించకూడదు ఎందుకంటే పుట్టుక నుంచే అతడు నాజీరుగా, దేవునికి ప్రతిష్ఠ చేయబడతాడు. ఫిలిష్తీయుల చేతుల్లో నుండి అతడు ఇశ్రాయేలును రక్షించడం ప్రారంభిస్తాడు.”

6 అప్పుడు ఆ స్త్రీ తన భర్త దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది: “ఓ దైవజనుడు నా దగ్గరకు వచ్చాడు, అతడు దేవుని దూతలా చాలా భయం పుట్టించేవానిలా ఉన్నాడు. అతడు ఎక్కడ నుండి వచ్చాడో నేను అడగలేదు, అతడు నాకు తన పేరు చెప్పలేదు.

7 అయితే అతడు నాతో, ‘నీవు గర్భవతివై కుమారుని కంటావు. నీవు ద్రాక్షరసం కాని మద్యం కాని త్రాగకూడదు, అపవిత్రమైనదేది తినకూడదు ఎందుకంటే ఆ బాలుడు పుట్టుక నుండి చనిపోయే దినం వరకు దేవునికి నాజీరుగా ఉంటాడు.’ ”

8 అప్పుడు మనోహ యెహోవాకు, “ప్రభువా, మీ దాసునిపై దయ చూపించండి. పుట్టబోయే బాలున్ని ఎలా పెంచాలో మాకు బోధించడానికి మీరు పంపిన దైవజనున్ని మళ్ళీ పంపమని వేడుకుంటున్నాను” అని ప్రార్ధించాడు.

9 దేవుడు మనోహ ప్రార్ధన విన్నారు. ఆ స్త్రీ పొలంలో ఉన్నప్పుడు ఆ దేవదూత మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చాడు; కాని అప్పుడు తన భర్త మనోహ ఆమెతో లేడు.

10 ఆ స్త్రీ తన భర్త దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, “ఆ రోజు నాకూ ప్రత్యక్షమైన వ్యక్తి మళ్ళీ కనిపించాడు” అని చెప్పింది.

11 మనోహ లేచి తన భార్య వెంట వెళ్లి ఆ మనిషి, ఆ మనిషి దగ్గరకు వచ్చి, “నా భార్యతో మాట్లాడినది నీవేనా?” అని చెప్పాడు. “నేనే” అని అతడు అన్నాడు.

12 కాబట్టి మనోహ, “నీవు చెప్పింది జరిగాక ఆ బాలుడు ఎలా జీవించాలి, ఏమి చేయాలి?” అని అతన్ని అడిగాడు.

13 యెహోవా దూత, “నేను నీ భార్యతో చెప్పినదంతా ఆమె చేయాలి.

14 ఆమె ద్రాక్షావల్లి నుండి వచ్చేది ఏదీ తినకూడదు, ద్రాక్షరసం మద్యం పుచ్చుకోకూడదు, అసలు అపవిత్రమైనదేది తినకూడదు. నేను ఆజ్ఞాపించిన ప్రతిదీ ఆమె చేయాలి” అన్నాడు.

15 మనోహ యెహోవా దూతతో, “మేము నీకోసం మేకపిల్లను సిద్ధపరచే వరకు దయచేసి ఇక్కడ ఉండండి” అన్నాడు.

16 అందుకు యెహోవా దూత, “మీరు ఆపినా సరే, నేను మీ ఆహారంలో ఏది తినను. అయితే మీరు దహనబలి సిద్ధపరిస్తే, అది యెహోవాకు అర్పించాలి” అన్నాడు (అతడు యెహోవా దూత అని మనోహ గ్రహించలేదు.)

17 అప్పుడు మనోహ యెహోవా దూతను, “నీవు చెప్పింది జరిగాక మేము నిన్ను గౌరవించాలి కాబట్టి నీ పేరేంటి?”

18 యెహోవా దూత జవాబిస్తూ, “నా పేరెందుకు అడుగుతున్నావు, అది నీ గ్రహింపుకు మించింది” అన్నాడు.

19 మనోహ భోజనార్పణతో పాటు ఒక మేకపిల్లను తెచ్చి రాతి మీద యెహోవాకు అర్పించాడు. అప్పుడు మనోహ, అతని భార్య చూస్తూ ఉండగా యెహోవా దూత అద్భుతం చేశాడు.

20 ఆ బలిపీఠం నుండి మంటలు ఆకాశం వైపు లేస్తూవుంటే, ఆ మంటలతో పాటు యెహోవా దూత పైకి వెళ్లిపోయాడు. ఇది చూసి మనోహ, అతని భార్య నేల మీద సాష్టాంగపడ్డారు.

21 ఆ తర్వాత యెహోవా దూత మనోహకు, అతని భార్యకు మళ్ళీ ప్రత్యక్షం కాలేదు. అతడు యెహోవా దూత అని మనోహ గ్రహించాడు.

22 “మనం చచ్చిపోతాం! మనం దేవున్ని చూశాం!” అని మనోహ తన భార్యతో అన్నాడు.

23 అయితే అతని భార్య, “యెహోవా మనలను చంపాలని అనుకుంటే, మన చేతులతో అర్పించిన దహనబలిని గాని భోజనార్పణను గాని ఆయన అంగీకరించేవారు కారు, వీటన్నిటిని మనకు చూపించేవారు కారు, ఇప్పుడిది మనకు చెప్పేవారు కారు” అని చెప్పింది.

24 ఆ స్త్రీకి ఒక బాలుడు పుట్టగా అతనికి సంసోను అని పేరు పెట్టింది. అతడు పెద్దయ్యాక యెహోవా అతన్ని ఆశీర్వదించారు.

25 అతడు జోరహు, ఎష్తాయోలు మధ్యలో మహెనుదాను అనే స్థలంలో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతన్ని పురికొల్పడం మొదలుపెట్టాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan