Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 యెహోవా యాకోబుపై జాలి చూపుతారు; ఆయన మరలా ఇశ్రాయేలును ఏర్పరచుకొని వారిని వారి స్వదేశంలో స్థిరపరుస్తారు. విదేశీయులు వారిని కలుసుకుంటారు యాకోబు వారసులతో ఏకమై ఉంటారు.

2 ప్రజలు వారిని తీసుకువచ్చి వారి సొంత దేశంలో వారిని చేర్చుతారు. ఇశ్రాయేలు దేశాలను స్వాధీనపరచుకుని యెహోవా దేశంలో వారిని తమ దాసదాసీలుగా చేసుకుంటారు. వారు తమను బందీలుగా పట్టుకెళ్లిన వారిని బందీలుగా పట్టుకుని తమను బాధించిన వారిని పాలిస్తారు.

3 నీ బాధ నుండి వేదన నుండి నీతో బలవంతంగా చేయించిన కఠినమైన పని నుండి యెహోవా నీకు ఉపశమనం ఇచ్చిన రోజున,

4 నీవు బబులోను రాజును హేళన చేస్తూ ఇలా మాట్లాడతావు: బాధ పెట్టినవాడు ఎలా నశించాడు! రేగుతున్న కోపం ఎలా అంతమయ్యింది!

5 దుర్మార్గుల దుడ్డుకర్రను పాలకుల రాజదండాన్ని యెహోవా విరగ్గొట్టారు.

6 వారు కోపంతో ఎడతెగని దెబ్బలతో ప్రజలను క్రూరంగా కొట్టారు, కోపంతో ప్రజలను పరిపాలించి కనికరం లేకుండా వారిని అణచివేశారు.

7 భూమి అంతా విశ్రాంతిలో సమాధానంతో ఉంది; వారు పాడడం మొదలుపెట్టారు.

8 సరళ వృక్షాలు లెబానోను దేవదారు చెట్లు నీ గురించి సంతోషిస్తూ ఇలా అంటాయి, “నీవు పడుకుంటున్నప్పటి నుండి మమ్మల్ని నరకడానికి ఎవరూ రారు.”

9 నీవు వస్తుండగా నిన్ను కలుసుకోడానికి క్రింద పాతాళం నీ గురించి ఆవేశపడుతుంది; అది నిన్ను చూసి చచ్చిన వారి ఆత్మలను అనగా భూమి మీద నాయకులుగా ఉన్నవారందరిని రేపుతుంది; దేశాలకు రాజులుగా ఉన్నవారందరిని తమ సింహాసనాలు నుండి లేపుతుంది.

10 వారందరు నిన్ను చూసి నీతో ఇలా అంటారు, “నీవు కూడా మాలాగే బలహీనమయ్యావు; నీవు కూడా మాలా అయ్యావు.”

11 నీ వీణల సందడితో పాటు నీ ఆడంబరం అంతా క్రింద సమాధిలో పడవేయబడింది; నీ క్రింద పురుగులు వ్యాపిస్తాయి క్రిములు నిన్ను కప్పివేస్తాయి.

12 తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెలా ఆకాశం నుండి పడ్డావు? దేశాలను పడగొట్టిన నీవు భూమి మీద ఎలా పడవేయబడ్డావు?

13 నీవు నీ హృదయంలో, “నేను ఆకాశాలను ఎక్కుతాను; దేవుని నక్షత్రాల కన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను; ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద, సాఫోన్ పర్వతం యొక్క ఎత్తైన స్థలాల మీద కూర్చుంటాను.

14 మేఘ మండలం మీదికి ఎక్కుతాను. నన్ను నేను మహోన్నతునిగా చేసుకుంటాను” అనుకున్నావు.

15 కాని నీవు పాతాళంలో చచ్చిన వారి స్థలంలో లోతైన గోతిలో త్రోయబడ్డావు.

16 నిన్ను చూసేవారు నిన్ను గమనించి చూస్తూ నీ విధి గురించి ఇలా అనుకుంటారు: “భూమిని కంపింపజేసి రాజ్యాలను వణికించింది ఇతడేనా?

17 లోకాన్ని అడవిగా చేసి దాని పట్టణాలను పాడుచేసినవాడు ఇతడేనా? తాను బంధించిన వారిని తమ ఇళ్ళకు పోనివ్వనివాడు ఇతడేనా?”

18 దేశాల రాజులందరూ ఘనత వహించినవారై తమ తమ సమాధుల్లో నిద్రిస్తున్నారు.

19 అయితే నీవు తిరస్కరించబడిన కొమ్మలా నీ సమాధి నుండి పారవేయబడ్డావు. నీవు చంపబడినవారితో కత్తితో పొడవబడిన వారితో పాతాళంలో ఉన్న రాళ్ల దగ్గరకు దిగిపోయిన వారితో కప్పబడి ఉన్నావు. కాళ్లతో తొక్కబడిన శవంలా ఉన్నావు.

20 నీవు నీ దేశాన్ని పాడుచేసి నీ ప్రజలను చంపేశావు కాబట్టి నీవు సమాధిలో వారితో పాటు కలిసి ఉండవు. దుర్మార్గుని సంతానం ఎప్పుడూ జ్ఞాపకానికి రాదు.

21 వారు పెరిగి భూమిని స్వాధీనం చేసుకుని తమ పట్టణాలతో భూమిని నింపకుండా తమ పూర్వికుల పాపాన్ని బట్టి అతని పిల్లలను వధించడానికి చోటు సిద్ధం చేయండి.

22 “నేను వారి మీదికి లేస్తాను” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు, “బబులోను పేరును దానిలో మిగిలినవారిని, సంతానాన్ని, వారసులను కొట్టివేస్తాను” అని యెహోవా తెలియజేస్తున్నారు.

23 “నేను దానిని గుడ్లగూబలు ఉండే స్థలంగా చేస్తాను నీటిమడుగులుగా చేస్తాను; నాశనమనే చీపురుకట్టతో దానిని తుడిచివేస్తాను” అని సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.

24 సైన్యాల యెహోవా చేసిన ప్రమాణం ఇదే: “నేను ఉద్దేశించినట్లే అది తప్పక ఉంటుంది, నేను ఆలోచించినట్లే అది జరుగుతుంది.

25 నా దేశంలో అష్షూరును విరగ్గొడతాను; నా పర్వతాలమీద అతన్ని నలగదొక్కుతాను. అతని కాడి నా ప్రజల మీద నుండి తీసివేయబడుతుంది, అతని భారం వారి భుజాలపై నుండి తొలగించబడుతుంది.”

26 లోకమంతటి గురించి నిర్ణయించిన ఆలోచన ఇదే; ప్రజలందరిపై చాపబడిన చేయి ఇదే.

27 సైన్యాల యెహోవా దానిని ఉద్దేశిస్తే ఆయనను అడ్డుకునేవారు ఎవరు? ఆయన చేయి చాచి ఉన్నది, దాన్ని త్రిప్పగలవారెవరు?


ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా ప్రవచనం

28 రాజైన ఆహాజు చనిపోయిన సంవత్సరం వచ్చిన ప్రవచనం:

29 ఫిలిష్తియా, మిమ్మల్ని కొట్టిన కర్ర విరిగిపోయిందని మీరందరు సంతోషించకండి; సర్పమూలం నుండి విషపూరిత పాము పుడుతుంది, దాని సంతానం ఎగిరే విషసర్పము.

30 అప్పుడు అతి బీదవారు భోజనం చేస్తారు, అవసరతలో ఉన్నవారు క్షేమంగా పడుకుంటారు. కాని కరువుతో మీ మూలాన్ని నాశనం చేస్తాను; అది మీలో మిగిలి ఉన్నవారిని చంపేస్తుంది.

31 గుమ్మమా, దుఃఖించు! పట్టణమా, కేకలు వేయి! ఫిలిష్తియా, మీరంతా కరిగిపోవాలి! ఉత్తర దిక్కునుండి పొగలేస్తుంది. పంక్తులు తీరిన సైన్యంలో వెనుదిరిగేవారు ఎవరూ లేరు.

32 ఆ దేశ దూతలకు ఇవ్వవలసిన జవాబు ఏది? “యెహోవా సీయోనును స్థాపించారు, ఆయన ప్రజల్లో శ్రమ పొందినవారు దానిని ఆశ్రయిస్తారు.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan