యెషయా 20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంఈజిప్టుకు కూషుకు వ్యతిరేకంగా ప్రవచనం 1 అష్షూరు రాజైన సర్గోను తన సైన్యాధిపతిని పంపిన సంవత్సరంలో అతడు అష్డోదుకు వచ్చి, దానిపై దాడిచేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు. 2 ఆ సమయంలో యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా మాట్లాడారు. ఆయన, “నీ నడుముకున్న గోనె పట్టాను, నీ పాదాలకున్న చెప్పులు తీసివేయి” అన్నారు. అతడు అలాగే చేసి, బట్టలు తీసివేసి చెప్పులు లేకుండా నడిచాడు. 3 అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యెషయా ఈజిప్టు గురించి, కూషు గురించి సూచనగా సంకేతంగా మూడు సంవత్సరాలు బట్టలు, చెప్పులు లేకుండా తిరిగిన విధంగానే 4 అష్షూరు రాజు చెరపట్టబడిన ఈజిప్టువారిని, కూషు బందీలను, పిల్లలను పెద్దలను బట్టలు లేకుండా చెప్పులు లేకుండా తీసుకు పోతాడు. ఈజిప్టువారిని అవమానం కలిగేలా వారి పిరుదుల కనిపించేలా వారిని తీసుకెళ్తాడు. 5 కూషును నమ్ముకుని ఈజిప్టును బట్టి గర్వపడినవారు దిగులుపడి, సిగ్గుపడతారు. 6 ఆ రోజున ఆ తీరప్రాంతంలో నివసించేవారు, ‘అష్షూరు రాజు చేతిలో నుండి విడుదల, సహయం కోసం మనం పారిపోయి ఆశ్రయించిన వారికి ఏమి జరిగిందో చూడండి! ఇప్పుడు మనమెలా తప్పించుకోగలం?’ అని అంటారు.” |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.