నిర్గమ 38 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథందహనబలి బలిపీఠము 1 వారు తుమ్మకర్రతో మూడు మూరల ఎత్తుగల బలిపీఠం దహనబలి కోసం కట్టారు; అది అయిదు మూరల పొడవు అయిదు మూరల వెడల్పుతో చతురస్రంగా ఉంది. 2 వారు కొమ్ములు, బలిపీఠం ఒకే భాగంలా ఉండేలా దాని నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక కొమ్మును చేశారు. వారు బలిపీఠాన్ని ఇత్తడితో పొదిగించారు. 3 దాని పాత్రలన్నిటిని అంటే బూడిద తొలగించడానికి కుండలు, పారలు, చల్లే గిన్నెలు, ముళ్ళ గరిటెలు, నిప్పు పెనాలను ఇత్తడితో తయారుచేశారు. 4 దానికి వలలాంటి ఇత్తడి జాలి తయారుచేసి, ఆ జాలి బలిపీఠం మధ్యకు చేరేలా బలిపీఠం గట్టు క్రింది భాగంలో దానిని ఉంచారు. 5 ఆ జాలి నాలుగు మూలల్లో మోతకర్రలు ఉంచేందుకు ఆ జాలి నాలుగు మూలలకు నాలుగు ఇత్తడి ఉంగరాలు తయారుచేశారు. 6 వారు తుమ్మకర్రతో మోతకర్రలు తయారుచేసి, వాటిని ఇత్తడితో పొదిగించారు. 7 బలిపీఠాన్ని మోయడానికి దాన్ని మోయడానికి ఉపయోగించే మోతకర్రలు దాని రెండు ప్రక్కలా ఉన్న ఉంగరాల్లో దూర్చారు; వారు పలకలను ఉపయోగించి బలిపీఠాన్ని గుల్లగా చేశారు. కడుక్కోడానికి గంగాళం 8 వారు సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర సేవించడానికి వచ్చిన స్త్రీల అద్దాలతో ఒక ఇత్తడి గంగాళం దానికి ఇత్తడి పీట చేశారు. ఆవరణం 9 తర్వాత వారు ఆవరణం నిర్మించారు. దక్షిణం వైపు వంద మూరల పొడవు గల పేనిన సన్నని నార తెరలు ఉన్నాయి. 10 దానికి ఇరవై స్తంభాలు వాటికి ఇరవై ఇత్తడి దిమ్మలు, అలాగే ఆ స్తంభాలకు వెండి కొక్కేలు, బద్దలు ఉన్నాయి. 11 ఉత్తరం వైపు కూడా వంద మూరల పొడవు ఉంది, ఇరవై స్తంభాలు, ఇరవై ఇత్తడి దిమ్మలు, స్తంభాల మీద వెండి కొక్కేలు, దిమ్మలు ఉన్నాయి. 12 పడమర చివర యాభై మూరల వెడల్పు ఉండి, పది స్తంభాలు, పది దిమ్మలతో తెరలు ఉన్నాయి. ఆ స్తంభాలకు వెండి కొక్కేలు, బద్దలు ఉన్నాయి. 13 తూర్పు వైపు, అనగా సూర్యోదయం వైపు కూడా, యాభై మూరల వెడల్పు ఉంది. 14 ప్రవేశ ద్వారానికి ఒక ప్రక్క పదిహేను మూరల పొడవు గల తెరలు, వాటికి మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి. 15 ఆవరణం యొక్క ద్వారానికి అటు ప్రక్కన మూడు స్తంభాలు, మూడు దిమ్మలతో పదిహేను మూరల పొడవు గల తెరలు ఉన్నాయి. 16 ఆవరణం చుట్టూ ఉన్న తెరలన్నీ పేనిన సన్నని నారతో చేసినవి. 17 ఆ స్తంభాల దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల మీదున్న బద్దలు, కొక్కేలు వెండివి. వాటి పైభాగాలు వెండితో పొదిగించబడ్డాయి; అలా ఆవరణం యొక్క స్తంభాలన్నిటికి వెండి బద్దలు ఉన్నాయి. 18 ఆవరణం యొక్క ద్వారానికి నీలం ఊదా ఎరుపు రంగుల పేనిన సన్నని నారతో బుటా పనితో తెర తయారుచేయబడింది. అది ఇరవై మూరల పొడవు గల తెర, ఆవరణం యొక్క తెరల్లా అయిదు మూరల ఎత్తు ఉంది. 19 దానికి నాలుగు స్తంభాలు వాటిని నాలుగు దిమ్మలు ఇత్తడివి. దాని బద్దలు కొక్కేలు వెండివి. వాటి పైభాగం వెండితో పొదిగించబడ్డాయి. 20 సమావేశ గుడారం, దాని చుట్టూ ఉన్న ఆవరణం యొక్క గుడారపు మేకులన్నీ ఇత్తడివి. ఉపయోగించబడిన వస్తువులు 21 సమావేశ గుడారం అనగా సాక్షి గుడారానికి ఉపయోగించిన వస్తువుల వివరాలు ఇవే, యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు పర్యవేక్షణలో మోషే ఆజ్ఞ ప్రకారం లేవీయులు నమోదు చేశారు: 22 యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడు హూరు మనుమడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాడు; 23 దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన ఒహోలీయాబు అతనికి సహాయకుడు. ఇతడు చెక్కేవాడు, కళాకారుడు, నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నారతో బుటా పని చేయగలడు. 24 ప్రత్యేక అర్పణల నుండి పరిశుద్ధాలయం యొక్క పనులన్నిటికి ఉపయోగించిన మొత్తం బంగారం పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం 29 తలాంతుల 730 షెకెళ్ళు. 25 జనాభా లెక్కలలో నమోదైన వారు ఇచ్చిన వెండి పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం 100 తలాంతుల 1,775 షెకెళ్ళు. 26 ఇరవై సంవత్సరాలు, ఆపై వయస్సు కలిగి నమోదు చేసుకున్న వారు అనగా 6,03,550 మంది పురుషులు తలా ఒక బెకా అంటే, అర షెకెల్, పరిశుద్ధాలయ షెకెల్ చొప్పున చెల్లించారు. 27 100 తలాంతుల వెండిని పరిశుద్ధాలయ దిమ్మలకు ఉపయోగించారు. అవి తెరలకు దిమ్మలు; ఒక దిమ్మకు ఒక తలాంతు చొప్పున 100 దిమ్మలకు 100 తలాంతులు. 28 స్తంభాలకు కొక్కేలను, స్తంభం పై భాగంలో పోతపోయడానికి, వాటికి బద్దెలు చేయడానికి 1,775 షెకెళ్ళు ఉపయోగించారు. 29 ప్రత్యేక అర్పణల నుండి లభించిన ఇత్తడి 70 తలాంతుల 2,400 షెకెళ్ళు. 30 ఆ ఇత్తడిని సమావేశ గుడారపు ద్వారం యొక్క దిమ్మల కోసం, ఇత్తడి బలిపీఠానికి, ఇత్తడి జల్లెడ, దాని పాత్రలన్నిటికి, 31 చుట్టూ ఉన్న ఆవరణానికి, దాని ద్వారానికి దిమ్మలు చేయడానికి, సమావేశ గుడారం, చుట్టూ ఉన్న ఆవరణపు అన్ని మేకులు చేయడానికి ఉపయోగించారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.