యెషయా 39 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంబబులోను నుండి రాయబారులు 1 ఆ కాలంలో బలదాను కుమారుడును బబులోను రాజైన మర్దూక్-బలదాను హిజ్కియాకు జబ్బుచేసి, తిరిగి కోలుకున్నాడని విని అతనికి ఉత్తరాలు, కానుక పంపాడు. 2 హిజ్కియా సంతోషంగా ఆ రాయబారులను ఆహ్వానించి, వారికి తన భవనంలో ఉన్న ఖజానాలోని వెండి, బంగారం, సుగంధద్రవ్యాలు, ఒలీవనూనెతో సహా ఆయుధాలు, ధనాగారాలలో ఉన్నవన్నీ వారికి చూపించాడు. తన భవనంలో గాని, రాజ్యమంతట్లో గాని హిజ్కియా వారికి చూపించనిదేది లేదు. 3 తర్వాత రాజైన హిజ్కియా దగ్గరకు ప్రవక్తయైన యెషయా వెళ్లి, “ఆ మనుష్యులు ఏమి చెప్పారు? ఎక్కడి నుండి నీ దగ్గరకు వచ్చారు?” అని అడిగాడు. అందుకు హిజ్కియా, “వారు బబులోను అనే దూరదేశం నుండి వచ్చారు” అని జవాబిచ్చాడు. 4 “నీ భవనంలో వారు ఏమేమి చూశారు?” అని ప్రవక్త అడిగాడు. హిజ్కియా, “నా భవనంలో ఉన్నవన్నీ చూశారు. నా ధనాగారంలో ఏదీ దాచకుండా అన్నీ వారికి చూపించాను” అన్నాడు. 5 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు, “సైన్యాల యెహోవా వాక్కు విను: 6 ఒక సమయం రాబోతుంది, నీ భవనంలో ఉన్నవన్నీ, ఈనాటి వరకు మీ పూర్వికుల కూడబెట్టినవన్నీ బబులోనుకు తీసుకెళ్తారు. ఇక్కడ ఏమీ మిగలదని యెహోవా చెప్తున్నారు. 7 నీకు పుట్టబోయే నీ సంతానంలో కొంతమంది బబులోనుకు కొనిపోబడి బబులోను రాజు యొక్క రాజభవనంలో నపుంసకలుగా అవుతారు.” 8 హిజ్కియా యెషయాతో, “నీవు చెప్పిన యెహోవా వాక్కు మంచిదే. నా జీవితకాలంలో సమాధానం సత్యం ఉంటాయి” అని అన్నాడు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.