నిర్గమ 39 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంయాజక వస్త్రాలు 1 పరిశుద్ధాలయంలో సేవ చేయడానికి నీలం ఊదా ఎరుపు రంగుల నూలు ఉపయోగించి వారు నేసిన వస్త్రాలను తయారుచేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం అహరోనుకు పవిత్ర వస్త్రాలను కూడా తయారుచేశారు. ఏఫోదు 2 బంగారంతో నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో ఏఫోదును తయారుచేశారు. 3 నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో నైపుణ్యమైన పనిగా నేయడానికి బంగారాన్ని రేకులుగా సాగగొట్టి దానిని తీగెలుగా కత్తిరించారు. 4 ఏఫోదుకు భుజాల ముక్కలు తయారుచేసి అది కదలకుండా ఉండేలా దాని రెండు మూలల్లో కూర్చారు. 5 నైపుణ్యంగా అల్లబడిన దాని నడికట్టు ఏఫోదుతో ఒకే ముక్కగా, బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో చేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవన్నీ చేశారు. 6 వారు లేతపచ్చ రాళ్లు తీసుకుని చెక్కేవారు ముద్రను చెక్కినట్లు వాటిపై ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కి బంగారు జరీ చట్రంలోకి ఎక్కించి, 7 తర్వాత వాటిని ఇశ్రాయేలు కుమారుల జ్ఞాపకార్థ రాళ్లుగా ఏఫోదు భుజాలపై బిగించారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవన్నీ చేశారు. రొమ్ము కవచం 8 నైపుణ్యం ఉట్టిపడేలా ఏఫోదును చేసినట్లు బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో పతకాన్ని తయారుచేశారు. 9 అది చతురస్రంగా జానెడు పొడవు జానెడు వెడల్పుతో రెండుగా మడత పెట్టబడి ఉంది. 10 దానిపై నాలుగు వరుసల ప్రశస్తమైన రాళ్లు పొదిగారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం; 11 రెండవ వరుసలో పద్మరాగం, నీలమణి, పచ్చ; 12 మూడవ వరుసలో గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం; 13 నాలుగవ వరుసలో పుష్యరాగం, లేతపచ్చ రాళ్లు, సూర్యకాంతమణి ఉన్నాయి. వాటిని బంగారు చట్రంలో అమర్చారు. 14 ఇశ్రాయేలు కుమారుల పేర్లకు ఒక్కొక్కటి చొప్పున పన్నెండు రాళ్లు ఉన్నాయి, ప్రతిదీ వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ముద్రలా చెక్కబడ్డాయి. 15 వారు రొమ్ము పతకానికి స్వచ్ఛమైన బంగారంతో ఒక తాడులా అల్లికపనితో గొలుసులు చేశారు. 16 రెండు బంగారు జరీ పలకలు రెండు బంగారు ఉంగరాలను చేసి, వాటిని పతకానికి రెండు చివర్లకు తగిలించారు. 17 వారు రొమ్ము పతకం చివరిలో ఉన్న ఉంగరాలకు రెండు బంగారు గొలుసులు బిగించి, 18 గొలుసుల యొక్క ఇతర చివరలను రెండు జవలకు, ముందు భాగంలో ఉన్న ఏఫోదు యొక్క భుజాలకు జోడించారు. 19 వారు రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి, వాటిని ఏఫోదు ముందు భాగంలో రొమ్ము పతకానికి లోపలి అంచున ఉన్న రెండు చివర్లకు జోడించారు. 20 వారు మరో రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి వాటిని ఏఫోదు నడికట్టుకు కొంచెం పైన దాని అతుకు దగ్గరగా ఏఫోదు ముందు భాగంలో రెండు భుజభాగాలకు క్రింది వైపున జోడించారు. 21 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు, రొమ్ము పతకం ఏఫోదు నుండి బయటకు వ్రేలాడకుండా నడికట్టును అంటిపెట్టుకుని ఉండేలా రొమ్ము పతకం యొక్క ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు నీలిరంగు దారంతో కట్టారు. ఇతర యాజక వస్త్రాలు 22 వారు ఏఫోదు నిలువుటంగీని ఒక నేత పనిలా పూర్తిగా నీలి బట్టతో తయారుచేసి, 23 దాని మధ్యలో తల దూర్చడానికి రంధ్రం చేసి అది చిరిగిపోకుండా మెడపట్టీలా దాని అంచుల చుట్టూ అల్లికపని చేశారు. 24 వారు ఆ వస్త్రం అంచు చుట్టూ నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో పాటు, పేనిన సన్నని నారతో దానిమ్మపండ్లు తయారుచేశారు. 25 స్వచ్ఛమైన బంగారంతో తయారుచేసిన గంటలను వస్త్రం అంచు చుట్టూ ఉన్న దానిమ్మపండ్ల మధ్య తగిలించారు. 26 సేవ చేస్తున్నప్పుడు వేసుకోడానికి బంగారు గంటలు దానిమ్మపండ్లు ఒకదాని ప్రక్కన ఒకటిగా వస్త్రం అంచు చుట్టూ ఉంచారు; యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు. 27 వారు అహరోనుకు అతని కుమారులకు సన్నని నారబట్టతో చొక్కా నేసారు. 28 సన్నని నారతో తలపాగా, నార టోపీలు, పేనిన సన్నని నారతో లోదుస్తులు చేశారు. 29 పేనిన సన్నని నారతో నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో బుటా పనిగా నడికట్టు తయారుచేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు. 30 వారు పవిత్ర చిహ్నంగా స్వచ్ఛమైన బంగారంతో ఒక కిరీటం తయారుచేసి, దాని మీద ముద్రలా ఈ మాటలు చెక్కారు: పరిశుద్ధత యెహోవాకే. 31 దాన్ని తలపాగాకు అతకడానికి దానిని నీలి దారంతో కట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు. సమావేశ గుడారాన్ని పరిశీలిస్తున్న మోషే 32 సమావేశ గుడారపు పనంతా పూర్తి అయింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు చేశారు. 33 అప్పుడు వారు సమావేశ గుడారం మోషే దగ్గరకు తెచ్చారు: గుడారం దాని అలంకరణలు, దాని కొలుకులు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు; 34 ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మాల పైకప్పు, మన్నికైన తోళ్ల పైకప్పు, కప్పివుంచే తెర; 35 నిబంధన మందసం దాని మోతకర్రలు, ప్రాయశ్చిత్త మూత; 36 బల్ల, దాని ఉపకరణాలన్నీ, సన్నిధి రొట్టెలు; 37 మేలిమి బంగారు దీపస్తంభం, దాని దీపాల వరుస, దాని ఉపకరణాలన్నీ, వెలిగించడానికి ఒలీవనూనె; 38 బంగారు బలిపీఠం, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం, గుడారపు ద్వారానికి తెర; 39 ఇత్తడి బలిపీఠం, దాని ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు దాని పాత్రలన్నీ; ఇత్తడి గంగాళం, దాని పీట; 40 ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, దిమ్మలు, ఆవరణ ద్వారానికి తెర; ఆవరణానికి మేకులు, వాటి త్రాళ్లు; సమావేశ గుడారంలో సేవకు ఉపయోగించే అన్ని ఉపకరణాలు; 41 పరిశుద్ధాలయంలో పరిచర్య చేయడానికి ధరించే నేసిన వస్త్రాలు; యాజకుడైన అహరోనుకు పవిత్ర వస్త్రాలు, యాజకులుగా సేవ చేస్తున్నప్పుడు అతని కుమారులకు వస్త్రాలు. 42 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు ఆ పని అంతా పూర్తి చేశారు. 43 మోషే వారు చేసిన పనిని పరిశీలించి, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు దానిని చేశారని చూశాడు. కాబట్టి మోషే వారిని దీవించాడు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.