Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహెజ్కేలు 28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


తూరు రాజుకు వ్యతిరేకంగా ప్రవచనం

1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

2 “మనుష్యకుమారుడా, తూరు పాలకునితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘గర్వించిన హృదయంతో నీవు, “నేనొక దేవుడిని; సముద్రం మధ్యలో ఒక దేవుని సింహాసనం మీద నేను కూర్చున్నాను” అని అన్నావు. దేవునిలా నీవు జ్ఞానివి అనుకుంటున్నావు, కాని నీవు కేవలం ఒక మనిషివి మాత్రమే దేవునివి కాదు.

3 నీవు దానియేలు కన్నా జ్ఞానివా? నీకు తెలియని రహస్యం ఏదీ లేదా?

4 నీకున్న జ్ఞానంతో వివేకంతో నీకోసం సంపద సంపాదించుకుని నీ ఖజానాలో వెండి బంగారాలను పోగు చేసుకున్నావు.

5 వ్యాపారంలో నీకున్న గొప్ప నైపుణ్యంతో నీ సంపదను వృద్ధి చేసుకున్నావు, నీ సంపదను బట్టి నీవు హృదయంలో గర్వించావు.

6 “ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: “ ‘దేవునిలా నీవు జ్ఞానివి అనుకుంటున్నావు కాబట్టి,

7 నేను నీమీదికి విదేశీయులను, అత్యంత క్రూరులైన జనాంగాలను రప్పించబోతున్నాను; నీ జ్ఞానంతో నీవు సౌందర్యంగా నిర్మించుకున్న వాటి మీద ఖడ్గాన్ని దూసి, నీ వైభవాన్ని ద్వంసం చేస్తారు.

8 వారు నిన్ను పాతాళంలో పడవేస్తారు. సముద్రం మధ్యలో భయంకరంగా చనిపోతావు.

9 నిన్ను చంపేవారి ఎదుట “నేను దేవుడిని” అని చెప్తావా? నిన్ను చంపేవారి చేతుల్లో నీవు మనిషివే కాని దేవుడవు కావు.

10 సున్నతిలేనివారు చనిపోయినట్లు నీవు విదేశీయుల చేతిలో చస్తావు అని చెప్పింది నేనే అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

11 యెహోవా వాక్కు నాకు వచ్చి:

12 “మనుష్యకుమారుడా, తూరు రాజు గురించి విలాప గీతం పాడి అతనితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘నీవు పరిపూర్ణతకు ముద్రగా, జ్ఞానంతో నిండి ఎంతో అందంగా ఉండేవాడివి.

13 దేవుని తోటయైన, ఏదెనులో నీవు ఉండేవాడివి; ప్రతి ప్రశస్తమైన రాయితో నీవు అలంకరించబడ్డావు. మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి, కెంపు, సులిమాని, మరకతం, నీలమణి, పద్మరాగం, అన్ని బంగారంతో నీకోసం తయారుచేయబడ్డాయి; నీవు సృజించబడిన రోజున అవి నీకోసం సిద్ధపరచబడ్డాయి.

14 అభిషేకం పొందిన కావలి కెరూబులా నేను నిన్ను నియమించాను దేవుని పరిశుద్ధ పర్వతం మీద నీవున్నావు. నీవు కాలుతున్న రాళ్ల మధ్య నడిచావు.

15 నీవు సృష్టించబడిన రోజు నుండి నీలో దుష్టత్వం కనిపించిన రోజు వరకు నీ ప్రవర్తన నిందారహితంగా ఉంది.

16 అయితే నీ వ్యాపారం విస్తరించి నీవు హింసతో నిండిపోయి పాపం చేశావు. కాబట్టి నేను నిన్ను అపవిత్రపరచి దేవుని పర్వతం మీద ఉండకుండా వెళ్లగొట్టాను, కావలి కెరూబుల కాలుతున్న రాళ్ల మధ్య నీవిక ఉండకుండా నిన్ను నాశనం చేస్తాను.

17 నీ సౌందర్యం చూసుకుని నీ హృదయం గర్వించింది నీ వైభవం కారణంగా నీ జ్ఞానం కలుషితమయ్యింది, కాబట్టి నేను నిన్ను భూమి మీద పడవేస్తాను. రాజులు నిన్ను చూసేలా నేను నిన్ను వారి ఎదుట ఉంచుతాను.

18 నీ అన్యాయమైన వ్యాపారంతో నీవు చేసిన అనేక పాపాల వలన, నీ పరిశుద్ధాలయాలను అపవిత్రం చేశావు. కాబట్టి నీలో అగ్ని పుట్టిస్తాను. అది నిన్ను కాల్చివేస్తుంది, చూస్తున్న వారందరి ఎదుట నేను నిన్ను నేల మీద బూడిదగా చేస్తాను.

19 నిన్ను ఎరిగిన జనులంతా నిన్ను బట్టి వణికిపోతారు; నీవు భయానక ముగింపుకు వచ్చావు నీవు పూర్తిగా నాశనమైపోతావు.’ ”


సీదోనుకు వ్యతిరేకం ప్రవచనం

20 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

21 “మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని సీదోను పట్టణం వైపు త్రిప్పుకుని దాని గురించి ప్రవచించి ఇలా చెప్పు:

22 ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్య నేను ఘనత పొందుతాను. నేను నీకు శిక్ష విధించి నీలో నా పరిశుద్ధతను కనుపరిచినప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.

23 పట్టణం మీదికి తెగులు పంపించి నీ వీధుల్లో రక్తం పారేలా చేస్తాను. అన్ని వైపుల నుండి నీ మీదికి వచ్చే కత్తివేటుకు వారు చనిపోతారు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.

24 “ ‘ఇశ్రాయేలీయుల పొరుగువారు ఇకపై గుచ్చుకుని బాధించే కంపలుగా పదునైన ముళ్ళుగా ఉండరు. అప్పుడు వారు నేనే యెహోవానని తెలుసుకుంటారు.

25 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ప్రజల్లో చెదరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చినప్పుడు వారి ద్వారా నేను ఆ ప్రజల ఎదుట పరిశుద్ధుడనని రుజువవుతాను. నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన వారి దేశంలో వారు నివసిస్తారు.

26 అందులో వారు నిశ్చింతగా నివసించి ఇల్లు కట్టుకుని ద్రాక్షతోటలు నాటతారు. వారిని హింసించిన వారి పొరుగువారందరిని నేను శిక్షించిన తర్వాత వారు నిర్భయంగా నివసిస్తారు. అప్పుడు నేనే తమ దేవుడనైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan