Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


యెరూషలేముకు యూదాకు తీర్పు

1 చూడండి, ప్రభువును, సైన్యాలకు అధిపతియైన యెహోవా యెరూషలేములో నుండి యూదాలో నుండి జీవనాధారాన్ని, మద్దతును తీసివేయబోతున్నారు: అన్ని ఆహార సరఫరాలు, అన్ని నీటి సరఫరాలు,

2 వీరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, సోదె చెప్పేవారు, పెద్దలు,

3 పంచదశాధిపతులను, ఘనత వహించినవారు, సలహాదారులు, నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు, తెలివిగల మాంత్రికులు, వీరందరిని తీసివేస్తారు.

4 “నేను యవ్వనులను వారికి అధిపతులుగా నియమిస్తాను. పిల్లలు వారిని పరిపాలిస్తారు.”

5 ప్రజలు ఒకరిని ఒకరు ఒకరి మీదికి ఒకరు, పొరుగువారి మీదికి పొరుగువారు. యువకులు పెద్దవారి మీదికి, అనామకులు ఘనుల మీదికి లేస్తారు.

6 ఒకడు తన తండ్రి ఇంట్లో తన సోదరుని పట్టుకుని, “నీకు బట్టలు ఉన్నాయి, నీవు మాకు నాయకునిగా ఉండు; ఈ పాడైపోయిన స్థలం నీ ఆధీనంలోనికి తీసుకో!” అంటాడు.

7 కాని ఆ రోజు అతడు కేక వేసి, “నా దగ్గర పరిష్కారం లేదు. నా ఇంట్లో ఆహారం గాని బట్టలు గాని లేవు; నన్ను ప్రజలకు నాయకునిగా చేయవద్దు” అంటాడు.

8 యెరూషలేము పాడైపోయింది, యూదా పతనమవుతుంది, వారి మాటలు పనులు యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆయన మహిమగల సన్నిధిని వారు ధిక్కరించారు.

9 వారి ముఖమే వారి మీద సాక్ష్యమిస్తుంది; వారు తమ పాపాన్ని సొదొమలా ప్రకటిస్తారు; వారు దానిని దాచిపెట్టరు. వారికి శ్రమ! వారు తమ మీద తామే విపత్తు తెచ్చుకున్నారు.

10 మీకు మేలు కలుగుతుందని నీతిమంతులకు చెప్పండి ఎందుకంటే వారు తాము చేసిన క్రియల ప్రతిఫలాన్ని అనుభవిస్తారు.

11 దుష్టులకు శ్రమ! వారికి చెడు జరుగుతుంది! వారి చేతులు చేసిన దాని ప్రతిఫలం వారికి ఇవ్వబడుతుంది.

12 నా ప్రజలను యువకులు అణచివేస్తారు స్త్రీలు వారిని పాలిస్తారు. నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు మార్గం నుండి వారు మిమ్మల్ని తప్పిస్తారు.

13 యెహోవా న్యాయస్థానంలో తన స్థానం తీసుకుంటారు; ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయన లేస్తారు.

14 యెహోవా తన ప్రజల పెద్దలకు నాయకులకు తీర్పు ప్రకటించడానికి వస్తున్నారు: “మీరే నా ద్రాక్షతోటను నాశనం చేశారు; పేదల నుండి దోచుకున్న సొమ్ము మీ ఇళ్ళలో ఉంది.

15 మీరు నా ప్రజలను ఎందుకు నలుగగొడుతున్నారు? పేదల ముఖాలను ఎందుకు నూరుతున్నారు?” అని సైన్యాల అధిపతియైన యెహోవా అంటున్నారు.

16 యెహోవా ఇలా అంటున్నారు, “సీయోను స్త్రీలు గర్విష్ఠులు వారు మెడలు చాచి నడుస్తూ ఓర చూపులు చూస్తూ ఠీవిగా పిరుదులు త్రిప్పుతూ నడుస్తూ తమ కాళ్ల గజ్జలు మ్రోగిస్తున్నారు.

17 కాబట్టి ప్రభువు సీయోను స్త్రీల తలలపై పుండ్లు పుట్టిస్తారు; యెహోవా వారి తలల్ని బోడి చేస్తారు.”

18 ఆ రోజు ప్రభువు వారి సొగసును లాక్కుంటారు: గాజులు, శిరోభూషణాలు, నెలవంక హారాలు,

19 చెవిపోగులు, కడియాలు, మేలి ముసుగులు,

20 తలపాగాలు, కాళ్లపట్టీలు, ఒడ్డాణాలు, సుగంధద్రవ్య బుడ్డీలు, తాయెత్తులు,

21 ఉంగరాలు, ముక్కుపుడకలు,

22 పండుగ వస్త్రాలు, పైవస్త్రాలు, అంగీలు, సంచులు,

23 అద్దాలు, సన్నపునారతో చేసిన ముసుగులు, తలపాగాలు, శాలువాల్ని తీసివేస్తారు.

24 సువాసనకు బదులు దుర్వాసన ఉంటుంది; నడికట్టుకు బదులు తాడు; అల్లిన జడకు బదులు బోడితల; ప్రశస్తమైన పైవస్త్రానికి బదులు గోనెపట్ట; అందానికి బదులు ఖైదీ వాత ఉంటుంది.

25 మీ మనుష్యులు ఖడ్గానికి కూలిపోతారు, మీ వీరులు యుద్ధంలో చనిపోతారు.

26 సీయోను గుమ్మాలు విలపిస్తూ దుఃఖిస్తాయి; ఆమె ఒంటరిదై, నేల మీద కూర్చుంటుంది.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan