Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

హోషేయ 7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 నేను ఇశ్రాయేలును స్వస్థపరిచేటప్పుడు, ఎఫ్రాయిం పాపాలు బహిర్గతం అవుతున్నాయి, సమరయ నేరాలు బయటపడుతున్నాయి. వారు మోసం చేస్తూనే ఉంటారు, దొంగలు ఇళ్ళలో చొరబడతారు, బందిపోటు దొంగలు వీధుల్లో దోచుకుంటారు;

2 అయితే వారి చెడు పనులన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటానని వారు గ్రహించరు. వారి పాపాలు వారిని చుట్టుముట్టాయి; అవి ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి.

3 “వారు తమ దుష్టత్వంతో రాజును, వారి అబద్ధాలతో అధిపతులను సంతోషపరుస్తారు.

4 వారంతా వ్యభిచారులు, పొయ్యిలా మండుతూ ఉంటారు, వంటమనిషి ముద్ద పిసికిన తర్వాత అది పొంగే వరకు వేడి చేసిన పొయ్యివంటి వారు.

5 మన రాజు పండుగ దినాన, అధిపతులు ద్రాక్ష మద్యం మత్తులో ఉంటారు. అతడు అపహాసకులతో చేతులు కలుపుతాడు.

6 వారి హృదయాలు పొయ్యివంటివి; కుట్రతో వారు అతన్ని సమీపిస్తారు. రాత్రంతా వారి కోపాగ్ని రగులుతూ ఉంటుంది; ఉదయాన అది మండే అగ్నిలా ప్రజ్వలిస్తుంది.

7 వారంతా పొయ్యిలా వేడిగా ఉన్నారు; వారు తమ పాలకులను మ్రింగివేస్తారు వారి రాజులందరూ కూలిపోతారు, వారిలో ఏ ఒక్కడు నన్ను ప్రార్థించడు.

8 “ఎఫ్రాయిం దేశాలతో కలిసిపోతుంది; ఎఫ్రాయిం తిరిగేయని అప్పం లాంటిది.

9 విదేశీయులు అతని బలాన్ని లాగేస్తారు, కాని అతడు గ్రహించడు. అతని తలమీద నెరసిన వెంట్రుకలు ఉంటాయి, కాని అతడు గమనించడు.

10 ఇశ్రాయేలు అహంకారం అతనికి విరుద్ధంగా సాక్ష్యం ఇస్తుంది, కాని ఇదంతా జరిగినా కూడా అతడు తన దేవుడైన యెహోవా వైపు తిరగడం లేదు, ఆయనను వెదకడం లేదు.

11 “ఎఫ్రాయిం గువ్వ లాంటిది, బుద్ధిలేక సులభంగా మోసపోతుంది, అది ఈజిప్టును పిలుస్తుంది, అది అష్షూరు వైపు తిరుగుతుంది.

12 వారు వెళ్లేటప్పుడు, నేను వారి మీద నా వల వేస్తాను; నేను వారిని ఆకాశంలో పక్షుల్లా క్రిందికి లాగుతాను. వారు సమాజంగా కూడుకుంటున్నారని నేను విన్నప్పుడు, నేను వారిని శిక్షిస్తాను.

13 వారికి శ్రమ కలుగుతుంది, ఎందుకంటే నా మీద తిరుగుబాటు చేశారు! వారికి నాశనం కలుగుతుంది, ఎందుకంటే నాకు విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. నేను వారిని విమోచించాలని ఆశిస్తాను, కాని వారు నా గురించి అబద్ధాలు చెప్పారు.

14 వారు తమ హృదయపూర్వకంగా నాకు మొరపెట్టరు, కాని తమ పడకల మీద విలపిస్తారు. ధాన్యం కోసం, నూతన ద్రాక్షరసం కోసం, వారు తమ దేవుళ్ళను వేడుకుంటూ తమను తాము కొట్టుకుంటారు కాని వారు నా నుండి తొలగిపోయారు.

15 నేను వారికి శిక్షణ ఇచ్చి బలపరిచాను, కాని నాకు విరుద్ధంగా దురాలోచన చేస్తున్నారు.

16 వారు సర్వోన్నతుని వైపు తిరుగరు, వారు పనికిరాని విల్లులా ఉన్నారు. వారి నాయకులు తమ గర్వపు మాటల వలన కత్తివేటుకు పడిపోతారు. ఇందుచేత ఈజిప్టు దేశంలో వారు ఎగతాళి చేయబడతారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan