Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ఆదికాండము 38 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


యూదా, తామారు

1 ఆ సమయంలో, యూదా తన సోదరులను విడిచి, హీరా అనే ఒక అదుల్లామీయుని దగ్గర ఉన్నాడు.

2 అక్కడ ఒక కనానీయుడైన షూయ కుమార్తెను కలిశాడు. ఆమెను పెళ్ళి చేసుకుని ఆమెతో లైంగికంగా కలుసుకున్నాడు;

3 ఆమె గర్భవతియై కుమారున్ని కన్నది. అతనికి ఏరు అని పేరు పెట్టారు.

4 ఆమె మరలా గర్భవతియై కుమారుని కన్నది, అతనికి ఓనాను అని పేరు పెట్టింది.

5 ఆమె మరొక కుమారుని కన్నది, అతనికి షేలా అని పేరు పెట్టింది. ఆమె కజీబులో ఇతనికి జన్మనిచ్చింది.

6 యూదా అతని మొదటి కుమారుడైన ఏరుకు తామారుతో పెళ్ళి చేశాడు.

7 కానీ యూదా మొదటి కుమారుడైన ఏరు, యెహోవా దృష్టికి చెడ్డవాడు కాబట్టి యెహోవా అతన్ని మరణానికి గురి చేశారు.

8 అప్పుడు యూదా ఓనానుతో, “నీ అన్న భార్యతో పడుకోని మరిది ధర్మం నిర్వర్తించి నీ అన్నకు సంతానం కలిగేలా చేయి” అని అన్నాడు.

9 అయితే పుట్టే బిడ్డ అతని బిడ్డగా ఉండదని ఓనానుకు తెలుసు; కాబట్టి తన అన్న భార్యతో పడుకున్న ప్రతిసారి, తన అన్నకు సంతానం కలుగకూడదని తన వీర్యాన్ని నేలపై విడిచాడు.

10 అతడు చేసిన పని యెహోవా దృష్టికి చెడ్డదైనందుకు యెహోవా అతన్ని కూడా మరణానికి గురి చేశారు.

11 అప్పుడు యూదా తన కోడలు తామారుతో, “నా కుమారుడు షేలా ఎదిగే వరకు నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అని అన్నాడు. ఎందుకంటే అతడు, “తన అన్నల్లా ఇతడు కూడా చనిపోతాడేమో” అని అనుకున్నాడు. కాబట్టి తామారు తన తండ్రి ఇంట్లో ఉండడానికి వెళ్లింది.

12 చాలా కాలం తర్వాత యూదా భార్య, షూయ కుమార్తె చనిపోయింది. యూదా దుఃఖ కాలం తీరిపోయాక, తన గొర్రెబొచ్చు కత్తిరించే వారున్న తిమ్నాకు వెళ్లాడు, అతని స్నేహితుడైన హీరా అనే అదుల్లామీయుడు అతనితో వెళ్లాడు.

13 “నీ మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాకు వెళ్తున్నాడు” అని తామారుకు తెలిసినప్పుడు,

14 తన విధవరాలి బట్టలు తీసివేసి తలమీద ముసుగు వేసుకుని, తిమ్నా మార్గంలో ఉన్న ఎనయీము అనే గ్రామ ప్రవేశం దగ్గర కూర్చుంది. షేలా పెద్దవాడైనా కూడా ఆమె అతనికి భార్యగా ఇవ్వబడలేదు కాబట్టి ఆమె అలా చేసింది.

15 యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకున్నందుకు వేశ్య అనుకున్నాడు.

16 ఆమె తన కోడలని తెలియక, దారిలో ఉన్న ఆమె వైపు వెళ్లి, “రా, నేను నీతో పడుకుంటాను” అని అన్నాడు. “నాతో పడుకోడానికి నాకు ఏమి ఇస్తావు?” అని ఆమె అడిగింది.

17 అతడు, “నా మంద నుండి మేకపిల్లను ఇస్తాను” అని చెప్పాడు. అప్పుడు ఆమె, “అది పంపే వరకు నా దగ్గర ఏదైనా తాకట్టు పెడతావా?” అని అడిగింది.

18 అతడు, “ఏం తాకట్టు పెట్టాలి?” అని అడిగాడు. ఆమె, “నీ ముద్ర, దాని దారం, నీ చేతిలో ఉన్న కర్ర” అని అన్నది. కాబట్టి అతడు అవి ఆమెకు ఇచ్చి ఆమెతో పడుకున్నాడు, అతని ద్వారా ఆమె గర్భవతి అయ్యింది.

19 ఆమె వెళ్లి తన ముసుగు తీసివేసి తిరిగి తన విధవరాలి బట్టలు వేసుకుంది.

20 అంతలో యూదా ఆ స్త్రీ దగ్గర తాకట్టు పెట్టినవి విడిపించుకోడానికి తన స్నేహితుడైన అదుల్లామీయుని ద్వారా మేకపిల్లను పంపాడు కానీ ఆమె అతనికి కనబడలేదు.

21 అక్కడున్న మనుష్యులను, “ఎనయీము దారి ప్రక్కన ఉండే పుణ్యక్షేత్ర వేశ్య ఎక్కడుంది?” అని అడిగాడు. “ఇక్కడ పుణ్యక్షేత్ర వేశ్య ఎవరు లేరు” అని వారన్నారు.

22 కాబట్టి అతడు యూదా దగ్గరకు తిరిగివెళ్లి, “నేను ఆమెను కనుగొనలేదు. అంతేకాక, అక్కడ ఉండే మనుష్యులు, ‘ఇక్కడ పుణ్యక్షేత్ర వేశ్య లేదు’ అని అన్నారు” అని చెప్పాడు.

23 అప్పుడు యూదా, “ఆమె తన దగ్గర ఉన్నవాటిని ఉంచుకోనివ్వండి, లేకపోతే మనం నవ్వుల పాలవుతాము. ఎంతైనా నేను ఆమెకు ఈ మేకపిల్లను పంపాను, కానీ నీకు ఆమె కనబడలేదు” అని అన్నాడు.

24 దాదాపు మూడు నెలలు తర్వాత, “నీ కోడలు తామారు వ్యభిచారిగా అపరాధం చేసింది, ఫలితంగా ఇప్పుడు ఆమె గర్భవతి” అని యూదాకు తెలియజేయబడింది. యూదా అన్నాడు, “ఆమెను బయటకు తీసుకువచ్చి ఆమెను కాల్చి చంపండి!” అని అన్నాడు.

25 ఆమెను బయటకు తీసుకువచ్చినప్పుడు, ఆమె తన మామకు వార్త పంపి, “ఇవి ఎవరికి చెందినవో ఆ యజమాని ద్వార నేను గర్భవతినయ్యాను” అని అన్నది. ఇంకా ఆమె, “ఈ ముద్ర, దారం, కర్ర ఎవరివో గుర్తుపడ్తారేమో చూడండి” అని అన్నది.

26 యూదా అవి తనవేనని గుర్తుపట్టి ఇలా అన్నాడు, “ఆమె నాకంటే నీతిమంతురాలు, ఎందుకంటే నేను ఆమెను నా కుమారుడైన షేలాకు ఇచ్చి పెళ్ళి చేయలేదు.” ఆ తర్వాత అతడు ఆమెతో మరలా ఎప్పుడూ పడుకోలేదు.

27 ఆమె బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.

28 కాన్పు సమయంలో ఒక శిశువు బయటకు వస్తూ చేయి చాచాడు; మంత్రసాని ఎర్రటి నూలుదారం ఆ శిశువు చేతికి కట్టి, “ఇతడు మొదట బయటకు వచ్చినవాడు” అని అన్నది.

29 అయితే ఆ శిశువు చేయి వెనుకకు తీసుకున్నప్పుడు, అతని సోదరుడు బయటకు వచ్చాడు, అప్పుడు ఆమె, “ఇలా నీవు దూసుకుని వచ్చావు!” అన్నది. అతనికి పెరెసు అని పేరు పెట్టారు.

30 తర్వాత చేతికి ఎర్రటి దారం ఉన్నవాడు బయటకు వచ్చాడు. అతనికి జెరహు అని పేరు పెట్టారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan