Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


తూరుకు వ్యతిరేకంగా ప్రవచనం

1 తూరుకు వ్యతిరేకంగా ప్రవచనం: తర్షీషు ఓడలారా! రోదించండి: తూరు నాశనమయ్యింది, అది ఇల్లు గాని ఓడరేవు గాని లేకుండ మిగిలింది. కుప్ర దేశం నుండి ఈ విషయం వారికి తెలియజేయబడింది.

2 సముద్ర తీర వాసులారా, సీదోను వ్యాపారులారా, మౌనంగా ఉండండి, సముద్ర నావికులు మిమ్మల్ని సంపన్నులుగా చేశారు.

3 గొప్ప జలాల మీద షీహోరు ధాన్యం వచ్చింది; నైలు ప్రాంతంలో పండిన పంట తూరుకు ఆదాయం ఇచ్చింది, అది దేశాలకు వాణిజ్య కేంద్రంగా మారింది.

4 సీదోనూ, సముద్రపు కోట సిగ్గుపడండి, సముద్రం ఇలా మాట్లాడింది: “నేను ప్రసవ వేదన పడలేదు, పిల్లలు కనలేదు, కుమారులను పోషించలేదు కుమార్తెలను పెంచలేదు.”

5 వార్త ఈజిప్టుకు చేరినప్పుడు తూరు గురించి వారు వేదన పడతారు.

6 తర్షీషుకు వెళ్లండి; సముద్ర తీర వాసులారా దుఃఖపడండి.

7 మీకు ఉల్లాసం కలిగించిన పట్టణం ఇదేనా? పాతది, ప్రాచీన పట్టణం, దూరదేశంలో నివసించడానికి సుదూర ప్రయాణం చేసింది ఇదేనా?

8 తూరు కిరీటాలు పంచిపెట్టే పట్టణం, దాని వ్యాపారులు రాకుమారులు, దాని వర్తకులు భూమి మీద ప్రసిద్ధులు, అలాంటి తూరుకు వ్యతిరేకంగా ఎవరు ఆలోచన చేశారు?

9 తనకున్న అందాన్ని బట్టి కలిగిన గర్వాన్ని అణచడానికి భూమి మీద ప్రసిద్ధులందరిని అవమానపరచడానికి సైన్యాల యెహోవా ఇలా చేశారు.

10 తర్షీషు కుమారీ, నీ దేశానికి ఇక ఓడరేవు లేదు కాబట్టి నైలు నది దాటునట్లు మీ దేశానికి తిరిగి వెళ్లు.

11 యెహోవా సముద్రం మీద తన చేయి చాపి దాని రాజ్యాలు వణికేలా చేశారు. కనాను కోటలను నాశనం చేయడానికి ఆయన దాని గురించి ఆజ్ఞ ఇచ్చారు.

12 ఆయన ఇలా అన్నారు, “అణచివేతకు గురైన సీదోను కుమార్తె, ఇకపై నీకు సంతోషం ఉండదు. “నీవు లేచి కుప్రకు వెళ్లు, అక్కడ కూడా నీకు విశ్రాంతి దొరకదు.”

13 బబులోనీయుల దేశాన్ని చూడు, వారు తమ గుర్తింపును కోల్పోయారు! అష్షూరీయులు దానిని ఎడారి జీవులకు నివాసంగా చేశారు. వారు దానిలో ముట్టడి గోపురాలు కట్టించి, దాని కోటలు పడగొట్టి శిథిలాలుగా మార్చారు.

14 తర్షీషు ఓడలారా, రోదించండి; మీ కోట నాశనమయ్యింది.

15 ఒక రాజు జీవితకాలంలా డెబ్బై సంవత్సరాలు తూరు గురించి మరచిపోతారు. అయితే డెబ్బై సంవత్సరాలు ముగింపులో వేశ్యల పాటలో ఉన్నట్లుగా తూరుకు జరుగుతుంది:

16 “మరవబడిన వేశ్యా, సితారా తీసుకుని పట్టణంలో తిరుగు; నీవు జ్ఞాపకం వచ్చేలా సితారా మంచిగా వాయిస్తూ చాలా పాటలు పాడు.”

17 డెబ్బై సంవత్సరాల తర్వాత యెహోవా తూరు మీద దయ చూపిస్తారు. కాని అది తన లాభదాయకమైన వ్యభిచారానికి తిరిగివెళ్లి భూమిపై ఉన్న అన్ని రాజ్యాలతో వ్యాపారం చేస్తుంది.

18 అయినా దాని లాభం, దాని సంపాదన యెహోవాకు చెందుతుంది; వాటిని నిల్వ ఉంచరు, కూడబెట్టరు. దాని లాభాలు యెహోవా సన్నిధిలో నివసించేవారికి సమృద్ధి ఆహారం, విలువైన వస్త్రాలు అందించడానికి ఉపయోగించబడతాయి.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan