Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 57 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 నీతిమంతులు నశిస్తారు, ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోరు; భక్తులు మాయమైపోతారు, కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడడం ఎవరూ గ్రహించరు.

2 యథార్థంగా జీవించేవారు సమాధానంలో ప్రవేశిస్తారు; వారు చనిపోయినప్పుడు వారికి విశ్రాంతి కలుగుతుంది.

3 “అయితే మంత్రగత్తె పిల్లలారా! వ్యభిచారసంతానమా! వేశ్యసంతానమా! ఇక్కడకు రండి.

4 మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? ఎవరిని చూసి వెక్కిరిస్తూ మీ నాలుక చాపుతున్నారు మీరు తిరుగుబాటుదారులు, అబద్ధికుల సంతానం కాదా?

5 మీరు సింధూర వృక్షాల క్రింద పచ్చని ప్రతి చెట్టు క్రింద కామంతో రగిలిపోతున్నారు; మీరు కనుమలలో, రాతిసందుల క్రింద మీ పిల్లలను బలి ఇస్తారు.

6 కనుమలలోని నున్నని రాళ్ల మధ్యలో ఉన్న విగ్రహాలు మీ భాగము; నిజంగా అవే మీకు భాగము. అవును వాటికి మీ పానార్పణలు పోశారు, భోజనార్పణలు చెల్లించారు. ఇదంతా చూసి నేను క్షమించాలా?

7 చాలా ఎత్తైన పర్వతం మీద మీరు మీ పరుపు వేసుకున్నారు; బలులు అర్పించడానికి అక్కడికి ఎక్కి వెళ్లారు.

8 తలుపుల వెనుక ద్వారబంధాల వెనుక మీ యూదేతర గుర్తులు పెట్టారు. నన్ను విడిచిపెట్టి మీ పరుపును పరిచారు దాని మీదకు ఎక్కి దానిని వెడల్పు చేశారు; మీరు వారి మంచాలను ప్రేమించి వారితో నిబంధన చేసుకున్నారు. వారి నగ్న శరీరాలను కామంతో చూశారు.

9 మీరు ఒలీవనూనె తీసుకుని మోలెకు దగ్గరకు వెళ్లారు ఎన్నో సుగంధ ద్రవ్యాలను తీసుకెళ్లారు. మీరు మీ రాయబారులను దూరప్రాంతానికి పంపించారు; మీరు పాతాళమంత లోతుగా దిగబడిపోయారు!

10 మీరు దూర ప్రయాణాలు చేసి అలసిపోయారు, అయినా ‘అది సాధ్యం కాదు’ అని మీరు అనుకోలేదు. మీరు మీ తిరిగి బలం పొందుకున్నారు కాబట్టి మీరు సొమ్మసిల్లలేదు.

11 “మీరు ఎవరికి జడిసి భయపడి నా పట్ల నిజాయితీగా లేకుండా, నన్ను జ్ఞాపకం చేసుకోకుండా దీనిని పట్టించుకోకుండా ఉన్నారు? చాలా కాలం నేను మౌనంగా ఉన్నానని మీరు నాకు భయపడడం లేదు కదా?

12 నీ నీతిని పనులను నేను బయటపెడతాను అవి మీకు ప్రయోజనకరంగా ఉండవు.

13 మీరు సహాయం కోసం మొరపెట్టినప్పుడు మీరు సేకరించిన మీ విగ్రహాలే మిమ్మల్ని రక్షించాలి! గాలి వాటన్నిటిని తీసుకెళ్తుంది, కేవలం ఒకని ఊపిరి వాటిని చెదరగొడుతుంది. అయితే నన్ను ఆశ్రయించినవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.”


పశ్చాత్తాపం చెందిన వారికి ఆదరణ

14 ఇలా చెప్పబడుతుంది: “కట్టండి, కట్టండి, దారిని సిద్ధపరచండి! నా ప్రజల మార్గంలో నుండి అడ్డుగా ఉన్నవాటిని తీసివేయండి.”

15 ఎందుకంటే మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసియైన దేవుడు ఇలా చెప్తున్నారు: “నేను ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాను, అంతేకాక వినయం గలవారి ఆత్మకు చైతన్యం కలిగించడానికి నలిగినవారి ప్రాణానికి చైతన్యం కలిగించడానికి ఆత్మలో వినయం, దీనమనస్సు గలవారి దగ్గర నివసిస్తాను.

16 నేను వారిని నిత్యం నిందించను, నేను ఎప్పుడు కోపంగా ఉండను ఎందుకంటే నా వలన వారు నీరసించిపోతారు. నేను పుట్టించిన ప్రజలు నీరసించిపోతారు.

17 వారి పాపిష్ఠి దురాశను బట్టి కోప్పడ్డాను నేను వారిని శిక్షించి కోపంతో నా ముఖం త్రిప్పుకున్నాను, అయినా వారు తమకిష్టమైన మార్గాల్లో నడుస్తూ ఉన్నారు.

18 నేను వారి మార్గాలను చూశాను, కాని వారిని బాగుచేస్తాను; నేను వారిని నడిపించి ఇశ్రాయేలులో దుఃఖించేవారిని ఓదారుస్తూ,

19 వారి పెదవులపై స్తుతి కలుగజేస్తాను. దూరంగా ఉన్నవారికి దగ్గరగా ఉన్నవారికి సమాధానం, సమాధానం” అని యెహోవా అంటున్నారు. “నేను వారిని బాగుచేస్తాను.”

20 దుర్మార్గులు ఎగసిపడే సముద్రం వంటివారు. అది నెమ్మదిగా ఉండలేదు, దాని అలలు బురదను మురికిని పైకి తెస్తాయి.

21 “దుర్మార్గులకు సమాధానం ఉండదు” అని నా దేవుడు చెప్తున్నారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan