యెషయా 13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంబబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం 1 బబులోను గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన ప్రవచనం: 2 చెట్లులేని కొండ శిఖరం మీద జెండా నిలబెట్టండి, కేకలు వేసి వారిని పిలువండి; ప్రజల ప్రధానులను గుమ్మాల్లో చేతులతో సైగ చేయండి. 3 నేను యుద్ధానికి ప్రతిష్ఠించిన వారికి ఆజ్ఞ ఇచ్చాను; నా కోపం తీర్చుకోవాలని నా వీరులను పిలిపించాను, నా విజయాన్ని బట్టి సంతోషించేవారిని పిలిపించాను. 4 పెద్ద జనసమూహం ఉన్నట్లుగా కొండల్లో వస్తున్న శబ్దం వినండి! దేశాలు ఒక్కటిగా చేరుతునట్లు రాజ్యాల మధ్య అల్లరి శబ్దం వినండి! సైన్యాల యెహోవా యుద్ధానికి సైన్యాన్ని సమకూరుస్తున్నారు. 5 దేశాన్ని మొత్తం పాడుచేయడానికి, యెహోవా కోపాన్ని తీర్చే ఆయుధాలుగా, వారు దూరదేశం నుండి, ఆకాశపు అంచుల నుండి వస్తున్నారు. 6 యెహోవా దినం దగ్గరలో ఉందని రోదించండి; అది సర్వశక్తుడు దేవుని దగ్గర నుండి వచ్చే నాశనంలా వస్తుంది. 7 దీనిని బట్టి, చేతులన్నీ బలహీనపడతాయి, ప్రతి హృదయం భయంతో కరిగిపోతుంది. 8 భయం వారిని పట్టుకుంటుంది, వేదన బాధలు వారిని గట్టిగా పట్టుకుంటాయి; స్త్రీ ప్రసవ వేదన పడినట్లు వారు వేదన పడతారు. వారు ఒకరిపట్ల ఒకరు విసుగుతో చూసుకుంటారు, వారి ముఖాలు అగ్నిజ్వాలల్లా ఉంటాయి. 9 చూడండి, యెహోవా దినం వస్తుంది. దేశాన్ని పాడుచేయడానికి దానిలో ఉన్న పాపులను పూర్తిగా నాశనం చేయడానికి క్రూరమైన ఉగ్రతతో తీవ్రమైన కోపంతో ఆ రోజు వస్తుంది. 10 ఆకాశ నక్షత్రాలు వాటి నక్షత్రరాసులు తమ వెలుగు ఇవ్వవు. ఉదయించే సూర్యుడు చీకటిగా మారుతాడు చంద్రుడు తన వెలుగునివ్వడు. 11 దాని చెడుతనం బట్టి లోకాన్ని వారి పాపాన్ని బట్టి దుర్మార్గులను నేను శిక్షిస్తాను. గర్విష్ఠుల అహంకారాన్ని అంతం చేస్తాను. క్రూరుల గర్వాన్ని అణచివేస్తాను. 12 నేను మనుష్యులను స్వచ్ఛమైన బంగారం కంటే కొరతగా, ఓఫీరు దేశ బంగారం కంటే అరుదుగా ఉండేలా చేస్తాను. 13 సైన్యాల యెహోవా ఉగ్రత కారణంగా ఆయన కోపం రగులుకున్న రోజున ఆకాశం వణికేలా చేస్తాను; భూమి తన స్థానం నుండి తప్పుకునేలా చేస్తాను. 14 తరుమబడుతున్న జింకలా, కాపరి లేని గొర్రెలా, వారు తమ సొంత ప్రజల వైపు తిరుగుతారు, వారు తమ స్వదేశాలకు పారిపోతారు. 15 పట్టబడిన ప్రతిఒక్కరు కత్తిపోటుకు గురవుతారు; బందీగా పట్టబడిన వారందరు ఖడ్గానికి చస్తారు. 16 వారి కళ్లముందే వారి పసిపిల్లలు ముక్కలుగా నలుగ కొట్టబడతారు; వారి ఇల్లు దోచుకోబడతాయి వారి భార్యలు అత్యాచారం చేయబడతారు. 17 చూడండి, వారి మీద దాడి చేయడానికి నేను మెదీయ వారిని రేపుతాను. వారు వెండిని లెక్కచేయరు. బంగారం మీద వారికి ఆసక్తి లేదు. 18 వారి విల్లులు యవ్వనస్థులను నలగ్గొడతాయి; పసిపిల్లలపై వారు జాలిపడరు. పిల్లలపై వారు దయ చూపరు. 19 అప్పుడు రాజ్యాలకు వైభవంగా, బబులోనీయుల గర్వానికి ఘనతకు కారణంగా ఉన్న బబులోనును సొదొమ గొమొర్రాల వలె దేవుడు పడగొడతారు. 20 ఇకపై దానిలో ఎవరూ నివసించరు తరతరాలకు దానిలో ఎవరూ కాపురముండరు; అరబీయులు అక్కడ తమ డేరాలు వేసుకోరు, గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ విశ్రాంతి తీసుకోనివ్వరు. 21 ఎడారి జీవులు అక్కడ పడుకుంటాయి, వారి ఇళ్ళ నిండ నక్కలు ఉంటాయి; గుడ్లగూబలు అక్కడ నివసిస్తాయి కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి. 22 దాని కోటలలో హైనాలు, దాని విలాసవంతమైన భవనాలలో నక్కలు నివసిస్తాయి. దాని కాలం ముగిసిపోతుంది దాని రోజులు పొడిగించబడవు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.