Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 45 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 కోరెషు పక్షంగా దేశాలను జయించడానికి రాజులను నిరాయుధులుగా చేయడానికి అతని ఎదుట ద్వారాలు మూయబడకుండా తలుపులు తీయడానికి నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను. తన అభిషిక్తుడైన ఈ కోరెషుతో యెహోవా చెప్పే మాట ఇదే:

2 నేను నీకు ముందుగా వెళ్లి పర్వతాలను చదును చేస్తాను; ఇత్తడి తలుపుల్ని పగలగొట్టి, ఇనుప గడియలను విరగ్గొడతాను.

3 పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనేనని నీవు తెలుసుకునేలా రహస్య స్థలాల్లో ఉంచిన నిధులను దాచబడిన ధనాన్ని నీకిస్తాను.

4 నా సేవకుడైన యాకోబు కోసం నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు కోసం నేను పేరు పెట్టి నిన్ను పిలిచాను. నీవు నన్ను గుర్తించకపోయినా నీకు గౌరవ బిరుదు ఇచ్చాను.

5 నేను యెహోవాను, వేరే ఏ దేవుడు లేడు; నేను తప్ప ఏ దేవుడు లేడు. నీవు నన్ను గుర్తించకపోయినా నేను నిన్ను బలపరుస్తాను.

6 అప్పుడు సూర్యోదయ దిక్కునుండి సూర్యాస్తమయ స్థలం వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని ప్రజలు తెలుసుకుంటారు. యెహోవాను నేనే; నేను తప్ప వేరే ఎవరూ లేడు.

7 నేను వెలుగును రూపిస్తాను, చీకటిని కలుగజేస్తాను, నేను వృద్ధిని తెస్తాను, విపత్తును కలుగజేస్తాను. యెహోవానైన నేను వీటన్నిటిని చేస్తాను.

8 “పైనున్న ఆకాశాల్లారా, నా నీతిని వర్షింపనివ్వండి; మేఘాలు వాటిని క్రిందికి కురిపించాలి. భూమి విశాలంగా తెరవాలి, రక్షణ మొలవాలి, నీతి దానితో కలిసి వర్ధిల్లాలి; యెహోవానైన నేను దానిని సృష్టించాను.

9 “మట్టి కుండ పెంకులలో ఒక పెంకుగా ఉండి తనను చేసినవానితో వాదించే వారికి శ్రమ. జిగటమన్ను కుమ్మరితో, ‘నీవు ఏం తయారుచేస్తున్నావు?’ అని అంటుందా? అతని పని అతనితో, ‘కుమ్మరికి నైపుణ్యం లేదు’ అని అంటుందా?

10 ‘నీవు కన్నది ఏంటి?’ అని తండ్రితో అనే వానికి, ‘నీ గర్భంలో పుట్టింది ఏంటి?’ అని తల్లితో అనే వానికి శ్రమ.

11 “ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దానిని సృష్టించిన యెహోవా చెప్పే మాట ఇదే: జరుగబోయే వాటి గురించి, నా కుమారుల గురించి నన్ను అడుగుతారా? నా చేతిపనుల గురించి నన్నే ఆజ్ఞాపిస్తారా?

12 భూమిని కలుగచేసింది దాని మీద ఉన్న నరులను సృష్టించింది నేనే. నా సొంత చేతులు ఆకాశాలను విశాలపరిచాయి; నేను వాటి నక్షత్ర సమూహాలను నడిపిస్తాను.

13 నేను నీతిని బట్టి కోరెషును పురికొల్పుతాను: అతని మార్గాలన్నీ తిన్నగా చేస్తాను. అతడు నా పట్టణాన్ని మరలా కడతాడు ఏ వెల ఏ బహుమానం తీసుకోకుండ బందీలుగా ఉన్నవారిని అతడు విడిపిస్తాడు అని సైన్యాల యెహోవా అన్నారు.”

14 యెహోవా చెప్పే మాట ఇదే: “ఈజిప్టు సంపాదన, కూషు వ్యాపార లాభాలు, పొడవైన సెబాయీయులు; నీ దగ్గరకు వచ్చి నీవారవుతారు; సంకెళ్ళతో నీ దగ్గరకు వచ్చి నీ ఎదుట మోకరిస్తారు. ‘నిజంగా దేవుడు నీతో ఉన్నారు, వేరే ఎవరూ లేరు; వేరే ఏ దేవుడు లేడు’ అని నీ ఎదుట నమస్కారం చేసి మనవి చేస్తారు.”

15 ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయంగా మీరు కనబడకుండా చేసుకున్న దేవుడవు.

16 విగ్రహాలను చేసే వారందరు సిగ్గుపడి అవమానపడతారు. వారందరు కలిసి అవమానానికి గురవుతారు.

17 అయితే యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందుతుంది; మీరు మరలా ఎప్పటికీ సిగ్గుపరచబడరు, అవమానం పొందరు.

18 యెహోవా చెప్పే మాట ఇదే: ఆకాశాలను సృష్టించిన యెహోవాయే దేవుడు. ఆయన భూమికి ఆకారమిచ్చి దానిని స్థిరపరిచారు: దానిని శూన్యంగా సృష్టించలేదు కాని, నివాస స్థలంగా దానిని చేశారు. ఆయన అంటున్నారు: “యెహోవాను నేనే మరి వేరే ఎవరూ లేరు.

19 నేను ఎక్కడో చీకటి దేశంలో నుండి రహస్యంగా మాట్లాడలేదు; ‘వ్యర్థంగా నన్ను వెదకండి’ అని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. యెహోవానైన నేను సత్యం మాట్లాడతాను; నేను యథార్థమైనవే తెలియజేస్తాను.

20 “అంతా కలిసి రండి; దేశాల నుండి తప్పించుకు పారిపోయినవారలారా రండి. చెక్క విగ్రహాలను మోస్తూ, రక్షించలేని దేవుళ్ళకు మొరపెట్టే వారికి తెలివిలేదు.

21 నా సన్నిధిలోకి వచ్చి సంగతులు తెలియజేయండి, వారు కలిసి ఆలోచన చేయాలి. పూర్వకాలం నుండి దీనిని తెలియజేసింది ఎవరు? చాలా కాలం క్రితం దానిని ప్రకటించింది ఎవరు? యెహోవానైన నేను కాదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిగల దేవుడను, రక్షకుడను; నేను తప్ప వేరే ఎవరూ లేరు.

22 “భూమి అంచుల్లో నివసించే మీరందరు నా వైపు తిరిగి రక్షణ పొందండి; నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు.

23 నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందని ప్రతి నాలుక నాతోడని ప్రమాణం చేస్తుందని నేను నా పేరిట ప్రమాణం చేశాను. నీతిగల నా నోటి నుండి వచ్చిన మాట ఏదీ వ్యర్థం కాదు.

24 ‘యెహోవాలోనే నీతి, బలము’ అని ప్రజలు నా గురించి చెప్తారు.” ఆయన మీద కోప్పడిన వారందరు ఆయన దగ్గరకు వస్తారు, వారు సిగ్గుపరచబడతారు.

25 అయితే ఇశ్రాయేలు సంతతివారందరు యెహోవాలోనే నీతిమంతులుగా తీర్చబడతారు, వారు ఆయనలోనే అతిశయిస్తారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan