యెహెజ్కేలు 24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంవంట కుండగా యెరూషలేము 1 తొమ్మిదో సంవత్సరం పదవనెల పదవ రోజున యెహోవా వాక్కు నాకు వచ్చి: 2 “మనుష్యకుమారుడా, ఈ తేదీని నమోదు చేయి ఎందుకంటే బబులోను రాజు ఈ రోజే యెరూషలేమును ముట్టడించాడు. 3 తిరుగుబాటు చేసే ఈ ప్రజల గురించి ఉపమానరీతిగా ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఒక కుండ తెచ్చి దానిలో నీళ్లు పోసి, దానిని పొయ్యిమీద పెట్టు. 4 తొడ ముక్కలు, జబ్బ ముక్కల వంటి మంచి ముక్కలు దానిలో వేసి మంచి ఎముకలతో దానిని నింపు; 5 మందలో శ్రేష్ఠమైన వాటిని తీసుకో! దానిలోని ఎముకలు బాగా ఉడికేలా దాని క్రింద కట్టెలతో మంట ఎక్కువగా పెట్టి వాటిని మరిగించి బాగా ఉడకబెట్టు. 6 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘హంతకులున్న పట్టణానికి శ్రమ, మడ్డి ఉన్న కుండకు శ్రమ, దాని తుప్పు పోదు. ఏ వరుసలో వచ్చినా సరే దానిలో నుండి మాంసాన్ని ముక్క తర్వాత ముక్కగా తీయండి. 7 “ ‘అది చిందించిన రక్తం దాని మధ్యనే ఉంది: మట్టితో కప్పివేయడానికి వీలుగా అది రక్తాన్ని నేలమీద క్రుమ్మరించకుండ, వట్టి బండ మీద క్రుమ్మరించింది; 8 ఉగ్రతను రేపి ప్రతీకారం తీసుకోవడానికి దాని రక్తం కప్పివేయబడకుండ వట్టి బండ మీద క్రుమ్మరించాను. 9 “ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘హంతకులున్న పట్టణానికి శ్రమ! నేను మరి ఎక్కువగా కట్టెలు పేర్చుతాను. 10 కట్టెలు పేర్చి అగ్ని రాజేయండి. మసాలాలు కలిపి మాంసం బాగా ఉడకబెట్టండి; ఎముకలు పూర్తిగా ఉడకనివ్వండి; 11 తర్వాత దానికున్న మలినం కరిగిపోయి, మడ్డి పూర్తిగా పోయేలా ఆ కుండ వేడెక్కి దాని రాగి మెరిసే వరకు దానిని బొగ్గుల మీద ఉంచండి. 12 అలసిపోయేంత వరకు ప్రయత్నించినా అగ్నితో కాల్చినా సరే దాని మడ్డి తొలగిపోలేదు. 13 “ ‘నీ అతి కామాతురతయే నీకున్న అపవిత్రత. నిన్ను పవిత్రపరచడానికి నేను ప్రయత్నించాను కాని నీవు శుద్ధి కాలేదు కాబట్టి నా ఉగ్రత నీమీద తీర్చుకునే వరకు నీవు పవిత్రం కావు. 14 “ ‘యెహోవానైన నేను మాట ఇచ్చాను. అది నెరవేర్చే సమయం వచ్చింది. నేను వెనక్కి తీసుకోను; నేను జాలిపడను పశ్చాత్తాపపడను. నీ ప్రవర్తనను బట్టి, నీ పనులను బట్టి నీకు శిక్ష విధించబడుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” యెహెజ్కేలు భార్య మరణం 15 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 16 “మనుష్యకుమారుడా, ఒక్క దెబ్బతో నీ కళ్లల్లో ఆనందాన్ని నీ నుండి తీసివేయబోతున్నాను. విలపించవద్దు ఏడవవద్దు కన్నీరు కార్చవద్దు. 17 చనిపోయినవారి కోసం దుఃఖించకుండ నిశ్శబ్దంగా నిట్టూర్చు. నీ తలపాగాను కట్టుకుని నీ కాళ్లకు చెప్పులు వేసుకో; నీ మీసం గెడ్డం కప్పుకోవద్దు; సంతాపంగా ఇతరులు తెచ్చిన ఆహారం తినవద్దు.” 18 కాబట్టి నేను ఉదయం ప్రజలతో మాట్లాడాను, సాయంత్రం నా భార్య చనిపోయింది. మరుసటిరోజు ఉదయం నాకు ఆజ్ఞాపించినట్లే నేను చేశాను. 19 అప్పుడు ప్రజలు నన్ను ఇలా అడిగారు, “నీవు చేస్తున్న వాటినుండి మేము తెలుసుకోవలసిన వాటిని మాకు చెప్పవా?” 20 అప్పుడు నేను వారితో ఇలా అన్నాను, “యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది: 21 ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: మీకు గర్వకారణంగా, మీ కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేదిగా, మీరు అభిమానించే నా పరిశుద్ధాలయాన్ని నేను అపవిత్రం చేయబోతున్నాను. మీరు వెనుక విడిచిపెట్టిన మీ కుమారులు, కుమార్తెలు కత్తివేటుకు కూలిపోతారు. 22 అప్పుడు నేను చేసినట్లే మీరు కూడా చేస్తారు. మీ మీసం గడ్డం కప్పుకోరు; సంతాపంగా ఇతరులు తెచ్చిన ఆహారం తినరు. 23 మీ తలపాగాలు మీ తలల మీద నుండి తీయరు మీ చెప్పులు మీ కాళ్లకే ఉంటాయి. మీరు దుఃఖించరు ఏడవరు కానీ మీలో మీరే మూల్గుతూ మీ పాపాల కారణంగా క్రుంగిపోతారు. 24 యెహెజ్కేలు నీకు సూచనగా ఉంటాడు. అతడు చేసిందంతా మీరూ చేస్తారు. ఇది జరిగినప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ” 25 “మనుష్యకుమారుడా, నేను వారి ఆశ్రయాన్ని, వారి ఆనందాన్ని కీర్తిని, వారి కళ్లకు ఇష్టమైన దానిని, వారి హృదయ ఆశలను అలాగే వారి కుమారులను కుమార్తెలను తీసివేసే రోజు వస్తుంది. 26 ఆ రోజున నీకు వార్త చెప్పడానికి ఒకడు తప్పించుకుని నీ దగ్గరకు వస్తాడు. 27 అప్పుడు నీవు మౌనంగా ఉండకుండా తప్పించుకుని వచ్చిన వానితో నోరు తెరిచి స్పష్టంగా మాట్లాడతావు. నేనే యెహోవానని వారు తెలుసుకోవడానికి ఇలా నీవు వారికి ఒక సూచనగా ఉంటావు.” |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.