Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదా రాజులుగా ఉన్న కాలంలో యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనము.


తిరుగుబాటు చేసిన దేశం

2 ఆకాశాల్లారా, నా మాట వినండి! భూమీ శ్రద్ధగా విను! యెహోవా ఇలా చెప్తున్నారు: “నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కాని వారు నా మీద తిరుగబడ్డారు.

3 ఎద్దు తన యజమానిని గుర్తిస్తుంది, గాడిదకు తన యజమానుని పశువుల దొడ్డి తెలుసు, కాని ఇశ్రాయేలుకు వారి యజమాని ఎవరో తెలియదు, నా ప్రజలు గ్రహించరు.”

4 పాపిష్ఠి దేశానికి శ్రమ, ఆ ప్రజల దోషం గొప్పది, వారిది దుష్ట సంతానం, అవినీతికి అప్పగించబడిన పిల్లలు! వారు యెహోవాను విడిచిపెట్టారు; ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుని తృణీకరించారు. వారు ఆయనను విడిచి తొలగిపోయారు.

5 ఎందుకు మీరు ఇంకా దెబ్బలు తింటున్నారు? ఎందుకు మీరు ఇంకా తిరుగుబాటు కొనసాగిస్తున్నారు? మీ తలంతా గాయపరచబడింది, మీ గుండె మొత్తం బాధించబడింది.

6 అరికాలు నుండి నడినెత్తి వరకు పుండు లేనిచోటు లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, వాటిని శుభ్రం చేయలేదు, కట్టు కట్టలేదు, ఒలీవనూనెతో చికిత్స చేయలేదు.

7 మీ దేశం నాశనమైపోయింది. మీ పట్టణాలు అగ్నిచేత కాలిపోయాయి; మీ కళ్లెదుటే మీ పొలాలు విదేశీయులచేత దోచుకోబడ్డాయి, కంటికి కనబడినవాటిని పరాయివారిగా నాశనం చేశారు.

8 ద్రాక్షతోటలోని గుడిసెలా, దోసకాయ పొలంలోని పాకలా, ముట్టడించబడిన పట్టణంలా, సీయోను కుమార్తె విడిచిపెట్టబడింది.

9 సైన్యాల యెహోవా కొద్దిమందిని ప్రాణాలతో మనకు మిగల్చకపోయుంటే, మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.

10 సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి; గొమొర్రా ప్రజలారా! మన దేవుని ఉపదేశాన్ని శ్రద్ధగా వినండి.

11 యెహోవా ఇలా అంటున్నారు, “విస్తారమైన మీ బలులు నాకెందుకు? దహనబలులుగా ఇచ్చిన పొట్టేళ్లు, బాగా క్రొవ్విన జంతువుల క్రొవ్వు నాకు వెగటు కలిగించాయి; ఎద్దుల, గొర్రెపిల్లల, మేకపోతుల రక్తంలో నాకు ఆనందం లేదు.

12 మీరు నా సన్నిధికి వస్తున్నప్పుడు, నా ఆవరణాలను త్రొక్కడానికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు?

13 విలువలేని అర్పణలు తీసుకురావడం ఆపండి! మీ ధూపం నాకు అసహ్యం కలిగిస్తుంది. అమావాస్యలు, సబ్బాతులు, ప్రత్యేక సమావేశాలు మీ దుష్ట సమావేశాలు నేను భరించలేను.

14 మీ అమావాస్య ఉత్సవాలు, నియమించబడిన పండుగలు నా పూర్ణాత్మతో నేను అసహ్యిస్తున్నాను. అవి నాకు భారంగా ఉన్నాయి; వాటిని భరించలేక అలిసిపోయాను.

15 ప్రార్థనలో మీరు మీ చేతులు చాచినప్పుడు, మిమ్మల్ని చూడకుండ కళ్లు కప్పుకుంటాను; మీరు చాలా ప్రార్థనలు చేసినా నేను వినను. “మీ చేతులు రక్తంతో నిండిపోయాయి!

16 “మిమ్మల్ని మీరు కడుక్కుని శుభ్రం చేసుకోండి. మీ చెడు కార్యాలు నాకు కనిపించకుండా వాటిని తొలగించండి; తప్పు చేయడం మానండి.

17 సరియైనది చేయడం నేర్చుకోండి; న్యాయాన్ని వెదకండి. అణచివేయబడుతున్న వారి పక్షాన ఉండండి. తండ్రిలేనివారికి న్యాయం తీర్చండి. విధవరాలి పక్షాన వాదించండి.

18 “రండి, మనం విషయాన్ని పరిష్కరించుకుందాం” అని యెహోవా అంటున్నారు. “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా అవుతాయి; కెంపులా ఎర్రగా ఉన్నా, అది ఉన్నిలా తెల్లగా అవుతాయి.

19 మీరు ఇష్టపడి నా మాట వింటే, మీరు భూమి ఇచ్చే మంచి పంటను తింటారు;

20 ఒకవేళ మీరు ఎదిరించి తిరుగుబాటు చేస్తే, మీరు ఖడ్గం చేత నాశనమవుతారు” యెహోవా ఈ మాట చెప్తున్నారు.

21 చూడండి, నమ్మకమైన పట్టణం వేశ్యగా ఎలా అయ్యిందో! ఒక్కప్పుడు అది న్యాయంతో నిండి ఉండేది; నీతి దానిలో నివసించేది, కాని ఇప్పుడు హంతకులు ఉంటున్నారు!

22 నీ వెండి మలినం అయిపోయింది, నీ శ్రేష్ఠమైన ద్రాక్షరసం నీళ్లతో కలిసి పలచబడి పోయింది.

23 నీ పాలకులు తిరుగుబాటుదారులు, దొంగలతో సహవాసం చేస్తారు. వారందరికి లంచాలు ఇష్టం కానుకల వెంటపడతారు. తండ్రిలేనివారి పక్షంగా న్యాయం తీర్చరు. విధవరాలి సమస్యను పరిష్కరించరు.

24 కాబట్టి ప్రభువైన, సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు బలవంతుడు ఇలా చెప్తున్నారు: ఆహా! నా శత్రువులపై నా ఉగ్రతను బయటపెట్టి, నా విరోధుల మీద పగ తీర్చుకుంటాను.

25 నీకు వ్యతిరేకంగా నా చేయి ఉంచుతాను; నీ లోహపు మలినాన్ని శుద్ధి చేసి నీ మలినాలను తొలగిస్తాను.

26 పూర్వం ఉన్నట్లు నీకు న్యాయాధిపతులను, తొలి రోజుల్లో ఉన్నట్లు నీకు పాలకులను నియమిస్తాను. అప్పుడు నీవు నీతిగల పట్టణమని, నమ్మకమైన పట్టణమని పిలువబడతావు.

27 సీయోనుకు న్యాయంతో, పశ్చాత్తాపపడే వారికి నీతితో విడుదల కలుగుతుంది.

28 అయితే తిరుగుబాటుదారులు, పాపులు నలుగగొట్టబడతారు, యెహోవాను విడిచిపెట్టిన వారు నశిస్తారు.

29 “మీరు వేటిని బట్టి ఆనందించారో ఆ పవిత్ర సింధూర వృక్షాల గురించి మీరు సిగ్గుపడతారు; మీరు ఎంచుకున్న సింధూర తోటల గురించి మీరు అవమానించబడతారు.

30 మీరు ఆకులు వాడిపోతున్న సింధూర వృక్షంలా, నీరు లేని తోటలా అవుతారు.

31 బలవంతుడు పీచులా అవుతాడు అతని పని నిప్పురవ్వలా అవుతుంది; అవి రెండూ కలిసి కాలిపోతాయి, మంటను ఆర్పేవారు ఎవరూ ఉండరు.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan