Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

హెబ్రీయులకు 2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


శ్రద్ధ వహించాలని హెచ్చరిక

1 కాబట్టి మనం ప్రక్కకు మళ్ళించబడకుండా ఉండడానికి, మనం విన్న వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి.

2 ఎందుకంటే దేవదూతల ద్వారా చెప్పబడిన వర్తమానం స్థిరపరచబడింది కాబట్టి, ప్రతి అతిక్రమం అవిధేయత న్యాయమైన శిక్షను పొందగా,

3 మనం గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, మనం ఎలా తప్పించుకోగలం? ఈ రక్షణను ప్రభువే మొదట ప్రకటించారు. ఆయన మాటలు విన్నవారి ద్వారా అది మనకు నిరూపించబడింది.

4 సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు, వివిధ రకాల అద్భుతాలు, తన చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ వరాలను పంచిపెట్టడం ద్వారా దేవుడు కూడా వాటి గురించి సాక్ష్యమిచ్చారు.


సంపూర్ణ మానవునిగా యేసు

5 మనం దేని గురించి మాట్లాడుతున్నామో, ఆ రాబోవు లోకాన్ని ఆయన దేవదూతల చేతి క్రింద ఉంచలేదు.

6 అయితే ఒకచోట ఒకరు ఇలా సాక్ష్యమిచ్చారు: “మీరు మానవాళిని లక్ష్యపెట్టడానికి వారు ఏపాటివారు? మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు?

7 మీరు వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశారు; మీరు మహిమ ఘనతను వారికి కిరీటంగా పెట్టారు.

8 సమస్తాన్ని వారి పాదాల క్రింద ఉంచారు,” సమస్తాన్ని వారి క్రింద ఉంచుతూ, వారికి లోబరచకుండా దేవుడు దేన్ని విడిచిపెట్టలేదు. అయినాసరే వారికి ప్రతిదీ లోబడడం ప్రస్తుతానికి మనమింకా చూడలేదు.

9 కాని, యేసు కొంతకాలం వరకు దేవదూతల కంటే తక్కువ చేయబడి, దేవుని కృప వల్ల అందరి కోసం మరణాన్ని రుచిచూశారు కాబట్టి ఇప్పుడు మహిమ ప్రభావాలతో కిరీటం ధరించుకొని ఉన్నట్లు మనం ఆయనను చూస్తున్నాము.

10 ఎవరి కోసం, ఎవరి ద్వారా సమస్తం కలిగిందో ఆ దేవునికి, అనేకమంది కుమారులను కుమార్తెలను మహిమలో తీసుకురావడంలో, వారి రక్షణకు మార్గదర్శి యైన వానిని శ్రమల ద్వారా పరిపూర్ణునిగా చేయడం తగినదిగా ఉండింది.

11 ప్రజలను పరిశుద్ధపరచే వానిది పరిశుద్ధపరచబడిన వారిది ఒక్కటే కుటుంబము. కాబట్టి వారిని సహోదరీ సహోదరులు అని పిలువడానికి యేసు సిగ్గుపడలేదు.

12 ఆయన ఇలా అన్నారు, “నేను మీ నామాన్ని నా సహోదరీ సహోదరులకు ప్రకటిస్తాను; సమాజంలో మీ కీర్తిని నేను గానం చేస్తాను.”

13 అంతేకాక, “నేను ఆయనలో నా నమ్మకాన్ని ఉంచుతాను.” అంతేకాక, “ఇదిగో నేను, దేవుడు నాకిచ్చిన పిల్లలు,” అని ఆయన చెప్తున్నారు.

14 ఈ పిల్లలు రక్తమాంసాలు కలిగి ఉన్నవారు కాబట్టి, తన మరణం ద్వారా మరణంపై అధికారం కలవాడైన అపవాది అధికారాన్ని విరుగగొట్టడానికి,

15 మరణ భయంతో దాస్యంలో ఉంచబడినవారిని విడిపించడానికి, ఆయన కూడా మానవరూపంలో పాలుపంచుకున్నాడు.

16 ఇది ఖచ్చితంగా అబ్రాహాము సంతానానికే గాని దేవదూతలకు సహాయం చేయడానికి కాదు.

17 దేవుని సేవచేయడంలో కనికరం కలిగిన నమ్మకమైన ప్రధాన యాజకునిగా ఉండడానికి, ప్రజల పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి, ఆయన అన్ని విధాలుగా వారిలా సంపూర్ణ మానవునిగా చేయబడ్డారు.

18 ఆయన మానవునిగా శోధించబడినప్పుడు బాధను అనుభవించారు కాబట్టి శోధించబడుతున్న వారికి ఆయన సహాయం చేయగలరు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan