ఎజ్రా 3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంబలిపీఠాన్ని తిరిగి కట్టుట 1 ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు తమ పట్టణాల్లో స్థిరపడినప్పుడు, ప్రజలు ఒక్కటిగా యెరూషలేములో సమావేశమయ్యారు. 2 అప్పుడు యోజాదాకు కుమారుడైన యెషూవ, అతని తోటి యాజకులు, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, అతని తోటి పనివారు దైవజనుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారంగా దహనబలులు అర్పించడానికి ఇశ్రాయేలీయుల దేవునికి బలిపీఠాన్ని కట్టడం మొదలుపెట్టారు. 3 వీరికి అక్కడి ప్రజల భయం ఉన్నా, బలిపీఠాన్ని దాని పునాదుల మీదనే కట్టి, ఉదయ సాయంత్రాల్లో యెహోవాకు దహనబలులు క్రమంగా అర్పిస్తూ వచ్చారు. 4 తర్వాత ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విధంగా గుడారాల పండుగ చేసుకుని నియమించబడిన సంఖ్య ప్రకారం ప్రతిరోజు దహనబలులు అర్పించారు. 5 దాని తర్వాత క్రమంగా దహనబలులు, అమావాస్య బలులు, యెహోవా యొక్క పరిశుద్ధ పండుగలకు అర్పించవలసిన బలులు, అదే విధంగా ఒక్కొక్కరు తీసుకువచ్చిన స్వేచ్ఛార్పణలు అర్పించారు. 6 యెహోవా ఆలయానికి ఇంకా పునాది వేయనప్పటికి, ఏడవ నెల మొదటి రోజు నుండి వారు యెహోవాకు దహనబలులు అర్పించడం మొదలుపెట్టారు. మందిరాన్ని తిరిగి నిర్మించుట 7 అప్పుడు వారు తాపీ మేస్త్రీలకు, వడ్రంగులకు డబ్బులు ఇచ్చారు. పర్షియా రాజైన కోరెషు ఆదేశం ప్రకారం దేవదారు మ్రానులను సముద్రం ద్వారా లెబానోను నుండి యొప్ప పట్టణానికి చేర్చడానికి సీదోనీయులకు, తూరువారికి భోజనపదార్థాలు, ఒలీవనూనె ఇచ్చారు. 8 యెరూషలేములోని దేవుని ఆలయానికి వారు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదాకు కుమారుడైన యెషూవ యాజకులు, ఇతర ప్రజలు (యాజకులు, లేవీయులు, బందీ నుండి విడుదల పొంది యెరూషలేముకు వచ్చిన వారందరు) పని ప్రారంభించారు. లేవీయులలో ఇరవై సంవత్సరాలకన్నా ఎక్కువ వయస్సున్న వారిని యెహోవా మందిరపు పనిని పర్యవేక్షించడానికి నియమించారు. 9 వీరితో పాటు యెషూవ అతని కుమారులు, అతని సోదరులు, కద్మీయేలు అతని కుమారులు (యూదా వారసులు), హేనాదాదు కుమారులు, వారి సోదరులైన లేవీయులందరు దేవుని మందిరపు పనిని పర్యవేక్షించడానికి నియమించబడ్డారు. 10 నిర్మించేవారు యెహోవా ఆలయానికి పునాది వేసినప్పుడు ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన ప్రకారం యాజకులు ప్రత్యేక వస్త్రాలను ధరించి బూరలు పట్టుకుని, ఆసాపు కుమారులైన లేవీయులు తాళాలు పట్టుకుని యెహోవాను కీర్తించడానికి తమ తమ స్థానాల్లో నిలబడ్డారు. 11 కృతజ్ఞతా స్తుతులతో వారు యెహోవాకు ఈ పాట పాడారు: “ఆయన మంచివారు. ఇశ్రాయేలీయులపై ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.” యెహోవా మందిర పునాది వేస్తున్నప్పుడు ప్రజలందరు బిగ్గరగా గొంతెత్తి యెహోవాను స్తుతించారు. 12 అయితే గతంలో ఉన్న మందిరాన్ని తమ కళ్లతో చూసిన వృద్ధులైన యాజకులు, లేవీయులు, నాయకులు చాలామంది, ఇప్పుడు వేస్తున్న మందిర పునాదిని చూసి గట్టిగా ఏడ్చారు. మరికొందరు సంతోషంతో కేకలు వేశారు. 13 అక్కడ ఉన్న ప్రజలు చాలా పెద్దగా శబ్దం చేయడంతో సంతోషంతో వేసిన కేకలకు, దుఃఖంతో వేసిన కేకలకు తేడా తెలుసుకోలేకపోయారు. ఆ శబ్దం చాలా దూరం వరకు వినబడింది. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.