Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

హోషేయ 2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 “మీరు మీ సోదరులతో, ‘మీరు నా ప్రజలు’ అని, మీ సహోదరీలతో, ‘నా ప్రియమైన వారలారా’ అని అనండి.


ఇశ్రాయేలు శిక్షంచబడుట, పునరుద్ధరించబడుట

2 “మీ తల్లిని గద్దించండి, గద్దించండి, ఆమె నా భార్య కాదు, నేను ఆమె భర్తను కాను. ఆమె తన వ్యభిచార చూపును మానుకోవాలి, తన రొమ్ముల మధ్య నుండి పరపురుషులను తొలగించాలి.

3 లేకపోతే ఆమెను దిగంబరిని చేస్తాను, ఆమె బట్టలు తీసివేసి ఆమె పుట్టిన రోజున ఉన్నట్లు ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమెను ఎడారిలా చేస్తాను, ఎండిపోయిన భూమిలా చేస్తాను దప్పికతో ఆమె చచ్చునట్లు చేస్తాను.

4 ఆమె పిల్లల మీద నా ప్రేమను చూపించను, ఎందుకంటే, వారు వ్యభిచారం వలన పుట్టిన పిల్లలు.

5 వారి తల్లి వ్యభిచారం చేసింది, అవమానంలో వారిని కన్నది. ఆమె, ‘నేను నా ప్రేమికుల వెంట వెళ్తాను, వారు నాకు నా ఆహారం, నీళ్లు, ఉన్ని, జనపనార, ఒలీవనూనె, పానీయం ఇస్తారు’ అన్నది.

6 కాబట్టి ముళ్ళపొదలను ఆమె దారిని అడ్డుగా వేస్తాను; ఆమె తన దారి కనబడకుండ నేను గోడ కడతాను.

7 ఆమె తన ప్రేమికుల వెంటపడుతుంది కాని వారిని కలుసుకోలేదు; ఆమె వారిని వెదుకుతుంది కాని వారు కనబడరు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, ‘నేను నా మొదటి భర్త దగ్గరకు తిరిగి వెళ్తాను, ఇప్పటి కంటే అప్పుడే నా స్థితి బాగుండేది.’

8 ఆమెకు ధాన్యం, నూతన ద్రాక్షరసం, నూనె, విస్తారమైన వెండి, బంగారాలు, ఇచ్చింది నేనే అని ఆమె గుర్తించలేదు, వాటిని బయలు కోసం వాడింది.

9 “కాబట్టి కోతకాలంలో నా ధాన్యం నేను తీసివేస్తాను, ద్రాక్షరసం సిద్ధంగా ఉన్నప్పుడు దానిని తీసివేస్తాను. ఆమె దిగంబరత్వాన్ని కప్పుకోడానికి నేను ఇచ్చిన నా ఉన్నిని, నా జనపనారను తిరిగి తీసుకుంటాను.

10 కాబట్టి ఇప్పుడు ఆమె ప్రేమికుల కళ్లెదుట, ఆమె కామాతురతను బయటపెడతాను, ఆమెను నా చేతిలో నుండి ఎవ్వరూ విడిపించలేరు.

11 ఆమె ఉత్సవ వేడుకలన్నిటిని: ఆమె వార్షిక పండుగలు, అమావాస్యలు, ఆమె సబ్బాతు దినాలు అన్ని ఆగిపోయేలా చేస్తాను.

12 తన ప్రేమికులు తనకు ఇచ్చిన జీతం అని ఆమె చెప్పుకునే, ఆమె ద్రాక్షలను అంజూర చెట్లను నేను పాడుచేస్తాను; వాటిని దట్టమైన అడవిగా మారుస్తాను, అడవి జంతువులు వాటిని తినివేస్తాయి.

13 ఆమె బయలులకు ధూపం వేసిన రోజుల గురించి, నేను ఆమెను శిక్షిస్తాను; ఆమె నగలు ఆభరణాలతో అలంకరించుకుని, తన ప్రేమికుల వెంట వెళ్లిపోయింది, కాని నన్ను మరచిపోయింది” అని యెహోవా చెప్తున్నారు.

14 కాబట్టి ఆమెను ఆకర్షించబోతున్నాను; నేను ఆమెను అరణ్యంలోకి నడిపించి, ఆమెతో మృదువుగా మాట్లాడతాను.

15 అక్కడ ఆమె ద్రాక్షతోటలను ఆమెకు తిరిగి ఇస్తాను, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అక్కడ ఆమె తన యవ్వన రోజుల్లో ఉన్నట్లు, ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రోజున ఉన్నట్లు స్పందిస్తుంది.

16 యెహోవా ఇలా అంటున్నారు, “ఆ రోజున నీవు నన్ను, ‘నా భర్తవు’ అని అంటావు; నీవు నన్ను ఇక ఎన్నడు ‘నా బయలు’ అని పిలువవు.

17 నేను ఆమె పెదవుల నుండి బయలుల పేర్లు తీసివేస్తాను; ఇక ఎన్నడు వారి పేర్లు ప్రస్తావించబడవు.

18 ఆ రోజున నా ప్రజల కోసం అడవి జంతువులతో, ఆకాశ పక్షులతో, నేలను ప్రాకే జంతువులతో నిబంధన చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధం దేశంలో లేకుండా చేస్తాను, అప్పుడు వారు క్షేమంగా పడుకుంటారు.

19 నీవు శాశ్వతంగా నాతో ఉండేలా, నేను నిన్ను నీతి, న్యాయంతో, మారని ప్రేమతో, దయతో ప్రధానం చేసుకుంటాను.

20 నీవు యెహోవాను తెలుసుకునేలా, నేను నమ్మకాన్ని బట్టి నిన్ను ప్రధానం చేసుకుంటాను.

21 “ఆ రోజున నేను జవాబిస్తాను,” అని యెహోవా అంటున్నారు. “నేను ఆకాశాలకు జవాబిస్తాను, అవి భూమికి జవాబిస్తాయి;

22 భూమి ధాన్యంతో, నూతన ద్రాక్షరసంతో, ఒలీవనూనెతో మాట్లాడుతుంది. అవి యెజ్రెయేలుతో మాట్లాడతాయి.

23 నేను ఆమెను నా కోసం దేశంలో నాటుతాను; ‘నా ప్రియురాలు కాదు,’ అని ఎవరి గురించి అన్నానో ఆ వ్యక్తికే నా ప్రేమను చూపిస్తాను. ‘నా ప్రజలు కారు,’ అని ఎవరి గురించి అన్నానో వారితో, ‘మీరు నా ప్రజలు’ అని చెప్తాను; అప్పుడు వారు, ‘మీరే మా దేవుడు’ అంటారు.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan