యెహెజ్కేలు 2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంయెహెజ్కేలుకు ప్రవక్తగా పిలుపు 1 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, లేచి నీ కాళ్లమీద నిలబడు. నీతో నేను మాట్లాడతాను” అన్నారు. 2 ఆయన మాట్లాడుతూ ఉండగా, ఆత్మ నా మీదికి వచ్చి నా పాదాల మీద నన్ను నిలబెట్టినప్పుడు ఆయన నాతో మాట్లాడడం నేను విన్నాను. 3 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నా మీద తిరుగుబాటు చేసిన ప్రజలైన ఇశ్రాయేలీయుల దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను; వారు వారి పూర్వికులు ఈ రోజు వరకు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. 4 మొండివారును కఠిన హృదయులునైన ప్రజల దగ్గరకు నేను నిన్ను పంపుతున్నాను. ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదేనని వారితో చెప్పు.’ 5 వారిది తిరుగుబాటు స్వభావం కాబట్టి వారు విన్నా వినకపోయినా తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకునేలా వారికి చెప్పు. 6 మనుష్యకుమారుడా, వారికి, వారి మాటలకు భయపడకు. నీ చుట్టూ ముండ్లపొదలు ముళ్ళు ఉన్నా, తేళ్ల మధ్య నివసిస్తున్నా నీవు భయపడకు. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి వారు అన్న వాటికి వారి చూపులకు నీవేమి భయపడకు. 7 వారిది తిరుగుబాటు స్వభావం కాబట్టి వారు విన్నా వినకపోయినా నేను చెప్పిన మాట వారికి తెలియజేయి. 8 మనుష్యకుమారుడా, వారు తిరుగుబాటు చేసినట్లే నీవు చేయకు. నా మాట విను. నోరు తెరిచి నేను ఇచ్చేది తిను.” 9 నేను చూస్తుండగా గ్రంథపుచుట్టను పట్టుకుని ఒక చేయి నాకు దగ్గరగా రావడం కనపడింది, 10 ఆయన దానిని నా ముందు తెరిచారు. దానికి రెండు వైపులా విలాపం, దుఃఖం శ్రమ అనే మాటలు వ్రాసి ఉన్నాయి. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.