యెషయా 7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంఇమ్మానుయేలు గురించి సూచన 1 యూదా రాజైన ఉజ్జియాకు పుట్టిన యోతాము కుమారుడైన ఆహాజు కాలంలో సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చారు కాని అది వారు జయించలేకపోయారు. 2 అప్పుడు దావీదు ఇంటివారికి, “అరాము ఎఫ్రాయిముతో పొత్తు పెట్టుకుంది” అని తెలియజేయబడింది; కాబట్టి గాలికి అడవి చెట్లు కదిలినట్లు ఆహాజు, అతని ప్రజల హృదయాలు వణికాయి. 3 అప్పుడు యెహోవా యెషయాతో ఇలా అన్నారు, “ఆహాజును కలుసుకోడానికి నీవు, నీ కుమారుడైన షెయార్యాషూబు చాకలి రేవుకు వెళ్లే దారిలో ఉన్న పై కోనేటి కాలువ చివరికి వెళ్లండి. 4 అతనితో, ‘జాగ్రత్త, నెమ్మదిగా ఉండు, భయపడకు. పొగరాజుకుంటున్న ఈ రెండు కాగడాలకు అనగా రెజీను, అరాము, రెమల్యా కుమారుడైన పెకహు యొక్క తీవ్రమైన కోపానికి అధైర్యపడకు. 5 అరాము, ఎఫ్రాయిం, రెమల్యా కుమారుడు నీకు కీడు చేయాలని కుట్రపన్ని, 6 “మనం యూదాపై దాడి చేద్దాము; మనం దానిని చీల్చివేసి, మన మధ్యలో పంచుకుందాం, టాబెయేలు కుమారున్ని దానికి రాజుగా చేద్దాం” అని చెప్పుకున్నారు.’ ” 7 అయితే ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “అది నిలబడదు, అలా జరుగదు. 8 ఎందుకంటే అరాము రాజధాని దమస్కు. దమస్కు రాజు రెజీను మాత్రమే. అరవై అయిదు సంవత్సరాలు కాకముందే ఎఫ్రాయిం ఒక జాతిగా ఉండకుండా నాశనం అయిపోతుంది. 9 ఎఫ్రాయిముకు సమరయ రాజధాని, సమరయకు రెమల్యా కుమారుడు రాజు. మీరు మీ విశ్వాసంలో స్థిరంగా ఉండకపోతే మీరు క్షేమంగా ఉండలేరు.” 10 యెహోవా ఆహాజుతో మరలా మాట్లాడుతూ, 11 “నీ దేవుడైన యెహోవాను ఒక సూచన అడుగు. అది పాతాళమంత లోతైనా సరే, ఆకాశమంత ఎత్తైనా సరే” అన్నారు. 12 అయితే ఆహాజు, “నేను అడగను, యెహోవాను పరీక్షించను” అన్నాడు. 13 అప్పుడు యెషయా, “దావీదు కుటుంబమా! వినండి. మనుష్యుల ఓపికను పరీక్షించడం సరిపోదని, నా దేవుని ఓపికను కూడా పరీక్షిస్తున్నారా? 14 కాబట్టి, ప్రభువే స్వయంగా మీకు ఒక సూచన ఇస్తారు: ఇదిగో ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. 15 తప్పును తిరస్కరించి, సరియైనది ఎంచుకోవడం తెలిసినప్పుడు అతడు పెరుగు, తేనె తింటాడు. 16 ఎందుకంటే తప్పును తిరస్కరించి సరియైనది ఎంచుకునే తెలివి ఆ బాలునికి రాకముందు నిన్ను భయపెట్టే ఆ ఇద్దరు రాజుల దేశాలు పాడుచేయబడతాయి. 17 యెహోవా నీ మీదికి, నీ ప్రజలమీదికి, నీ తండ్రి ఇంటి మీదికి, ఎఫ్రాయిం యూదా నుండి విడిపోయిన రోజు నుండి ఇప్పటివరకు రాని రోజులను రప్పిస్తారు. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పిస్తారు” అని అన్నాడు. అష్షూరు యెహోవా పనిముట్టు 18 ఆ రోజున ఈజిప్టులో నైలు నది పాయల నుండి ఈగలను, అష్షూరు దేశం నుండి కందిరీగలను యెహోవా ఈలవేసి పిలుస్తారు. 19 అవన్నీ వచ్చి మెట్ట కనుమలలో, రాళ్ల పగుళ్లలో, ముళ్ళపొదల్లో, పచ్చికబయళ్లలో నివసిస్తాయి. 20 ఆ రోజున యెహోవా యూఫ్రటీసు నది అవతలి నుండి కూలికి తెచ్చిన మంగలకత్తితో అనగా, అష్షూరు రాజుతో మీ తలవెంట్రుకలు కాళ్లవెంట్రుకలు క్షౌరం చేయిస్తారు. అది మీ గడ్డాలను కూడా గీసివేస్తారు. 21 ఆ రోజున ఒకనికి ఒక చిన్న ఆవు రెండు గొర్రెలు ఉంటాయి. 22 అవి సమృద్ధిగా ఇచ్చిన పాలవలన అతడు తినడానికి పెరుగు ఉంటుంది. ఆ దేశంలో మిగిలిన వారందరు పెరుగు, తేనె తింటారు. 23 ఆ రోజున వెయ్యి వెండి షెకెళ్ళు విలువ కలిగిన వెయ్యి ద్రాక్షతీగెలు ఉన్న ప్రతిచోట గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటాయి. 24 ఆ దేశమంతా గచ్చపొదలు ముళ్ళతో నిండి ఉంటుంది కాబట్టి బాణాలు విల్లులు పట్టుకుని వేటగాళ్లు అక్కడికి వెళ్తారు. 25 గచ్చపొదలకు, ముళ్ళకు భయపడి పారతో సాగుచేసిన కొండలన్నిటికి మీరు దూరంగా ఉంటారు; ఆ స్థలాలు పశువులు తిరగడానికి, గొర్రెలు త్రొక్కడానికి ఉపయోగపడతాయి. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.