హోషేయ 14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథందీవెన రావాలంటే పశ్చాత్తాపపడాలి 1 ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవా దగ్గరకు మరలా రా! నీ పాపాలను బట్టి నీవు పడిపోయావు! 2 మాటలు సిద్ధపరచుకొని యెహోవా దగ్గరకు రా. ఆయనతో ఇలా చెప్పు: “మా పాపాలన్నీ క్షమించండి మమ్మల్ని దయతో స్వీకరించండి, కోడెలకు బదులుగా మేము మా పెదవులను అర్పిస్తాము. 3 అష్షూరు మమ్మల్ని రక్షించలేదు; మేము యుద్ధ గుర్రాలను ఎక్కము. మా చేతులు చేసిన వాటితో మేము, ‘మా దేవుళ్ళు’ అని ఇక ఎన్నడు చెప్పము, ఎందుకంటే మీరు తండ్రిలేనివారికి దయ చూపుతారు.” 4 “నేను వారి నమ్మకద్రోహాన్ని సరిచేస్తాను, మనస్పూర్తిగా వారిని ప్రేమిస్తాను, ఎందుకంటే వారి మీదున్న నా కోపం చల్లారింది. 5 నేను ఇశ్రాయేలుకు మంచులా ఉంటాను; అతడు తామరలా వికసిస్తాడు. లెబానోను దేవదారు చెట్టులా అతని వేర్లు భూమి లోతుకు వెళ్తాయి; 6 అతని చిగురు పెరుగుతుంది. అతని వైభవం ఒలీవ చెట్టులా, అతని సువాసన లెబానోను దేవదారులా ఉంటుంది. 7 అతని నీడలో ప్రజలు నివసిస్తారు; వారు ధాన్యంలా అభివృద్ధి చెందుతారు, వారు ద్రాక్షలా వికసిస్తారు, ఇశ్రాయేలు కీర్తి లెబానోను ద్రాక్షరసంలా ఉంటుంది. 8 ఎఫ్రాయిమూ, ఇకనుండి విగ్రహాలతో నాకేం పని? నేనే అతనికి జవాబిస్తాను, అతన్ని సంరక్షిస్తాను. నేను పచ్చని సరళ వృక్షం వంటి వాన్ని; నా వలనే నీకు ఫలం కలుగుతుంది.” 9 జ్ఞానులెవరు? వారు ఈ విషయాలు గ్రహించాలి. వివేచన గలవారెవరు? వారు కూడ గ్రహించాలి. యెహోవా మార్గాలు సరియైనవి; నీతిమంతులు వాటిలో నడుస్తారు, కాని తిరుగుబాటుదారులు వాటిలో తొట్రిల్లుతారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.