Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహెజ్కేలు 17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


రెండు గ్రద్దలు, ఒక ద్రాక్షవల్లి

1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

2 “మనుష్యకుమారుడా, నీవు ఒక పొడుపు కథ వేసి, దానిని ఇశ్రాయేలీయులకు ఒక ఉపమానంలా చెప్పాలి.

3 వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: బలమైన రెక్కలు, పొడవైన ఈకలు కలిగి రకరకాల రంగులతో ఉన్న ఒక పెద్ద గ్రద్ద లెబానోను పర్వతానికి వచ్చి, దేవదారు చెట్టు కొమ్మపై వాలి,

4 దాని అంచున ఉన్న లేత కొమ్మల చిగురు తెంపి వర్తకుల దేశానికి తీసుకెళ్లి వ్యాపారుల పట్టణంలో దానిని నాటింది.

5 “ ‘అది ఆ దేశపు విత్తనాలను తీసుకెళ్లి సారవంతమైన నేలలో నాటింది. విస్తారమైన నీటి ప్రక్కన పెరిగే నిరవంజి చెట్లలా ఆ మొక్కను నాటింది,

6 అది చిగురు వేసి పైకి పెరగకుండ నేలమీద విస్తరించి పెద్ద ద్రాక్షావల్లి అయింది. దాని కొమ్మలు గ్రద్ద వరకు వెళ్లాయి, కాని దాని వేర్లు గ్రద్ద క్రింద ఉన్నాయి. అలా అది ద్రాక్షవల్లిలా మారి అనేక కొమ్మలతో రెమ్మలు వేసింది.

7 “ ‘అయితే బలమైన రెక్కలు దట్టమైన ఈకలతో మరొక పెద్ద గ్రద్ద ఉంది. ఆ ద్రాక్షావల్లి అది నాటబడిన చోటు నుండి ఆ గ్రద్ద వైపు తన వేర్లు విస్తరింపజేసుకుని, దాని కొమ్మలను నీటి కోసం దానివైపు విస్తరింపచేసుకుంది.

8 ఆ ద్రాక్షావల్లికి తీగెలు వచ్చి, పండ్లు ఇచ్చేలా, అద్భుతమైన ద్రాక్షవల్లిలా అయ్యేలా, అది మంచి నేలలో విస్తారమైన నీటి ప్రక్కన నాటబడింది.’

9 “కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అలాంటి ద్రాక్షావల్లి వృద్ధి చెందుతుందా? అది ఎండిపోయేలా ప్రజలు దాని వేరు పెకిలించి, దాని పండ్లు కోయరా? దాని చిగురులన్నీ ఎండిపోతాయి. దానిని వేర్లతో సహా పెకిలించడానికి బలమైన చేయి గాని, చాలామంది వ్యక్తులు గాని అవసరం లేదు.

10 అది ఒకచోట నుండి మరొక చోట నాటబడింది, అది వృద్ధి చెందుతుందా? తూర్పు గాలి దాని మీద వీచినపుడు అది నాటబడిన చోటనే ఎండిపోదా?’ ”

11 మరోసారి యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

12 “తిరుగుబాటు చేసే ఈ ప్రజలతో ఇలా చెప్పు, ‘ఈ మాటల అర్థం మీకు తెలియదా?’ ఇదిగో, ‘బబులోను రాజు యెరూషలేముకు వెళ్లి దాని రాజును, అధిపతులను పట్టుకుని తనతో పాటు బబులోనుకు తీసుకువచ్చాడు.

13-14 తర్వాత అతడు రాజ కుటుంబీకుల్లో ఒకన్ని ఎంచుకుని, అతనితో ప్రమాణం చేయించి, అతనితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేకాక ఆ రాజ్యం బలహీనపడి, మరలా అది బలపడకుండా తన ఒప్పందాన్ని పాటించడం ద్వారా మాత్రమే మనుగడ సాగించేలా, దేశంలోని నాయకులను తీసుకెళ్లిపోయాడు.

15 అయితే రాజకుటుంబం నుండి ఎంచుకోబడిన వ్యక్తి, తనకు గుర్రాలను పెద్ద సైన్యాన్ని పంపి సహాయం చేయమని అడగడానికి ఈజిప్టు దేశానికి రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు. అతడు విజయం సాధిస్తాడా? అటువంటి పనులు చేసినవాడు తప్పించుకుంటాడా? అతడు ఒప్పందాన్ని ఉల్లంఘించి తప్పించుకుంటాడా?

16 “ ‘ఏ రాజైతే అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడో, ఎవరి ప్రమాణాన్ని అతడు తృణీకరించాడో, ఎవరి ఒప్పందాన్ని అతడు ఉల్లంఘించాడో ఆ రాజు దేశమైన బబులోనులోనే, నా జీవం తోడు అతడు చనిపోతాడు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

17 యుద్ధం జరిగేటప్పుడు అనేకుల జీవితాలను నాశనం చేయాలని బబులోనీయులు ముట్టడి దిబ్బలు వేసి కోటలు కట్టినప్పుడు ఫరో తనకున్న మహా బలమైన గొప్ప సైన్యంతో వచ్చినా ఆ రాజుకు ఏమాత్రం సహాయం చేయలేడు.

18 నిబంధనను భంగం చేసి తన ప్రమాణాన్ని నిర్లక్ష్యం చేశాడు. ప్రమాణం చేసి కూడా అలాంటి పనులు చేశాడు కాబట్టి అతడు ఏమాత్రం తప్పించుకోలేడు.

19 “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: అతడు నేను పెట్టుకున్న ఒట్టును తృణీకరించి నా నిబంధనను భంగం చేసినందుకు నా జీవం తోడు నేను అతనికి ప్రతిఫలమిస్తాను.

20 నేను అతనికి వలవేసి నా ఉచ్చులో బిగించి బబులోనుకు తీసుకెళ్లి అతడు నా పట్ల నమ్మకద్రోహిగా ఉన్నాడు కాబట్టి అక్కడ అతనికి శిక్ష విధిస్తాను.

21 అతని సైన్యంలో ఎంపిక చేయబడిన వారందరు కత్తివేటుకు చనిపోతారు, తప్పించుకున్నవారు గాలికి చెదిరిపోతారు. అప్పుడు యెహోవానైన నేనే ఈ మాట చెప్తున్నానని మీరు తెలుసుకుంటారు.

22 “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఎత్తైన దేవదారు చెట్టులో చిటారు కొమ్మ ఒకటి తీసి దానిని నాటుతాను; దాని పైనున్న కొమ్మల్లో ఒక లేత కొమ్మను త్రుంచి అత్యున్నత పర్వతం మీద నాటుతాను.

23 ఇశ్రాయేలు దేశంలో ఎత్తైన పర్వతం మీద నేనే దానిని నాటుతాను. అది కొమ్మలు వేసి ఫలించి ఘనమైన దేవదారు చెట్టు అవుతుంది. అన్ని రకాల పక్షులు దానిపై గూళ్ళు కట్టుకుంటాయి; దాని కొమ్మల నీడలో అవి ఆశ్రయాన్ని పొందుతాయి.

24 యెహోవానైన నేనే పొడవైన చెట్లను చిన్నవిగా, నీచమైన చెట్లను గొప్ప చెట్లుగా మార్చగలనని, పచ్చని చెట్టుని ఎండిపోయేలా, ఎండిన చెట్టుని పచ్చని చెట్టులా చేస్తానని అడవిలో ఉన్న అన్ని చెట్లు తెలుసుకుంటాయి. “ ‘యెహోవానైన నేనే ఈ మాట అంటున్నాను. నేనే దానిని నెరవేరుస్తాను.’ ”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan