Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


ద్రాక్షతోట గీతం

1 నా ప్రియుని గురించి పాడతాను. తన ద్రాక్షతోట గురించి పాట పాడతాను: సారవంతమైన కొండమీద నా ప్రియునికి ఒక ద్రాక్షతోట ఉండేది.

2 ఆయన దానిని త్రవ్వి రాళ్లను ఏరి బాగుచేసి అందులో శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలు నాటాడు. దానిలో కాపలా గోపురం కట్టాడు ద్రాక్షతొట్టిని తొలిపించాడు. మంచి ద్రాక్షపండ్లు కాయాలని ఆయన ఎదురుచూశాడు, కాని దానిలో చెడ్డ ద్రాక్షలు కాసాయి.

3 “కాబట్టి యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా, నాకు, నా ద్రాక్షతోటకు మధ్య న్యాయం చేయండి.

4 నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే దానికి ఇంకేమి చేయాలి? మంచి ద్రాక్షపండ్ల కోసం నేను చూస్తే ఎందుకు అది చెడ్డ ద్రాక్షలను కాసింది?

5 నా ద్రాక్షతోటకు నేనేమి చేయబోతున్నానో ఇప్పుడు మీకు చెప్తాను. దాని కంచె నేను తీసివేస్తాను అప్పుడు అది నాశనం అవుతుంది; దాని గోడను పడగొడతాను అప్పుడు అది త్రొక్కబడుతుంది.

6 నేను దానిని బంజరు భూమిలా చేస్తాను, అది త్రవ్వరు, సాగు చేయరు, అక్కడ గచ్చపొదలు ముళ్ళచెట్లు పెరుగుతాయి. దానిపై వర్షం కురిపించవద్దని మేఘాలను ఆజ్ఞాపిస్తాను.”

7 ఇశ్రాయేలు వంశం సైన్యాల యెహోవా ద్రాక్షతోట, యూదా ప్రజలు ఆయన ఆనందించే ద్రాక్షలు. ఆయన న్యాయం కోసం చూడగా రక్తపాతం కనబడింది; నీతి కోసం చూడగా రోదనలు వినబడ్డాయి.


శ్రమలు, తీర్పులు

8 చోటు మిగులకుండ మీరు మాత్రమే దేశంలో నివసించేలా ఇంటికి ఇల్లు, పొలానికి పొలం కలుపుకునేవారికి శ్రమ.

9 నేను వినేలా సైన్యాల యెహోవా చెప్పిన మాట: “నిజంగా గొప్ప ఇల్లు ఖాళీగా అయిపోతాయి, చక్కటి భవనాలు నివాసులు లేక పాడైపోతాయి.

10 పది ఎకరాల ద్రాక్షతోట ఒక బాతు ద్రాక్షరసాన్నే ఇస్తుంది. హోమెరు గింజలు ఒక ఏఫా పంట మాత్రమే ఇస్తాయి.”

11 మద్యం త్రాగడానికి ఉదయాన్నే లేచి మత్తెక్కే వరకు చాలా రాత్రివరకు త్రాగే వారికి శ్రమ.

12 వారు సితారాలు, తంతి వాయిద్యాలు, కంజరలు, పిల్లనగ్రోవులు వాయిస్తూ ద్రాక్షరసం త్రాగుతూ విందు చేసుకుంటారు, కాని యెహోవా చేస్తున్న దానిని వారు గుర్తించరు ఆయన చేతిపనిని గౌరవించరు.

13 కాబట్టి నా ప్రజలు తెలివిలేక బందీలుగా వెళ్తున్నారు. వారిలో ఘనులు ఆకలితో చనిపోతారు. సామాన్య ప్రజలు దప్పికతో ఎండిపోతారు.

14 కాబట్టి మరణం తన దవడలను పెద్దగా తన నోరు వెడల్పుగా తెరుస్తుంది. అందులోకి యెరూషలేము సంస్థానాధిపతులు, సామాన్య ప్రజలు, ఆకతాయిలు, ఆనందించేవారు దిగిపోతారు.

15 మనుష్యులు అణగద్రొక్కబడతారు. అందరు తగ్గించబడతారు, గర్విష్ఠుల చూపు తగ్గించబడుతుంది.

16 కాని సైన్యాల యెహోవా తీర్పు తీర్చి మహిమపరచబడతారు, తన నీతి క్రియలనుబట్టి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధునిగా నిరూపించబడతారు.

17 అప్పుడు గొర్రెపిల్లలు తమ పచ్చికబయళ్లలో ఉన్నట్లుగా అక్కడ మేస్తాయి; ధనవంతుల బీడు భూములలో గొర్రెపిల్లలు మేస్తాయి.

18 మోసమనే త్రాళ్లతో పాపాన్ని లాక్కొనే వారికి, బండి త్రాళ్లతో దుర్మార్గాన్ని లాక్కొనే వారికి శ్రమ.

19 “దేవుడు త్వరపడాలి; ఆయన పనిని త్వరగా చేయాలి అప్పుడు ఆయన కార్యాలు మేము చూస్తాము. ఇశ్రాయేలు పరిశుద్ధుని ఆలోచన ఆచరణలోకి రావాలి, అప్పుడు మేము తెలుసుకుంటాము” అనే వారికి శ్రమ.

20 కీడును మేలని, మేలును కీడని చెప్పేవారికి, చీకటిని వెలుగుగా వెలుగును చీకటిగా చేదును తీపిగా తీపిని చేదుగా మార్చేవారికి శ్రమ.

21 తమకు తామే జ్ఞానులమని తమ దృష్టిలో తామే తెలివైనవారమని అనుకునేవారికి శ్రమ.

22 ద్రాక్షరసం త్రాగడంలో పేరు పొందినవారికి మద్యం కలపడంలో నేర్పు గలవారికి శ్రమ.

23 వారు లంచం తీసుకుని దోషులను వదిలేస్తారు, నిర్దోషులకు న్యాయం చేయడానికి నిరాకరిస్తారు.

24 వారు సైన్యాల యెహోవా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్యాన్ని తృణీకరించారు, కాబట్టి మంటలు గడ్డిని కాల్చినట్లుగా ఎండుగడ్డి మంటలో కాలిపోయినట్లుగా వారి వేరులు కుళ్లిపోతాయి, వారి పూలు ధూళిలా ఎగిరిపోతాయి.

25 కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతుంది; ఆయన వారి మీదికి తన చేయి చాచి వారిని కొడతారు. పర్వతాలు వణుకుతాయి, వీధుల్లో వారి శవాలు పెంటలా పడి ఉన్నాయి. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.

26 ఆయన దూరంగా ఉన్న దేశాలను పిలువడానికి జెండా ఎత్తుతారు, భూమి అంచుల్లో ఉన్నవారిని రప్పించడానికి ఈల వేస్తారు. చూడండి వారందరు తొందరగా, వేగంగా వస్తున్నారు.

27 వారిలో ఒక్కరు కూడా అలిసిపోరు, తూలిపోరు. వారిలో ఒక్కరు కూడా కునుకరు నిద్రపోరు. వారి నడికట్టు విడిపోదు. వారి చెప్పుల వారు తెగిపోదు.

28 వారి బాణాలు పదునుగా ఉన్నాయి. వారి విల్లులన్ని ఎక్కుపెట్టి ఉన్నాయి; వారి గుర్రాల డెక్కలు చెకుముకి రాళ్లవలె ఉన్నాయి, వారి రథచక్రాలు సుడిగాలి తిరిగినట్టు తిరుగుతాయి.

29 వారి గర్జన సింహగర్జనలా ఉంది. కొదమసింహం గర్జించినట్లు గర్జిస్తారు; వారు తమ వేటను పట్టుకుని ఎత్తుకుపోతారు కాపాడే వారెవరు ఉండరు.

30 వారు ఆ రోజు సముద్ర ఘోషలా తమ శత్రువు మీద గర్జిస్తారు. ఒకవేళ ఎవరైనా భూమివైపు చూస్తే, అక్కడ చీకటి, బాధ మాత్రమే కనబడుతుంది; మేఘాలు కమ్మి వెలుగు కూడా చీకటిగా అవుతుంది.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan