Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నిర్గమ 6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 అప్పుడు యెహోవా మోషేతో, “ఇప్పుడు నేను ఫరోకు ఏం చేయబోతున్నానో నీవు చూస్తావు: నా బలమైన హస్తాన్ని బట్టి అతడు వారిని వెళ్లనిస్తాడు; నా బలమైన హస్తాన్ని బట్టి అతడు వారిని తన దేశం నుండి తరిమివేస్తాడు” అన్నారు.

2 దేవుడు మోషేతో అన్నారు, “నేను యెహోవాను.

3 నేను సర్వశక్తిగల దేవునిగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను, కాని యెహోవా అనే నా పేరుతో నన్ను నేను వారికి తెలియపరచుకోలేదు.

4 వారు విదేశీయులుగా ఉండిన కనాను దేశాన్ని వారికి ఇస్తాననే నా నిబంధనతో నేను వారిని స్థిరపరిచాను.

5 అంతేకాక, ఈజిప్టు వారిచేత బానిసలుగా చేయబడిన ఇశ్రాయేలీయుల మూలుగును నేను విన్నాను, నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను.

6 “కాబట్టి, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను యెహోవాను, ఈజిప్టువారి వెట్టిచాకిరి నుండి నేను మిమ్మల్ని బయటకు తీసుకువస్తాను. మీరు వారికి బానిసలుగా ఉండకుండ నేను మిమ్మల్ని స్వతంత్రులను చేస్తాను, చాపబడిన బాహువుతో, గొప్ప తీర్పు చర్యలతో నేను మిమ్మల్ని విమోచిస్తాను.

7 నేను మిమ్మల్ని నా సొంత ప్రజలుగా చేసుకుని, మీకు దేవుడనై ఉంటాను. అప్పుడు ఈజిప్టువారి కాడి క్రిందనుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.

8 నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు చేయెత్తి ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. దానిని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. నేను యెహోవాను.’ ”

9 మోషే ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్ని తెలియజేశాడు, కాని వారి కఠినమైన శ్రమను బట్టి, నిరుత్సాహాన్ని బట్టి వారు అతని మాట వినలేదు.

10 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు,

11 “వెళ్లు, ఇశ్రాయేలీయులను తన దేశం నుండి బయటకు వెళ్లనివ్వమని ఈజిప్టు రాజైన ఫరోకు చెప్పు.”

12 అయితే మోషే యెహోవాతో, “ఇశ్రాయేలీయులే నా మాట వినకపోతే స్పష్టంగా మాట్లాడలేని నా మాట ఫరో ఎందుకు వింటాడు?” అని అన్నాడు.


మోషే అహరోనుల కుటుంబ వివరాలు

13 అప్పుడు యెహోవా మోషే అహరోనులతో ఇశ్రాయేలీయులను గురించి ఈజిప్టు రాజైన ఫరోను గురించి మాట్లాడి, ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురమ్మని వారిని ఆదేశించారు.

14 వారి కుటుంబాలకు మూలపురుషులు వీరే: ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ; ఇవి రూబేను వంశాలు.

15 షిమ్యోను కుమారులు: యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి పుట్టిన షావూలు; ఇవి షిమ్యోను వంశాలు.

16 కుటుంబ వివరాల ప్రకారం లేవీ కుమారుల పేర్లు: గెర్షోను, కహాతు, మెరారి. (లేవీ 137 సంవత్సరాలు బ్రతికాడు.)

17 వంశాల ప్రకారం గెర్షోను కుమారులు: లిబ్నీ, షిమీ.

18 కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. (కహాతు 133 సంవత్సరాలు బ్రతికాడు.)

19 మెరారి కుమారులు: మహలి, మూషి. వారి కుటుంబ వివరాల ప్రకారం ఇవి లేవీ వంశాలు.

20 అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెళ్ళి చేసుకున్నాడు. వారికి అహరోను మోషేలు పుట్టారు. (అమ్రాము 137 సంవత్సరాలు బ్రతికాడు.)

21 ఇస్హారు కుమారులు: కోరహు, నెఫెగు, జిఖ్రీ.

22 ఉజ్జీయేలు కుమారులు: మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ.

23 అహరోను అమ్మీనాదాబు కుమార్తె నయస్సోను సహోదరియైన ఎలీషేబను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె అతనికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులను కన్నది.

24 కోరహు కుమారులు: అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు. ఇవి కోరహు వంశాలు.

25 అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకున్నాడు, ఆమె అతనికి ఫీనెహాసును కన్నది. వీరు వంశాల ప్రకారం, లేవీ కుటుంబాల పెద్దలు.

26 “ఇశ్రాయేలీయులను వారి విభజనల ప్రకారం ఈజిప్టులో నుండి బయటకు తీసుకురండి” అని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరే.

27 ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురావడం గురించి ఈజిప్టు రాజైన ఫరోతో మాట్లాడిన అహరోను మోషేలు వీరే.


మోషే కోసం అహరోను మాట్లాడుట

28 ఇక ఈజిప్టు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడినప్పుడు,

29 ఆయన మోషేతో, “నేను యెహోవానై ఉన్నాను. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని ఈజిప్టు రాజైన ఫరోతో చెప్పు” అన్నారు.

30 కాని మోషే యెహోవాతో, “తడబడే పెదవులతో మాట్లాడే నా మాటను ఫరో ఎందుకు వింటాడు?” అని అన్నాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan