యెహెజ్కేలు 43 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథందేవుని మహిమ ఆలయానికి తిరిగి వచ్చుట 1 అతడు నన్ను తూర్పు వైపున ఉన్న గుమ్మం దగ్గరకు తీసుకువచ్చాడు. 2 ఇశ్రాయేలు దేవుని మహిమ తూర్పు నుండి రావడం నేను చూశాను. ఆయన స్వరం, ప్రవహించే జలాల గర్జనలా ఉంది, భూమి ఆయన మహిమతో ప్రకాశిస్తూ ఉంది. 3 నేను చూసిన దర్శనం ఆయన పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు కెబారు నది దగ్గర నేను చూసిన దర్శనాల్లా ఉంది, నేను నేలపై సాష్టాంగపడ్డాను. 4 తూర్పు వైపున ఉన్న గుమ్మం గుండా యెహోవా మహిమ మందిరంలోనికి ప్రవేశించింది. 5 అప్పుడు ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణంలోకి తీసుకువచ్చినప్పుడు, ఆలయమంతా యెహోవా మహిమ నిండిపోయి ఉంది. 6 ఆ వ్యక్తి నా ప్రక్కన నిలబడి ఉండగా, మందిరం లోపలి నుండి ఎవరో నాతో మాట్లాడడం విన్నాను. 7 ఆయన ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఇది నా సింహాసనం, నా పాదాలు పెట్టుకునే స్థలము. ఇక్కడే నేను ఇశ్రాయేలీయుల మధ్య శాశ్వతంగా నివసిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు తమ వ్యభిచారం ద్వారా, వారి రాజుల మరణ సమయంలో వారి అంత్యక్రియల అర్పణల ద్వారా నామాన్ని వారు గాని వారి రాజులు గాని అపవిత్రం చేయరు. 8 నాకు వారికి మధ్య గోడ మాత్రమే ఉంచి, వారు నా గుమ్మం ప్రక్కన తమ గుమ్మాలను, నా గడపల ప్రక్కన తమ గడపలను కట్టి, తమ అసహ్యమైన ఆచారాలతో వారు నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేశారు, కాబట్టి నేను కోపంతో వారిని నాశనం చేశాను. 9 ఇప్పటికైనా వారు తమ వ్యభిచారాన్ని తమ రాజుల అంత్యక్రియల అర్పణలను నా దగ్గరి నుండి దూరంగా తీసివేసినప్పుడు, నేను వారి మధ్య శాశ్వతంగా నివసిస్తాను. 10 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు ప్రజలు తమ పాపాలకు సిగ్గుపడేలా మందిరాన్ని గురించి వారికి వివరించండి. వారు దాని పరిపూర్ణతను పరిగణలోనికి తీసుకుని, 11 వారు చేసిన పనులన్నిటికి వారు సిగ్గుపడితే, వారికి ఆలయ రూపకల్పనను గురించి అనగా దాని అమర్చిన విధానం, దానిలోనికి వచ్చే బయటకు వెళ్లే ద్వారాల గురించి, దాని మొత్తం రూపకల్పన గురించి, దాని అన్ని నియమాలు, చట్టాలను తెలియజేయాలి. వారు దాని రూపకల్పన పట్ల నమ్మకంగా ఉండగలిగేలా, వారు దాని నియమానలన్నింటినీ అనుసరించేలా చేయడానికి వాటిని వారి ముందు వ్రాసిపెట్టాలి. 12 “ఇది ఆలయ నియమం: పర్వతం పైన ఉన్న పరిసర ప్రాంతాలన్నీ అత్యంత పవిత్రంగా ఉంటాయి. ఆలయ ధర్మం అలాంటిది. గొప్ప బలిపీఠం పునరుద్ధరణ 13 “మూరలలో బలిపీఠం కొలతలు: మూరెడు అంటే ఒక మూర ఒక బెత్తెడు; దాని అడుగుభాగం ఎత్తు ఒక మూర, వెడల్పు ఒక మూర. దాని అంచుకు ఒక జానెడు చట్రం ఉంది. ఇది బలిపీఠం యొక్క ఎత్తు: 14 నేల మీద ఉన్న అడుగుభాగం నుండి క్రింది గట్టు వరకు బలిపీఠం ఎత్తు రెండు మూరలు. వెడల్పు ఒక మూర. చిన్న గట్టు నుండి పెద్ద గట్టు వరకు దాని ఎత్తు నాలుగు మూరలు, వెడల్పు ఒక మూర. 15 బలిపీఠం పొయ్యి ఎత్తు నాలుగు మూరలు. ఆ పొయ్యి నుండి పైకి నాలుగు కొమ్మలు ఉన్నాయి. 16 ఆ పొయ్యి చతురస్రంగా ఉండి పొడవు పన్నెండు మూరలు వెడల్పు పన్నెండు మూరలు ఉంది. 17 దాని పైచూరు కూడా చతురస్రంగా ఉండి పొడవు పద్నాలుగు మూరలు వెడల్పు పద్నాలుగు మూరలు ఉంది. దాని చుట్టూ ఉన్న అంచు వెడల్పు ఒక జానెడు దాని అంచుకు అర మూరెడు చట్రం ఉంది. బలిపీఠానికి మెట్లు తూర్పు వైపుగా ఉన్నాయి.” 18 అప్పుడు అతడు నాతో ఇలా అన్నాడు, “మనుష్యకుమారుడా, యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ బలిపీఠం కట్టిన తర్వాత దాని మీద రక్తం చిలకరించి దహనబలులు అర్పించడానికి నియమాలు ఇవి: 19 నా సన్నిధిలో సేవ చేయడానికి వచ్చే సాదోకు కుటుంబీకులు లేవీయులైన యాజకులకు పాపపరిహారబలి అర్పించడానికి కోడెదూడను ఇవ్వాలని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. 20 వారు దానిని పాపపరిహారబలిగా అర్పించి బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేసి దాన్ని శుద్ధీకరించడానికి ఆ దూడ రక్తంలో కొంత తీసుకుని బలిపీఠపు నాలుగు కొమ్ము మీద, పై గట్టు నాలుగు మూలల మీద, చుట్టూ ఉన్న అంచు మీద ఉంచాలి. 21 మీరు పాపపరిహారబలి కోసం ఎద్దును తీసుకెళ్లి, పరిశుద్ధాలయం బయట ఆలయ ప్రాంతంలోని నిర్ణయించబడిన భాగంలో కాల్చాలి. 22 “రెండవ రోజున పాపపరిహారబలిగా ఏ లోపం లేని మేకపోతును అర్పించాలి. కోడెతో బలిపీఠానికి పాపపరిహారం చేసినట్లే మేకపోతుతో కూడా బలిపీఠానికి పాపపరిహారం చేయాలి. 23 దానిని శుద్ధి చేయడం పూర్తి చేసిన తర్వాత ఏ దోషంలేని కోడెను, పొట్టేలును అర్పించాలి. 24 మీరు వాటిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి అప్పుడు యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పిస్తారు. 25 “రోజుకు ఒకటి చొప్పున వరుసగా ఏడు రోజులు పాపపరిహారబలిగా మేకపోతులను సిద్ధం చేయాలి. అలాగే మందలో నుండి ఏ లోపం లేని కోడెను పొట్టేలును సిద్ధం చేయాలి. 26 ఏడు రోజులు యాజకులు బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేస్తూ దాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. అలా వారు దానిని ప్రతిష్ఠించాలి. 27 ఈ రోజులన్నీ ముగిసిన తర్వాత ఎనిమిదో రోజు నుండి యాజకులు బలిపీఠం మీద మీ దహనబలులు మీ సమాధానబలులు అర్పిస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.” |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.