Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహెజ్కేలు 44 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


యాజకత్వ పునరుద్ధరణ

1 అతడు నన్ను తూర్పు వైపున ఉన్న పరిశుద్ధస్థలం బయటి ద్వారం దగ్గరికి తీసుకువచ్చాడు. అది మూసి ఉంది.

2 యెహోవా నాతో ఇలా అన్నారు, “అది మూసే ఉంటుంది. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ద్వారం గుండా ప్రవేశించారు కాబట్టి అది మూసే ఉంటుంది. ఏ ఒక్కరూ దానిలో ప్రవేశించకుండా ఇక ఎన్నటికీ తెరవకుండా మూసే ఉంటుంది.

3 యువరాజైన ఒక్కడే యెహోవా సన్నిధిలో భోజనం చేయడానికి ద్వారం లోపల కూర్చోవచ్చును. అతడు మంటపం మార్గంలో లోపలికి వెళ్లి అదే దారిలో బయటకు వెళ్లాలి.”

4 అతడు నన్ను ఉత్తర ద్వారం గుండా మందిరం ముందుకు తీసుకువచ్చాడు. అప్పుడు నేను యెహోవా మహిమ ప్రకాశంతో యెహోవా మందిరం నిండిపోవడం చూసి నేను నేలపై పడ్డాను.

5 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, యెహోవా ఆలయానికి సంబంధించిన అన్ని నియమాలు విధుల గురించి నేను నీకు చెప్పే ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని గ్రహించు. మందిరం లోపలికి వచ్చే మార్గాన్ని పరిశుద్ధస్థలం నుండి బయటకు వెళ్లే అన్ని మార్గాలను శ్రద్ధగా గమనించు.

6 తిరుగుబాటు చేసే ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఇశ్రాయేలు ప్రజలారా, ఇంతవరకు మీరు చేసిన అసహ్యమైన ఆచారాలు చాలు.

7 మీరు చేసిన అసహ్యమైన ఆచారాలతో పాటు హృదయానికి శరీరానికి సున్నతిలేని విదేశీయులను నా పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువచ్చి మీరు నాకు ఆహారాన్ని క్రొవ్వును రక్తాన్ని అర్పించి నా మందిరాన్ని అపవిత్రపరచి నా నిబంధనను భంగం చేశారు.

8 మీకు అప్పగించిన నా పవిత్ర వస్తువుల బాధ్యతను మీరు నెరవేర్చకుండా నా పరిశుద్ధస్థలం యొక్క బాధ్యతను ఇతరులకు అప్పగించారు.

9 ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: హృదయానికి శరీరానికి సున్నతిలేని విదేశీయులుగా ఇశ్రాయేలీయుల మధ్య నివసించే వారిలో ఎవరూ నా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించకూడదు.

10 “ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టి తమ విగ్రహాలను అనుసరించినప్పుడు వారితో పాటు నాకు దూరమైన లేవీయులు తమ దోషాన్ని భరించాలి.

11 వారు నా పరిశుద్ధ స్థలంలో సేవ చేశారు, ఆలయ ద్వారపాలకులుగా బాధ్యత వహించి సేవ చేశారు; వారు ప్రజల కోసం దహనబలులను బలులను వధించి ప్రజల ముందు నిలబడి వారికి సేవ చేశారు.

12 కానీ వారు తమ విగ్రహాల సమక్షంలో వారికి సేవ చేసి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యారు కాబట్టి వారు తమ పాప దోషాన్ని భరించేలా నేను వారికి వ్యతిరేకంగా నా చేయెత్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

13 వారు నాకు యాజకులుగా సేవ చేయడానికి నా సన్నిధికి రాకూడదు, నా పరిశుద్ధ వస్తువుల దగ్గరకు గాని అతి పరిశుద్ధ అర్పణల దగ్గరకు గాని రాకూడదు. వారు చేసిన అసహ్యమైన పనులకు వారు అవమానాన్ని భరించాలి.

14 అయితే మందిరంలో చేయవలసిన పనులన్నిటికి నేను వారిని కాపలాగా నియమిస్తాను.

15 “ఇశ్రాయేలు ప్రజలు నన్ను విడిచిపెట్టినప్పుడు నా పరిశుద్ధ స్థలానికి కాపలాగా ఉన్న సాదోకు వంశస్థులై లేవీయులైన యాజకులు సేవ చేయడానికి నా సన్నిధికి వస్తారు. వారు నా ఎదుట నిలబడి క్రొవ్వును రక్తాన్ని నాకు అర్పిస్తారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

16 వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు; వారే నా బల్ల దగ్గరికి వచ్చి సేవ చేస్తారు. వారే నేను అప్పగించిన దాన్ని కాపాడతారు.

17 “ ‘వారు లోపలి ఆవరణపు గుమ్మాల్లోకి ప్రవేశించినప్పుడు వారు నారబట్టలు ధరించాలి; లోపలి ఆవరణపు గుమ్మాల్లో గాని మందిరం లోపల గాని సేవ చేసేటప్పుడు వారు ఉన్ని బట్టలు వేసుకోకూడదు.

18 తలకు నార తలపాగా ధరించి నడుముకు నారబట్ట కట్టుకోవాలి. చెమట పుట్టించేదీ ఏదీ వారు ధరించకూడదు.

19 ప్రజలు ఉండే బయటి ఆవరణంలోకి వారు వెళ్లేటప్పుడు వారి వస్త్రాలతో తాకి ప్రజలు ప్రతిష్ఠించకుండా ఉండడానికి తమ సేవ వస్త్రాలను తీసివేసి వాటిని పవిత్రమైన గదుల్లో ఉంచి వేరే బట్టలు వేసుకుని వెళ్లాలి.

20 “ ‘వారు తమ తలలు క్షౌరం చేయించుకోకూడదు, తలవెంట్రుకలు పొడవుగా పెరగకుండ వాటిని కత్తిరించాలి.

21 లోపలి ఆవరణంలో ప్రవేశించేటప్పుడు ఏ యాజకుడు ద్రాక్షరసం త్రాగకూడదు.

22 యాజకులు విధవరాండ్రను గాని, విడాకులు తీసుకున్న స్త్రీని గాని పెళ్ళి చేసుకోకూడదు. వారు కేవలం ఇశ్రాయేలు కన్యలను గాని యాజకులకు భార్యలై విధవరాండ్రుగా ఉన్నవారిని గాని పెళ్ళి చేసుకోవచ్చు.

23 అంతేగాక వారు నా ప్రజలకు పవిత్రమైన వాటికి సాధారణమైన వాటి మధ్య భేదాన్ని బోధిస్తారు; పవిత్రమైన దానికి, అపవిత్రమైన దానికి మధ్య తేడా ఏమిటో వారికి చూపిస్తారు.

24 “ ‘ఏదైనా వివాదం ఉన్నప్పుడు యాజకులు న్యాయమూర్తులుగా వ్యవహరించి నా శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వాలి. నా నియమించబడిన పండుగలన్నిటిలో వారు నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను పాటించాలి, వారు నా విశ్రాంతి దినాలను పవిత్రంగా ఆచరించాలి.

25 “ ‘యాజకుడు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్లి తనను తాను అపవిత్రం చేసుకోకూడదు; చనిపోయిన వ్యక్తి తన తండ్రి తల్లి కుమారుడు కుమార్తె సోదరుడు లేదా పెళ్ళికాని సోదరి అయితే శవాన్ని ముట్టుకొని అతడు అపవిత్రం కావచ్చు.

26 అయితే అతడు శుద్ధి చేయబడిన తర్వాత, అతడు ఏడు రోజులు వేచి ఉండాలి.

27 పరిశుద్ధాలయంలో సేవ చేయడానికి పరిశుద్ధాలయం లోపలి ఆవరణంలోనికి వెళ్లినప్పుడు అతడు పాపపరిహారబలి అర్పించాలి, అని ప్రభువైన యెహోవా ప్రకటించారు.

28 “ ‘యాజకులకు ఉన్న ఏకైన వారసత్వం నేనే. నీవు వారికి ఇశ్రాయేలులో స్వాస్థ్యం ఇవ్వకూడదు; నేనే వారికి స్వాస్థ్యంగా ఉంటాను.

29 వారు భోజనార్పణలు, పాపపరిహార బలులు, అపరాధబలులు తింటారు. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించినవన్నీ వారివే అవుతాయి.

30 మీ ప్రథమ ఫలాల్లో మీ ప్రత్యేక కానుకలన్నిటిలో శ్రేష్ఠమైనవి యాజకులకు చెందుతాయి. మీ కుటుంబం మీద ఆశీర్వాదం ఉండేలా మీరు మొదట పిసికిన పిండిముద్దను యాజకులకు ఇవ్వాలి.

31 పక్షుల్లో పశువుల్లో సహజంగా చచ్చిన వాటిని గాని మృగాలు చీల్చిన వాటిని గాని యాజకులు తినకూడదు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan