Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 51 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


సీయోనుకు శాశ్వతమైన రక్షణ

1 “నీతిని అనుసరిస్తూ యెహోవాను వెదికే వారలారా, నా మాట వినండి: మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో దానివైపు చూడండి, మీరు ఏ గని నుండి తీయబడ్డారో దానివైపు చూడండి;

2 మీ తండ్రియైన అబ్రాహామును, మీకు జన్మనిచ్చిన శారాను చూడండి, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను, అతన్ని ఆశీర్వదించి అతన్ని అనేకమందిగా చేశాను.

3 యెహోవా తప్పకుండా సీయోనును ఓదారుస్తారు దాని శిథిలాలన్నిటిని దయతో చూస్తారు; దాని ఎడారులను ఏదెనులా చేస్తారు. దాని బీడుభూములను యెహోవా తోటలా చేస్తారు. ఆనంద సంతోషాలు, కృతజ్ఞతాస్తుతులు, సంగీత ధ్వనులు దానిలో కనబడతాయి.

4 “నా ప్రజలారా, మా మాట వినండి; నా దేశమా, నా మాట విను: నా దగ్గర నుండి ఒక హెచ్చరిక వెళ్తుంది; నా న్యాయం దేశాలకు వెలుగుగా మారుతుంది.

5 నా నీతి వేగంగా సమీపిస్తుంది, నా రక్షణ మార్గంలో ఉంది. నా చేయి దేశాలకు తీర్పు తీరుస్తుంది. ద్వీపాలు నా వైపు చూస్తాయి, నిరీక్షణతో నా చేయి కోసం వేచి ఉంటాయి.

6 ఆకాశాల వైపు మీ కళ్ళెత్తి చూడండి, క్రిందున్న భూమిని చూడండి; ఆకాశాలు పొగలా మాయమైపోతాయి, భూమి వస్త్రంలా పాతబడిపోతుంది దాని నివాసులు జోరీగల్లా చనిపోతారు. అయితే నా రక్షణ నిత్యం ఉంటుంది, నా నీతి ఎన్నటికీ విఫలం కాదు.

7 “సరియైనది తెలిసినవారలారా, నా మాట వినండి. నా బోధను హృదయంలో ఉంచుకున్న ప్రజలారా, వినండి: కేవలం మనుష్యులు వేసే నిందలకు భయపడకండి వారి దూషణకు దిగులుపడకండి.

8 వస్త్రాన్ని కొరికినట్లు చిమ్మెట వారిని తినివేస్తుంది; పురుగు బొచ్చును కొరికినట్లు వారిని మ్రింగివేస్తుంది. అయితే నా నీతి నిత్యం ఉంటుంది, నా రక్షణ తరతరాలు ఉంటుంది.”

9 యెహోవా హస్తమా, మేలుకో మేలుకో, బలాన్ని ధరించుకో! పాత తరంలో ఉన్నట్లు గడచిన కాలంలో ఉన్నట్లు లేచిరా. రాహాబును ముక్కలుగా నరికింది నీవే కదా? సముద్రపు మృగాన్ని పొడిచింది నీవే కదా?

10 సముద్రాన్ని లోతైన జలాలను ఎండిపోయేలా చేసింది నీవే కదా, విడిపించబడిన వారు దాటి వెళ్లేలా సముద్ర లోతుల్లో దారి చేసింది నీవే కదా?

11 యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు. వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు; నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది. వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు. దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.

12 “నేను నేనే మిమ్మల్ని ఓదార్చుతాను. చనిపోయే మనుష్యులకు గడ్డివంటి మనుష్యులకు మీరు ఎందుకు భయపడతారు?

13 ఆకాశాలను విస్తరింపజేసి భూమి పునాదులను వేసిన మీ సృష్టికర్తయైన యెహోవాను ఎందుకు మరచిపోయారు? బాధించేవాడు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాని కోపాన్ని చూసి ప్రతిరోజు ఎందుకు భయపడుతూ బ్రతుకుతున్నారు? బాధించేవాని కోపం ఏమయ్యింది?

14 క్రుంగిపోయిన ఖైదీలు త్వరలో విడుదల పొందుతారు; వారు తమ చెరసాల గోతిలో చనిపోరు. వారికి ఆహారం తక్కువకాదు.

15 నేను మీ దేవుడనైన యెహోవాను, సముద్రపు అలలు ఘోషించేలా నేను దానిని రేపుతాను. సైన్యాల యెహోవా అని ఆయనకు పేరు.

16 నీ నోటిలో నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను, నేను ఆకాశాలను స్థాపించాను, భూమి పునాదులు వేసినవాడను ‘మీరే నా ప్రజలు’ అని సీయోనుతో చెప్పాను.”


యెహోవా ఉగ్రత పాత్ర

17 యెరూషలేమా లే, మేలుకో, మేలుకో! యెహోవా ఉగ్రత పాత్రను ఆయన చేతి నుండి తీసుకుని నీవు త్రాగావు. ప్రజలను తడబడేలా చేసే పాత్రలోనిది అంతా మడ్డితో సహా పూర్తిగా నీవు త్రాగావు.

18 ఆమెకు పుట్టిన పిల్లలందరిలో తనకు దారి చూపడానికి ఎవరూ లేరు; ఆమె పెంచిన పిల్లలందరిలో తన చేతిని పట్టుకునే వారెవరూ లేరు.

19 ఈ రెండు విపత్తులు నీ మీదికి వచ్చాయి. నిన్ను ఎవరు ఓదార్చగలరు? విధ్వంసం, వినాశనం, కరువు, ఖడ్గం నీ మీదికి వచ్చాయి, నిన్ను ఎవరు ఆదరించగలరు?

20 నీ పిల్లలు మూర్ఛపోయారు. దుప్పి వలలో చిక్కుకున్నట్లు ప్రతి వీధి మూలల్లో వారు పడిపోయారు. యెహోవా ఉగ్రతతో నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు.

21 ద్రాక్షరసం లేకుండానే మత్తులో మునిగి శ్రమపడినదానా, ఈ మాట విను.

22 తన ప్రజల కోసం వాదించే నీ దేవుడు నీ ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, నిన్ను తడబడేలా చేసే పాత్రను, నా ఉగ్రత పాత్రను నీ చేతిలో నుండి తీసివేశాను. నీవు మరలా దానిని త్రాగవు.

23 ‘మేము మీమీద నడిచేటట్లు క్రింద పడుకో’ అని నీతో చెప్పి నిన్ను బాధపెట్టేవాని చేతుల్లో దానిని పెడతాను, నీవు నీ వీపును నేలకు వంచి నడిచి వెళ్లడానికి ఒక వీధిగా చేశావు.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan