Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహెజ్కేలు 27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


తూరు గురించి విలాపం

1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

2 “మనుష్యకుమారుడా, తూరు పట్టణం గురించి విలాప గీతం పాడు:

3 సముద్ర ద్వారం దగ్గర ఉన్న తూరుతో చెప్పు, అనేక తీర ప్రాంతాల ప్రజలకు వ్యాపారిగా ఉన్న తూరుతో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘తూరూ, నీవంటావు, “అందంలో నేను పరిపూర్ణమైన దానిని.”

4 నీ సరిహద్దులు సముద్రం మధ్యలో ఉన్నాయి; నీ భవన నిర్మాణకులు నీ అందానికి పరిపూర్ణత తెచ్చారు.

5 శెనీరు దేశపు సరళ పలకలతో వారు నీ ఓడలు తయారుచేస్తారు; లెబానోను దేవదారు చెక్కతో వారు ఓడ స్తంభాలు తయారుచేస్తారు.

6 బాషాను సింధూర చెక్కతో వారు నీ తెడ్లు తయారుచేస్తారు. కుప్ర తీరం నుండి తెచ్చిన తమాల కలపతో వారు నీకు పీటలు తయారుచేసి ఏనుగు దంతంతో అలంకరించారు.

7 ఈజిప్టు నుండి వచ్చిన కుట్టుపని చేసిన సన్నని నార నీ తెరచాపగా జెండాగా పని చేశాయి; ఎలీషా తీరాల నుండి తెచ్చిన నీలం ఊదా రంగుల బట్ట నీ అంతస్తుల పైకప్పులు.

8 తూరూ, సీదోను వారు అర్వాదు వారు నీ తెడ్లు వేసేవారు; నీ మనుష్యుల్లో నిపుణులైనవారు నీ నావికులు.

9 నీ ఓడను బాగుచేయడానికి గెబాలుకు చెందిన పెద్దలు, అనుభవజ్ఞులైన చేతి పనివారు ఉన్నారు. సముద్రంలో నీ వస్తువులు కొనడానికి, సముద్రపు నావికుల ఓడలన్నీ నీ రేవులో ఉన్నాయి.

10 “ ‘పర్షియా మనుష్యులారా, లిడియా, పూతుకు చెందినవారు నీ సైన్యంలో సైనికులుగా పని చేశారు. వారు తమ డాళ్లు, శిరస్త్రాణాలు నీ గోడలకు వ్రేలాడదీసి, నీకు వైభవాన్ని తెస్తున్నారు.

11 అర్వాదు వారు, హెలెకు వారు అన్నివైపులా నీ గోడలకు కాపలా కాసారు; గమ్మాదీయులు నీ గోపురాలలో ఉన్నారు. వారు తమ డాళ్లు, శిరస్త్రాణాలు నీ గోడలకు వ్రేలాడదీశారు; వారు నీ అందానికి పరిపూర్ణత తెచ్చారు.

12 “ ‘నీ గొప్ప సంపదను బట్టి తర్షీషు వారు నీతో వ్యాపారం చేశారు; వారు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి మీ సరుకు తీసుకున్నారు.

13 “ ‘గ్రీసు, తుబాలు, మెషెకు వారు నీతో వ్యాపారం చేశారు; మనుష్యులను, ఇత్తడి వస్తువులను ఇచ్చి మీ వస్తువులను కొన్నారు.

14 “ ‘బేత్ తోగర్మా వారు మీ సరుకు కోసం రథ గుర్రాలు, అశ్వికదళ గుర్రాలు కంచరగాడిదలను ఇచ్చారు.

15 “ ‘దేదాను వారు నీతో వ్యాపారం చేశారు, చాలా తీర ప్రాంతాల ప్రజలు నీ సరుకు కొన్నారు; వారు మీకు దంతపు దంతాలు, తునికి కలప ఇచ్చారు.

16 “ ‘నీ దగ్గర ఉన్న అనేక వస్తువుల కారణంగా అరామీయులు నీతో వ్యాపారం చేశారు. వారు పచ్చరాళ్లను, ఊదా రంగు నూలుతో కుట్టుపని చేసిన వస్త్రాలు, సన్నని నారబట్టలు, కెంపులు రత్నాలు ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.

17 “ ‘యూదా వారు, ఇశ్రాయేలీయులు నీతో వ్యాపారం చేశారు. వారు మిన్నీతు గోధుమలు, మిఠాయిలు, తేనె, ఒలీవనూనె ఇచ్చి నీ సరుకు కొన్నారు.

18 “ ‘దమస్కు నీ దగ్గర అనేక వస్తువులు విలువైన సరుకు ఉన్న కారణంగా నీతో వ్యాపారం చేసింది. వారు హెల్బోను నుండి ద్రాక్షరసం, జహరు నుండి ఉన్ని,

19 వారు ఇజాలు నుండి ద్రాక్షరసం పీపాలు ఇచ్చి, అచ్చుపోసిన ఇనుము, లవంగపట్ట, వోమ ఇచ్చి మీ సరుకులు కొన్నారు.

20 “ ‘దేదాను వారు నీతో జీను దుప్పట్ల వ్యాపారం చేశారు.

21 “ ‘అరేబియా వారు కేదారు యువరాజులందరూ నీతో వ్యాపారం చేశారు. గొర్రెపిల్లలు పొట్టేళ్లు మేకలు ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.

22 “ ‘షేబ రాయమా వర్తకులు నీతో వ్యాపారం చేశారు. అన్ని రకాల సుగంధద్రవ్యాలు విలువైన రాళ్లు బంగారం ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.

23 “ ‘హారాను వారు కన్నెహు వారు ఏదెను వారు షేబ వర్తకులు అష్షూరు కిల్మదు వర్తకులు నీతో వ్యాపారం చేశారు.

24 వారు వ్యాపారం చేసి అందమైన వస్త్రాలు, నీలం బట్టలు, కుట్టుపని చేసిన బట్టలు, తివాచీలు బాగా పేనిన గట్టి త్రాళ్లు ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.

25 “ ‘తర్షీషు ఓడలు నీ సరుకులు మోసుకెళ్లేవి. నీవు విస్తారమైన సరుకులతో సముద్రం మీద కూర్చున్నావు.

26 నీ తెడ్లు నడిపేవారు మహా సముద్రంలోకి నిన్ను తీసుకెళ్లారు. కాని తూర్పు గాలి వీచి సముద్రం మధ్యలో నిన్ను నాశనం చేస్తుంది.

27 అప్పుడు నీ సంపద, సరుకులు వస్తువులు, నీ నావికులు, ఓడ నాయకులు నీ ఓడలు బాగుచేసేవారు, నీ వ్యాపారులు నీ సైనికులందరూ, నీతో ఉన్న ప్రతి ఒక్కరూ నీ ఓడ ధ్వంసమైన రోజున సముద్రం మధ్యలో మునిగిపోతారు.

28 నీ నావికులు వేసే కేకలకు తీరప్రాంతాలు కంపిస్తాయి.

29 తెడ్డు నడిపే వారందరూ నావికులు, ఓడ నాయకులు తమ ఓడల మీద నుండి దిగివచ్చి తీరాన నిలబడతారు.

30 వారంతా గొంతెత్తి నీ గురించి ఏడుస్తారు; తమ తలలపై బూడిద చల్లుకుని బూడిదలో దొర్లుతారు.

31 నీ గురించి వారు తమ తలలు గొరిగించుకుని గోనెపట్టలు కట్టుకుని తీవ్రమైన దుఃఖంతో నీ గురించి ఏడుస్తారు;

32 వారు నీ గురించి ఏడుస్తూ విలాప గీతం పాడతారు: “సముద్రం మధ్యలో మునిగిపోయిన తూరు పట్టణమా! నీకు సాటియైన పట్టణమేదీ?”

33 సముద్రం మీద నీ వస్తువులు తీసుకెళ్తూ, అనేకమందిని తృప్తిపరిచావు; నీ విస్తారమైన సంపదతో నీ వ్యాపార వస్తువులతో భూరాజులను ఐశ్వర్యవంతులను చేశావు.

34 ఇప్పుడు లోతైన జలాల్లో మునిగి సముద్రంలో నాశనమయ్యావు; నీ వస్తువులు నీ సహచరులు నీతో పాటే మునిగిపోయారు.

35 తీరప్రాంతాలలో ఉన్నవారంతా నీ గురించి దిగులుపడతారు; వారి రాజులు వణకుతారు. వారి ముఖాలు చిన్నబోయాయి.

36 వివిధ ప్రజల మధ్యలో వర్తకులు నిన్ను ఎగతాళి చేస్తారు. నీవు భయంకరమైన ముగింపుకు వచ్చావు, పూర్తిగా నాశనం అవుతావు.’ ”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan