Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

గలతీయులకు 5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


క్రీస్తులో స్వాతంత్ర్యం

1 క్రీస్తు మనకు విడుదల ఇచ్చి మనల్ని స్వతంత్రులుగా చేశారు. కాబట్టి మీరు స్థిరంగా నిలబడండి; బానిసత్వపు కాడి ద్వారా మీరు మళ్ళీ మీమీద భారాన్ని మోపుకోకండి.

2 నా మాటలను గుర్తు పెట్టుకోండి! పౌలు అనే నేను చెప్పేది ఏంటంటే, మీరు సున్నతి పొందినవారైతే, క్రీస్తు ద్వారా మీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు.

3 సున్నతి పొందినవారు ధర్మశాస్త్రమంతటికి లోబడి ఉండాలని అందరితో మళ్ళీ నేను చెప్తున్నాను.

4 ధర్మశాస్త్రం చేత నీతిమంతులుగా తీర్చబడాలని ప్రయత్నిస్తున్న మీరు క్రీస్తు నుండి దూరం చేయబడ్డారు. మీరు కృపకు దూరమయ్యారు.

5 నీతిమంతులుగా తీర్చబడాలనే మన నిరీక్షణ నెరవేరాలని మనం విశ్వాసం కలిగి ఆత్మ ద్వారా ఆసక్తితో ఎదురుచూస్తున్నాము.

6 యేసు క్రీస్తులో ఉన్నవారు సున్నతి పొందినా పొందకపోయినా దానివల్ల ప్రయోజనమేమి ఉండదు. కేవలం ప్రేమ ద్వారా వ్యక్తపరచబడే విశ్వాసం మాత్రమే ప్రయోజనకరం అవుతుంది.

7 మీరు బాగా పరుగెడుతున్నారు. మీరు సత్యానికి లోబడకుండా మిమ్మల్ని ఆపిన వారెవరు?

8 అలాంటి బోధ మిమ్మల్ని పిలిచే వాని నుండి రాలేదు.

9 “పులిసిన పిండి కొంచెమైనా మొత్తం పిండిని పులియజేస్తుంది.”

10 మీరు మరోలా ఆలోచించరని ప్రభువులో నేను నమ్మకం కలిగి ఉన్నాను. మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవారు ఎవరైనా సరే వారు తగిన శిక్షను భరించాలి.

11 సహోదరీ సహోదరులారా, ఒకవేళ నేను ఇంకా సున్నతి గురించి ప్రకటిస్తూ ఉన్నట్లయితే, మరి నేనెందుకు ఇంకా హింసించబడుతున్నాను? అలా అయితే సిలువను గురించిన నేరం రద్దు చేయబడింది కదా.

12 మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవారు తమను తాము నరికివేసుకోవడం మంచిది!


ఆత్మ ద్వారా జీవితం

13 నా సహోదరీ సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే మీ స్వాతంత్ర్యాన్ని శరీరాశలను నెరవేర్చడానికి ఉపయోగించకుండా, ప్రేమ కలిగి వినయంతో ఒకరికొకరు సేవ చేసుకోండి.

14 “మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి” అనే ఒక్క ఆజ్ఞను పాటించడం వలన ధర్మశాస్త్రమంతా నెరవేరుతుంది.

15 ఒకవేళ మీరు ఒకరినొకరు కరచుకుని మ్రింగివేస్తున్నట్లయితే, జాగ్రత్తపడండి లేదా ఒకరి వలన ఒకరు నాశనం అవుతారు జాగ్రత్తపడండి.

16 కాబట్టి, నేను చెప్పేదేంటంటే, ఆత్మను అనుసరించి నడుచుకోండి, అప్పుడు మీరు శరీరవాంఛలను తృప్తి పరచరు.

17 శరీరవాంఛలు ఆత్మకు విరుద్ధమైనవి, ఆత్మ సంబంధమైనవి శరీరానికి విరుద్ధమైనవి. అవి ఒక దానికి ఒకటి వ్యతిరేకం కాబట్టి మీరు చేయాలనుకున్నవాటిని మీరు చేయరు.

18 మీరు ఆత్మ చేత నడిపించబడుతున్నవారైతే, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కారు.

19 శరీర సంబంధమైన క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేమంటే: లైంగిక దుర్నీతి, అపవిత్రత, వేశ్యాలోలత్వము;

20 విగ్రహారాధన, క్షుద్రవిద్య; ద్వేషం, విరోధం, అసూయ, అధికమైన ఆగ్రహం స్వార్థపూరిత ఆశలు, భేదాభిప్రాయాలు, విభేదాలు,

21 ఓర్వలేనితనం, మద్యం మత్తు, పోకిరి ఆటలు మొదలైనవి. నేను గతంలో మిమ్మల్ని హెచ్చరించినట్లుగా ఇలాంటి జీవితాన్ని జీవించేవారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మళ్ళీ హెచ్చరిస్తున్నాను.

22 అయితే ఆత్మ వలన కలిగే ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం,

23 మృదుత్వం, మనస్సును అదుపు చేసుకోవడం. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ నియమం లేదు.

24 యేసు క్రీస్తుకు సంబంధించినవారు శరీరాన్ని దాని వాంఛలతో దురాశలతో సిలువ వేశారు.

25 మనం ఆత్మ వలన జీవిస్తున్నాం కాబట్టి మనం ఆత్మతో పాటు నడుద్దాము.

26 ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ, ఒకరిపై ఒకరు అసూయపడుతూ, మనం అహంకారులుగా ఉండవద్దు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan