Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహెజ్కేలు 22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


యెరూషలేము పాపాలకు తీర్పు

1 యెహోవా వాక్కు నాకు వచ్చి:

2 “మనుష్యకుమారుడా, నీవు దానికి తీర్పు తీరుస్తావా? రక్తం చిందించిన ఈ పట్టణానికి నీవు తీర్పు తీరుస్తావా? అలా అయితే నీవు దాని అసహ్యమైన ఆచారాలన్నిటిని బట్టి దానిని నిలదీస్తూ

3 ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తన మధ్య రక్తాన్ని చిందిస్తూ, విగ్రహాలను తయారుచేస్తూ తనను తాను అపవిత్రం చేసుకునే నగరమా,

4 నీవు చిందించిన రక్తాన్ని బట్టి నీవు అపరాధివి అయ్యావు, నీవు తయారుచేసిన విగ్రహాల వలన నీవు అపవిత్రం అయ్యావు. నీవే నీ దినాలు దగ్గర పడేలా చేసుకున్నావు, నీ సంవత్సరాలు ముగింపుకు వచ్చాయి. కాబట్టి నేను నిన్ను ఇతర జనాంగాల మధ్య హాస్యాస్పదంగా చేసి, అన్ని దేశాల ఎదుట నవ్వులపాలు చేస్తాను.

5 అపకీర్తి పొందిన పట్టణమా, కలత చెందినదానా, నీకు దగ్గరగా ఉన్నవారు, దూరంగా ఉన్నవారు నిన్ను ఎగతాళి చేస్తారు.

6 “ ‘చూడండి, నీలో ఉన్న ఇశ్రాయేలు నాయకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి హత్యలు చేయాలని నిర్ణయించుకున్నారు.

7 నీలో వారు తండ్రిని తల్లిని అవమానించారు; నీలో వారు పరదేశులను అణచివేశారు, తండ్రిలేనివారిని, విధవరాండ్రను చులకనగా చూశారు.

8 నీవు నా పరిశుద్ధ వస్తువులను తృణీకరించి నా సబ్బాతులను అపవిత్రం చేశావు.

9 అపవాదులు వేసేవారు, రక్తం చిందించేవారు నీలో ఉన్నారు; పర్వత క్షేత్రాల దగ్గర తిని, అసభ్యకరమైన పనులు చేసేవారు నీలో ఉన్నారు.

10 తమ తండ్రి పడకను అవమానపరిచేవారు నీలో ఉన్నారు; బహిష్టు సమయంలో అపవిత్రంగా ఉన్న స్త్రీలను చెరిపినవారు నీలో ఉన్నారు.

11 నీలో ఒకడు తన పొరుగువాని భార్యతో అసహ్యకరమైన నేరం చేస్తాడు, మరొకడు అవమానకరంగా తన కోడలిని అపవిత్రం చేస్తాడు, మరొకడు తన సోదరిని, తన తండ్రి కుమార్తెను చెరుపుతాడు.

12 నీలో రక్తం చిందించడానికి లంచాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు; నీవు వడ్డీ తీసుకుని పేదల నుండి లాభం పొందుతావు. నీవు నీ పొరుగువారి నుండి అన్యాయమైన లాభం పొందుతావు. నీవు నన్ను మరచిపోయావు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

13 “ ‘నీవు సంపాదించిన అన్యాయ లాభాన్ని, నీవు చేసిన హత్యలు చూసి నా చేతులు చరుచుకుంటాను.

14 నేను నిన్ను శిక్షించే రోజును తట్టుకునే ధైర్యం నీకు ఉంటుందా? నీ చేతులు బలంగా ఉంటాయా? యెహోవానైన నేను చెప్పాను, దానిని నేను నెరవేరుస్తాను.

15 ఇతర జనాంగాల్లోకి నిన్ను చెదరగొట్టి, ఇతర దేశాలకు నిన్ను వెళ్లగొడతాను; నీ అపవిత్రతకు ముగింపు తెస్తాను.

16 నీవు జనాంగాల దృష్టిలో అపవిత్రం అయినప్పుడు, నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.’ ”

17 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

18 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి లోహపు మడ్డిలాంటి వారు; వారంతా కొలిమి లోపల మిగిలిపోయిన రాగి, తగరం, ఇనుము, తగరం వంటివారు. వారు వెండి లోహపు మడ్డి వంటివారు.

19 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘మీరంతా లోహపు మడ్డిలా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని యెరూషలేము మధ్యకు పోగుచేస్తాను.

20 వెండి, ఇత్తడి, ఇనుము, తగరాన్ని పోగుచేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది, కరిగించినట్లు నేను నా కోపంతో నా ఉగ్రతతో మిమ్మల్ని పోగుచేసి ఆ పట్టణం లోపల ఉంచి మిమ్మల్ని కరిగిస్తాను.

21 మిమ్మల్ని పోగుచేసి నా కోపాగ్నిని మీమీద ఊదగా మీరు దానిలో కరిగిపోతారు.

22 కొలిమిలో వెండి కరిగినట్లు మీరు దానిలో కరిగిపోతారు. యెహోవానైన నేను నా ఉగ్రతను మీమీద కుమ్మరించానని మీరు తెలుసుకుంటారు.’ ”

23 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

24 “మనుష్యకుమారుడా, యెరూషలేముతో ఇలా చెప్పు, ‘నీవు శుద్ధి చేయబడని దేశంగా ఉన్నావు. ఉగ్రత దినాన నీకు వర్షం కురవదు.’

25 సింహం గర్జిస్తూ వేటను చీల్చేటట్లు దానిలో దాని ప్రవక్తలు కుట్ర చేస్తారు. వారు మనుష్యులను మ్రింగివేస్తారు. ప్రజల సంపదను విలువైన వస్తువులను దోచుకుంటారు. చాలామందిని విధవరాండ్రుగా చేస్తారు.

26 దాని యాజకులు నా ధర్మశాస్త్రాన్ని మీరి నా పరిశుద్ధ వస్తువులను అపవిత్రం చేస్తారు; పరిశుద్ధమైన వాటికి సాధారణమైన వాటికి మధ్య భేదం వారికి తెలియదు. పవిత్రతకు అపవిత్రతకు మధ్య ఉన్న భేదాన్ని ప్రజలకు నేర్పించరు. నా విశ్రాంతి దినాలను నిర్లక్ష్యం చేస్తారు. వారి మధ్య నేను అపవిత్రం అయ్యాను.

27 దానిలో అధికారులు వేటాడినదాన్ని చీల్చే తోడేళ్లలా ఉన్నారు; అక్రమ సంపాదన కోసం వారు రక్తాన్ని చిందించి ప్రజలను చంపుతారు.

28 దాని ప్రవక్తలు తప్పుడు దర్శనాలు అబద్ధపు శకునాలు చూస్తూ యెహోవా ఏమి చెప్పనప్పటికి ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే అని తమ పనులను కప్పిపుచ్చుకుంటారు.

29 దేశ ప్రజలు బలాత్కారాలు చేస్తూ దొంగతనాలు చేస్తారు; పేదవారిని దరిద్రులను హింసిస్తారు, విదేశీయులను అన్యాయంగా బాధిస్తారు.

30 “నేను దేశాన్ని నాశనం చేయకుండా దాని గోడలను బాగుచేయడానికి పగుళ్లలో నా ఎదుట నిలబడడానికి నేను తగిన వాన్ని వెదికాను కాని అలాంటివాడు ఒక్కడు కూడా నాకు కనపడలేదు.

31 కాబట్టి నేను నా ఉగ్రతను వారి మీద క్రుమ్మరించి, నా కోపాగ్నితో వారిని కాల్చివేసి వారు చేసిన వాటన్నిటి ఫలితాన్ని వారి మీదికి రప్పిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan