Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

హెబ్రీయులకు 10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


అందరి కోసం ఒక్కసారే క్రీస్తు అర్పించబడుట

1 ధర్మశాస్త్రం రాబోయే మంచి విషయాల నీడ మాత్రమే కాని నిజ స్వరూపం కాదు. ప్రతి సంవత్సరం అర్పించే అవే బలుల ద్వార అది, ఆరాధించడానికి వచ్చేవారిని పరిపూర్ణులను చేయలేదు.

2 లేకపోతే, వారు బలులు అర్పించడం మానేసేవారు కాదా? ఎందుకంటే ఆరాధించేవారు ఒక్కసారే శుద్ధి చేయబడ్డారు, ఇక అప్పటినుండి వారికి పాపాల గురించి ఇకపై అపరాధ మనస్సాక్షి లేదు.

3 అయితే ఆ బలులు ప్రతి సంవత్సరం పాపాల గురించి వారికి గుర్తు చేసేవిగా ఉండేవి.

4 ఎడ్ల మేకల రక్తానికి పాపాలను తొలగించడం అసాధ్యము.

5 అందుకని, క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు ఇలా అన్నారు: “బలిని అర్పణను మీరు కోరలేదు, కాని మీరు నాకొక శరీరాన్ని సిద్ధపరచారు;

6 దహనబలులతో పాపపరిహార బలులతో మీరు సంతోషించలేదు.

7 అప్పుడు నేను ఇలా అన్నాను, ‘ఇదిగో నేను ఉన్నాను; గ్రంథపుచుట్టలో నా గురించి వ్రాయబడినట్లు నా దేవా, మీ చిత్తం చేయడానికి నేను వచ్చాను.’ ”

8 ఆయన మొదట ఇలా అన్నారు, “బలులు, అర్పణలు, దహనబలులు, పాపపరిహార బలులను కోరలేదు, అవి ధర్మశాస్త్ర ప్రకారమే అర్పించబడినప్పటికి వాటిని బట్టి మీరు సంతోషించలేదు.”

9 తర్వాత ఆయన, “నేను ఇక్కడే ఉన్నాను, మీ చిత్తం చేయడానికి నేను వచ్చాను” అని చెప్పాడు. ఆయన రెండవదానిని స్థాపించడానికి మొదటి దానిని ప్రక్కన పెడతాడు.

10 ఆ చిత్తాన్ని బట్టి, యేసు క్రీస్తు శరీరాన్ని అందరి కోసం ఒక్కసారే అర్పించుట ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడ్డాము.

11 ప్రతిదినం ప్రతి యాజకుడు నిలబడి మతపరమైన విధులు నిర్వర్తిస్తాడు; పాపాలను ఎన్నటికిని తీసివేయలేని అదే బలులను పదే పదే అర్పిస్తాడు.

12 అయితే ఈ యాజకుడు పాపాల కోసం అన్ని కాలాలకు ఒకే ఒక బలిని అర్పించి, దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు,

13 ఆ సమయం నుండి తన శత్రువులు తన పాదపీఠంగా చేయబడేవరకు ఆయన అక్కడ వేచి ఉంటాడు.

14 పరిశుద్ధులుగా చేయబడిన వారిని, ఒకే ఒక బలి ద్వారా ఆయన శాశ్వతంగా పరిపూర్ణులను చేశాడు.

15 పరిశుద్ధాత్మ కూడా దీనిని గురించి మనకు సాక్ష్యమిస్తున్నాడు. మొదట ఆయన ఇలా అన్నాడు:

16 “ఆ కాలం తర్వాత నేను వారితో చేసే నిబంధన ఇదే అని ప్రభువు చెప్పారు. వారి మనస్సులో నా న్యాయవిధులను ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని వ్రాస్తాను.”

17 ఆయన ఇంకా ఇలా అన్నారు: “వారి పాపాలను, అధర్మ క్రియలను నేను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.”

18 ఇవి క్షమింపబడినప్పడు, పాప పరిహారానికి ఇక బలి అవసరం ఉండదు.


విశ్వాసంలో పట్టుదలకు పిలుపు

19 కాబట్టి, సహోదరీ సహోదరులారా, యేసు తన శరీరమనే తెర ద్వారా మన కోసం తెరవబడిన సజీవమైన ఒక క్రొత్త మార్గం ద్వారా,

20 యేసు రక్తాన్ని బట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తామనే నమ్మకాన్ని మనం కలిగి ఉన్నాము.

21 దేవుని గృహంపైన ఒక గొప్ప యాజకుని మనం కలిగి ఉన్నాము.

22 విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగిన యథార్థ హృదయంతో, అపరాధ మనస్సాక్షి నుండి శుద్ధి చేయబడిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుని సమీపిద్దాము.

23 వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి, మనం గొప్పగా చెప్పుకొనే నిరీక్షణను గట్టిగా పట్టుకుందాము.

24 ప్రేమ మంచిపనుల పట్ల మనం ఒకరినొకరం ఎలా ప్రేరేపించవచ్చో ఆలోచిద్దాం,

25 కొందరు అలవాటుగా మానివేసినట్లుగా, మనం కలవడం మానివేయకుండా, ఆ దినం సమీపించడం మీరు చూసినప్పుడు ఇంకా ఎక్కువగా కలుసుకొంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుందాము.

26 సత్యం మనకు తెలియజేయబడిన తర్వాత కూడా ఒకవేళ మనం పాపాలు చేస్తూనే ఉంటే, ఆ పాపాలను తొలగించగల బలి ఏది లేదు,

27 అయితే తీర్పు కోసం, దేవుని శత్రువులను దహించబోయే ప్రచండమైన అగ్ని కోసం మాత్రమే భయంతో ఎదురుచూడడం మిగిలి ఉంటుంది.

28 మోషే ధర్మశాస్త్రాన్ని తిరస్కరించినవారు ఎవరైనా సరే ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల సాక్ష్యాన్ని బట్టి దయ లేకుండా చంపివేయబడ్డారు.

29 అలాంటప్పుడు దేవుని కుమారుని తమ పాదాల క్రింద త్రొక్కినవారు, తమను పరిశుద్ధపరచే నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదానిగా భావించినవారు, కృప గల ఆత్మను అవమానించినవారు ఎంత గొప్ప తీవ్రమైన శిక్షను పొందుతారో మీరు ఊహించగలరా?

30 “పగ తీర్చుకోవడం నా పని, నేను ప్రతిఫలాన్ని ఇస్తాను” అని, మరలా, “ప్రభువు, తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అని చెప్పిన వాడు మనకు తెలుసు.

31 సజీవుడైన దేవుని చేతుల్లో పడడం మహా భయంకరమైన విషయము.

32 మీరు వెలుగును పొందిన తర్వాత, అనేక శ్రమలతో నిండిన గొప్ప పోరాటాన్ని మీరు ఓర్చుకున్న ప్రారంభపు రోజులను జ్ఞాపకం చేసుకోండి.

33 కొన్నిసార్లు మీరు బహిరంగంగా అవమానపరచబడ్డారు, హింసించబడ్డారు; మరికొన్నిసార్లు మీరు అలాంటివి అనుభవించిన వారితో పాలివారయ్యారు.

34 చెరసాలలో వేయబడిన వారితో పాటు మీరు శ్రమ అనుభవించారు, మీ ఆస్తులను దోచుకున్నా సంతోషంగా స్వీకరించారు, వాటికంటే శాశ్వతంగా నిలిచే మరింత మేలైన ఆస్తులను కలిగి ఉన్నారని మీకు తెలుసు కాబట్టి మీరు వాటిని భరించారు.

35 కాబట్టి మీ ధైర్యాన్ని కోల్పోవద్దు; దానికి మీరు గొప్ప ఫలాన్ని పొందుతారు.

36 దేవుని చిత్తాన్ని చేసేప్పుడు మీరు పట్టుదలగా ఉండడం అవసరం, ఆయన వాగ్దానం చేసిన దాన్ని మీరు పొందుకుంటారు.

37 “ఎందుకంటే ఇంకాసేపట్లో, రాబోయేవాడు వస్తాడు ఆలస్యం చేయడు.”

38 ఇంకా, “నా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. అయితే వెనుతిరిగే వానిని బట్టి నా హృదయం ఏమాత్రం ఆనందించదు.”

39 అయితే మనం వెనుతిరిగి నశించేవారితో లేము, కానీ విశ్వాసం కలిగి, తమ ఆత్మలను కాపాడుకునేవారితో ఉన్నాము.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan