Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహెజ్కేలు 31 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


నరికివేయబడిన లెబానోను దేవదారులా ఫరో

1 పదకొండవ సంవత్సరం మూడవ నెల మొదటి తేది యెహోవా వాక్కు నాకు వచ్చి:

2 “మనుష్యకుమారుడా, నీవు ఈజిప్టు రాజైన ఫరోతో అతని పరివారంతో ఇలా చెప్పు: “ ‘ఘనతలో నీకు సాటి ఎవరు?

3 అష్షూరును చూడు, ఒకప్పుడు లెబానోను దేవదారులా, అందమైన కొమ్మలతో అడవిలా ఉండేది; దాని చిటారు కొమ్మ మిగతా చెట్ల కన్నా ఎత్తుగా ఉండేది.

4 సమృద్ధియైన జలాలు దానిని పోషించాయి, లోతైన నీటి ఊటలు దానిని ఎత్తుగా పెరిగేలా చేశాయి; వాటి ప్రవాహాలు దాని మొదలు చుట్టూ ప్రవహించాయి, పొలంలో ఉన్న చెట్లన్నిటికి దాని కాలువలు నీరు అందించాయి.

5 కాబట్టి పొలం లోని చెట్లన్నిటి కన్నా ఆ చెట్టు ఎత్తుగా ఎదిగింది; నీరు సమృద్ధిగా ఉన్నందున, దాని కొమ్మలు విస్తరించి, పెద్ద శాఖలుగా ఎదిగాయి.

6 ఆకాశ పక్షులన్నీ దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి, అడవి జంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టాయి; గొప్ప జనాంగాలన్నీ దాని నీడలో నివసించాయి.

7 నీరు సమృద్ధిగా ఉన్న చోటికి దాని వేర్లు వ్యాపించాయి, కాబట్టి అది విస్తరించిన కొమ్మలతో ఎంతో అందంగా ఉంది.

8 దేవుని తోటలో దేవదారు వృక్షాలు కూడా దానితో పోటీపడలేకపోయాయి, సరళ వృక్షాలు దాని కొమ్మలతో సమానం కాలేవు, అక్షోట వృక్షాల కొమ్మలు దాని కొమ్మలతో పోల్చబడలేవు, దానికి ఉన్నంత అందం దేవుని తోటలో ఉన్న ఏ చెట్టుకు లేదు.

9 విస్తారమైన కొమ్మలతో నేను దానిని అందంగా తయారుచేశాను, దేవుని తోటయైన ఏదెను లోని చెట్లన్నీ దానిని చూసి అసూయపడేలా చేశాను.

10 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మహా దేవదారు చెట్టు మిగిలిన చెట్ల కన్నా ఎత్తుగా ఉంది కాబట్టి అది గర్వపడింది.

11 కాబట్టి దాని దుర్మార్గానికి తగినట్టుగా నేను దానిని దేశాల అధినేత చేతులకు అప్పగించాను. నేను దానిని విసిరివేశాను,

12 విదేశీ జాతులలో క్రూరులు దాన్ని నరికి నేల మీద వదిలేశారు. కొండల్లో, లోయల్లో దాని కొమ్మలు పడి ఉన్నాయి; భూమిమీది వాగులన్నిటిలో దాని కొమ్మలు విరిగిపడ్డాయి. భూమి మీద ఉన్న జాతులన్ని దాని నీడ నుండి బయటకు వచ్చి దానిని వదిలేశాయి.

13 కూలిపోయిన చెట్టు మీద ఆకాశ పక్షులన్నీ వాలాయి, కొమ్మల మధ్య అడవి జంతువులన్నీ నివసించాయి.

14 కాబట్టి నీటి ప్రక్కన ఉన్న ఏ చెట్టు వాటి చిటారు కొమ్మలను గుబురుగా పెంచుకుని గర్వించకూడదు. నీరు సమృద్ధిగా ఉన్న ఏ ఇతర చెట్లు అంత ఎత్తుకు ఎప్పటికీ ఎదగకూడదు; వాటన్నిటి గమ్యం మరణమే, భూమి దిగువన పాతాళంలోనికి దిగిపోయే సాధారణ మనుష్యుల్లా అవి చనిపోతాయి.

15 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అది పాతాళానికి రప్పించబడిన రోజున నేను దాని గురించి దుఃఖిస్తూ లోతైన ఊటలతో దానిని కప్పివేసాను; దాని ప్రవాహాలను ఆపి, విస్తారమైన జలాలను అరికట్టాను. దాని కోసం నేను లెబానోను పర్వతాన్ని గాఢాంధకారం కమ్మేలా చేశాను, పొలం లోని చెట్లన్నీ వాడిపోయాయి.

16 పాతాళంలోకి దిగే వారితో ఉండడానికి నేను దానిని పాతాళంలోకి దించినప్పుడు, దాని పతనం వల్ల వచ్చే శబ్దానికి నేను దేశాలు వణికిపోయేలా చేశాను. అప్పుడు ఏదెను చెట్లన్నీ, లెబానోనులో ఉత్తమమైనవి, మంచివి, సమృద్ధిగా నీరున్న చెట్లు, భూమి దిగువన ఓదార్పు పొందాయి.

17 వారు కూడా గొప్ప దేవదారులా, ఖడ్గంతో చంపబడినవారి దగ్గరకు, జాతుల మధ్య దాని నీడలో నివసించిన సాయుధ పురుషులతో పాటు పాతాళానికి దిగారు.

18 “ ‘వైభవంలో ఘనతలో ఏదెను తోటలో ఉన్న ఏ చెట్లు నీతో పోల్చబడగలవు? అయినప్పటికీ, నీవు కూడా ఏదెను చెట్లతో పాటు భూమి దిగువకు రప్పించబడతావు; సున్నతిలేనివారి మధ్య, ఖడ్గం వలన చచ్చినవారితో నీవు కూడ పడి ఉంటావు. “ ‘ఫరోకు, అతని పరివారానికి ఇలా జరుగుతుంది, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan