Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నిర్గమ 8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు ఫరో దగ్గరకు వెళ్లి అతనితో, ‘యెహోవా చెప్పిన మాట ఇదే: నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.

2 నీవు వారిని వెళ్లనివ్వకపోతే నేను నీ దేశమంతట కప్పలు పంపించి బాధిస్తాను.

3 నైలు నది కప్పలతో నిండిపోతుంది. అవి నీ రాజభవనం లోనికి నీ పడకగదిలోనికి, నీ పడక మీదికి, నీ అధికారుల ఇళ్ళలోనికి, నీ ప్రజలమీదికి, మీ పొయ్యిల్లోనికి, పిండి పిసికే తొట్టెల్లోనికి వస్తాయి.

4 ఆ కప్పలు నీ మీదికి నీ ప్రజలమీదికి నీ అధికారుల మీదికి వస్తాయి అని చెప్పు’ అని అన్నారు.”

5 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు అహరోనుతో, ‘ప్రవాహాలు, కాలువలు, చెరువులపై నీ కర్రతో నీ చేయిని చాచి, ఈజిప్టు భూమిపై కప్పలు పైకి వచ్చేలా చేయి’ అని చెప్పు.”

6 అహరోను ఈజిప్టు జలాల మీద తన చేతిని చాపినప్పుడు కప్పలు వచ్చి ఆ దేశాన్ని కప్పివేశాయి.

7 అయితే మంత్రగాళ్ళు కూడా తమ మంత్రవిద్యతో అవే చేసి ఈజిప్టు దేశం మీదికి కప్పలు వచ్చేలా చేశారు.

8 ఫరో మోషే అహరోనులను పిలిపించి, “నా నుండి నా ప్రజల నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాకు ప్రార్థించండి, అప్పుడు యెహోవాకు బలి అర్పించడానికి నీ ప్రజలను వెళ్లనిస్తాను” అని అన్నాడు.

9 అందుకు మోషే ఫరోతో, “నైలు నదిలో మిగిలి ఉన్న కప్పలు తప్ప, మిమ్మల్ని, మీ ఇళ్ళను కప్పలు వదిలి వెళ్లేలా, మీ కోసం మీ ప్రజల కోసం, మీ అధికారుల కోసం ప్రార్థించడానికి సమయం నిర్ణయించే గౌరవాన్ని నేను మీకే ఇస్తున్నాను” అన్నాడు.

10 అందుకు ఫరో, “రేపే” అన్నాడు. అందుకు మోషే అన్నాడు, “మా దేవుడైన యెహోవా వంటి వారెవరు లేరని నీవు తెలుసుకునేలా నీవన్నట్టే జరుగుతుంది.

11 కప్పలు మిమ్మల్ని, మీ ఇళ్ళను, మీ అధికారులను, మీ ప్రజలను వదిలివేస్తాయి; అవి నైలు నదిలో మాత్రమే ఉంటాయి.”

12 మోషే అహరోనులు ఫరో దగ్గరనుండి వెళ్లిన తర్వాత, యెహోవా ఫరో మీదికి రప్పించిన కప్పల గురించి మోషే ఆయనకు మొరపెట్టాడు.

13 మోషే అడిగినట్టే యెహోవా చేశారు. ఇళ్ళలో ఆవరణాల్లో పొలాల్లో ఉన్న కప్పలు చనిపోయాయి.

14 ఈజిప్టు ప్రజలు వాటిని కుప్పలుగా వేసినప్పుడు నేల కంపుకొట్టింది.

15 కప్పల నుండి ఉపశమనం కలిగిందని చూసిన ఫరో యెహోవా చెప్పిన ప్రకారమే తన హృదయాన్ని కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు.


మూడవ తెగులు: చిన్న దోమలు

16 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు అహరోనుతో, ‘నీ కర్రను చాపి నేలమీది ధూళిని కొట్టు’ అని చెప్పు, అప్పుడు ఈజిప్టు దేశమంతటా ఆ ధూళి చిన్న దోమలుగా మారుతుంది” అని అన్నారు.

17 వారు అలాగే చేశారు, అహరోను కర్ర పట్టుకుని తన చేతిని చాచి నేలమీది ధూళిని కొట్టినప్పుడు మనుష్యుల మీదికి జంతువుల మీదికి చిన్న దోమలు వచ్చాయి. ఈజిప్టు దేశంలోని ధూళి అంతా చిన్న దోమలుగా మారింది.

18 అయితే మంత్రగాళ్ళు తమ మంత్రవిద్యతో చిన్న దోమలను పుట్టించడానికి ప్రయత్నించారు, కాని వారు చేయలేకపోయారు. చిన్న దోమలు మనుష్యుల మీద జంతువుల మీద వాలాయి,

19 మంత్రగాళ్ళు ఫరోతో, “ఇది దేవుని వ్రేలు చేసిన పనే” అని చెప్పారు. అయినా యెహోవా చెప్పిన ప్రకారమే ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని వారి మాట వినలేదు.


నాలుగవ తెగులు: ఈగలు

20 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు ప్రొద్దుటే లేచి ఫరో నదికి వెళ్తున్నప్పుడు అతనికి ఎదురై అతనితో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పిన మాట ఇదే: నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.

21 నీవు నా ప్రజలను వెళ్లనివ్వకపోతే నేను నీ మీదికి నీ అధికారుల మీదికి నీ ప్రజలమీదికి నీ ఇళ్ళలోనికి ఈగల గుంపులను పంపిస్తాను, అప్పుడు ఈజిప్టువారి ఇల్లు ఈగలతో నిండిపోతాయి; చివరికి నేల కూడా వాటితో నిండిపోతుంది.

22 “ ‘అయితే ఆ దినాన నా ప్రజలు నివసించే గోషేను దేశంలో మాత్రం ఏ ఈగల గుంపు ఉండదు; అప్పుడు యెహోవానైన నేను ఈ దేశంలో ఉన్నానని నీవు తెలుసుకుంటావు;

23 నీ ప్రజలకు నా ప్రజలకు మధ్య భేదాన్ని చూపిస్తాను. ఈ సూచన రేపే కనబడుతుంది.’ ”

24 ఇది యెహోవా చేశారు. బాధించే ఈగల గుంపులు ఫరో రాజభవనం లోనికి అతని సేవకుల ఇళ్ళలోనికి వచ్చి పడ్డాయి; ఈగల గుంపుల వలన ఈజిప్టు దేశమంతటా నేల నాశనమైంది.

25 అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, “మీరు వెళ్లి ఈ దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోండి” అన్నాడు.

26 అందుకు మోషే, “అది సరికాదు. మా దేవుడైన యెహోవాకు మేము బలి అర్పించడం ఈజిప్టువారికి అసహ్యం కలిగించవచ్చు. వారి కళ్ళకు అసహ్యమైన బలిని మేము అర్పించినప్పుడు వారు మమ్మల్ని రాళ్లతో కొట్టరా?

27 మేము అరణ్యంలో మూడు రోజులు ప్రయాణం చేసి మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన ప్రకారం మేము అక్కడే బలి అర్పించాలి” అన్నాడు.

28 అందుకు ఫరో, “మీ దేవుడైన యెహోవాకు అరణ్యంలో బలులు అర్పించడానికి నేను మిమ్మల్ని పంపిస్తాను కాని మీరు ఎక్కువ దూరం వెళ్లకూడదు. ఇప్పుడు నా కోసం ప్రార్థించండి” అన్నాడు.

29 అందుకు మోషే, “నేను నీ దగ్గర నుండి వెళ్లిన వెంటనే యెహోవాకు మొరపెడతాను, రేపు ఫరో దగ్గర నుండి అతని అధికారుల దగ్గర నుండి అతని ప్రజల దగ్గర నుండి ఈగల గుంపులు వెళ్లిపోతాయి. అయితే యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలను వెళ్లనివ్వకుండ ఫరో మరలా మోసపూరితంగా ప్రవర్తించకుండ చూసుకోవాలి” అని చెప్పాడు.

30 మోషే ఫరో దగ్గరనుండి వెళ్లి యెహోవాకు మొరపెట్టాడు.

31 మోషే అడిగినట్టే యెహోవా చేశారు. ఈగలు ఫరోను అతని సేవకులను అతని ప్రజలను విడిచిపోయాయి. ఒక్క ఈగ కూడా మిగల్లేదు.

32 అయితే ఫరో మరలా తన హృదయం కఠినం చేసుకుని ప్రజలను వెళ్లనివ్వలేదు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan