Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ఆదికాండము 6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


లోకంలో దుష్టత్వం

1 నరులు భూమిపై వృద్ధి చెంది విస్తరిస్తూ ఉన్న సమయంలో వారికి కుమార్తెలు పుట్టినప్పుడు,

2 దేవుని కుమారులు నరుల కుమార్తెలు అందంగా ఉండడం చూసి, వారిలో నచ్చిన వారిని పెళ్ళి చేసుకున్నారు.

3 అప్పుడు యెహోవా, “నా ఆత్మ నరులతో నిరంతరం వాదించదు, ఎందుకంటే వారు శరీరులు; వారి బ్రతుకు దినాలు 120 సంవత్సరాలు అవుతాయి” అని అన్నారు.

4 ఆ దినాల్లో భూమిపై నెఫిలీములు ఉండేవారు, వీరు తర్వాత కూడా ఉన్నారు. వీరు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు పుట్టిన పిల్లలు. వీరు ప్రాచీన కాలంలో పేరు పొందిన యోధులు.

5 యెహోవా భూమిపై నరుల దుష్టత్వం చాలా విస్తరించిందని, నరుల హృదయంలోని ప్రతీ ఊహ కేవలం చెడు అని చూశారు.

6 యెహోవా భూమిపై నరులను చేసినందుకు చింతించి, హృదయంలో చాలా బాధపడ్డారు.

7 అప్పుడు యెహోవా, “నేను సృజించిన నరులను, వారితో పాటు జంతువులను, పక్షులను, నేలపై ప్రాకే జీవులను భూమి మీద నుండి తుడిచివేస్తాను, వాటిని చేసినందుకు నేను బాధపడుతున్నాను” అని అనుకున్నారు.

8 అయితే నోవహు యెహోవా దృష్టిలో దయ పొందుకున్నాడు.


నోవహు, జలప్రళయం

9 నోవహు అతని కుటుంబం యొక్క వివరాలు: నోవహు నీతిమంతుడు, అతని సమకాలికులలో అతడు నిందారహితుడు, దేవునితో నమ్మకంగా జీవించాడు.

10 నోవహుకు ముగ్గురు కుమారులు: షేము, హాము, యాపెతు.

11 దేవుని దృష్టిలో భూమి అవినీతితో హింసతో నిండిపోయింది.

12 దేవుడు ఈ భూమి ఎంతో అవినీతితో ఉందని చూశారు, ఎందుకంటే భూమిపై ఉన్న ప్రజలంతా తమ జీవిత విధానాలను పాడుచేసుకున్నారు.

13 కాబట్టి దేవుడు నోవహుతో ఇలా అన్నారు, “నేను ప్రజలందరినీ నాశనం చేయబోతున్నాను, ఎందుకంటే వారిని బట్టి భూమి హింసతో నిండిపోయింది. నేను ఖచ్చితంగా వారిని, భూమిని నాశనం చేయబోతున్నాను.

14 కాబట్టి నీకోసం తమాల వృక్ష చెక్కతో ఒక ఓడను నిర్మించుకో; దానిలో గదులు చేసి, దానికి లోపల బయట కీలు పూయాలి.

15 దానిని నిర్మించవలసిన విధానం: ఆ ఓడ పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు ఉండాలి.

16 దానికి పైకప్పు వేసి, మూర కొలత క్రింద అన్ని మూలలు గల ఒక కిటికీ పెట్టాలి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టాలి, క్రింద, మధ్య, పై అంతస్తులు నిర్మించాలి.

17 ఆకాశం క్రింద ఉన్న సమస్త జీవులను, జీవవాయువు గల ప్రతి ప్రాణిని నాశనం చేయడానికి నేను భూమి మీదికి జలప్రళయం తీసుకురాబోతున్నాను. భూమిపై ఉన్న ప్రతిదీ నశిస్తుంది.

18 అయితే నీతో నా నిబంధనను స్థిరపరుస్తాను, ఓడలో నీతో పాటు నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు ప్రవేశించాలి.

19 మీతో పాటు బ్రతికి ఉండేలా జీవులన్నిటిలో మగ, ఆడవాటిని మీరు ఓడలోకి తీసుకురావాలి.

20 ప్రతి జాతిలో రెండేసి పక్షులు, ప్రతి జాతిలో రెండేసి జంతువులు, ప్రతి జాతిలో నేలపై ప్రాకే ప్రాణులు బ్రతికి ఉండడానికి నీ దగ్గరకు వస్తాయి.

21 నీకు, వాటికి తినడానికి ఆహారాన్ని అన్ని రకాల భోజనపదార్థాలు సమకూర్చుకోవాలి.”

22 దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టే నోవహు అంతా చేశాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan