Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నిర్గమ 37 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


మందసం

1 బెసలేలు తుమ్మకర్రతో మందసం తయారుచేశాడు. దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర, ఎత్తు ఒకటిన్నర మూర.

2 అతడు దాని లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును తయారుచేశాడు.

3 నాలుగు బంగారు ఉంగరాలు పోతపోయించి ఒకవైపు రెండు మరోవైపు రెండు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాడు.

4 తర్వాత తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించాడు.

5 వాటిని మందసాన్ని మోయడానికి ఆ మోతకర్రలను మందసానికి ఇరుప్రక్కల ఉన్న ఉంగరాల్లో దూర్చాడు.

6 అతడు స్వచ్ఛమైన బంగారంతో ప్రాయశ్చిత్త మూతను తయారుచేశాడు; దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉంది.

7 తర్వాత అతడు సాగగొట్టిన బంగారంతో మూత చివర్లలో రెండు కెరూబులను తయారుచేశాడు.

8 అతడు ఒక చివర ఒక కెరూబును మరోచివర రెండవ కెరూబును చేశాడు; మూత మీద దాని రెండు చివర్లలో కెరూబులతో పాటు దానంతటిని ఒకే ముక్కలా చేశాడు.

9 ఆ కెరూబులు తమ రెక్కలను పైకి చాపి వాటితో ప్రాయశ్చిత్త మూతను కప్పుతూ ఉన్నాయి. కెరూబుల ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండి, ప్రాయశ్చిత్త మూతను చూస్తున్నట్లుగా ఉన్నాయి.


బల్ల

10 వారు తుమ్మకర్రతో ఒక బల్లను చేశారు. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు ఒకటిన్నర మూర.

11 తర్వాత వారు దాన్ని స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును చేశారు.

12 అలాగే దాని చుట్టూ బెత్తెడు వెడల్పున చట్రం కూడా చేసి దానిపై బంగారంతో పొదిగించారు.

13 ఆ బల్లకు నాలుగు ఉంగరాలు చేసి వాటిని నాలుగు కాళ్లు ఉన్న నాలుగు మూలల్లో తగిలించారు.

14 బల్ల మోయడానికి ఉపయోగించే మోతకర్రలు ఉంచే ఉంగరాలు చట్రానికి దగ్గరగా పెట్టారు.

15 ఆ బల్లను మోయడానికి తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటికి బంగారంతో పొదిగించారు.

16 బల్ల యొక్క ఉపకరణాలు అనగా దాని పళ్లెములు, పాత్రలు, పానార్పణలు పోయడానికి ఉపయోగించే బానలు గిన్నెలను స్వచ్ఛమైన బంగారంతో తయారుచేశాడు.


దీపస్తంభం

17 వారు స్వచ్ఛమైన బంగారంతో దీపస్తంభం చేశారు. దాని అడుగు పీఠాన్ని నడిమి భాగాన్ని సుత్తెతో సాగగొట్టారు, దాని కలశాలు, దాని మొగ్గలు దాని పువ్వులు తయారుచేసి వాటితో ఒకే ఖండంలా చేశారు.

18 దీపస్తంభానికి రెండు వైపుల నుండి ఆరు కొమ్మలు; ఒక ప్రక్క మూడు మరొక ప్రక్క మూడు కొమ్మలు విస్తరించి ఉన్నాయి.

19 ఒక కొమ్మకు మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన మూడు కలశాలు, తర్వాతి కొమ్మకు కూడా అలాగే మూడు కలశాల చొప్పున దీపస్తంభం నుండి విస్తరించివున్న ఆరు కొమ్మలకు అదే విధంగా ఉన్నాయి.

20 దీపస్తంభం మీద మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన నాలుగు కలశాలు ఉన్నాయి.

21 దీపస్తంభం నుండి విస్తరించి ఉన్న మొదటి జత కొమ్మల క్రింద మొదటి మొగ్గ, రెండవ జత కొమ్మల క్రింద రెండవ మొగ్గ, మూడవ జత కొమ్మల క్రింద మూడవ మొగ్గ చొప్పున ఆరు కొమ్మలకు అమర్చారు.

22 సాగగొట్టబడిన స్వచ్ఛమైన బంగారంతో మొగ్గలు కొమ్మలు దీపస్తంభంతో ఒకే ఖండంగా చేశారు.

23 వారు ఏడు దీపాలు దాని వత్తులు కత్తిరించే కత్తెరలు, పళ్ళాలను స్వచ్ఛమైన బంగారంతో చేశారు.

24 దీపస్తంభాన్ని దాని ఉపకరణాలను తయారుచేయడానికి ఒక తలాంతు స్వచ్ఛమైన బంగారం ఉపయోగించాడు.


ధూపవేదిక

25 వారు తుమ్మకర్రతో ఒక ధూపవేదిక తయారుచేశారు. అది చతురస్రంగా ఒక మూర పొడవు ఒక మూర వెడల్పు రెండు మూరల ఎత్తు ఉంది. దాని కొమ్ములను దానితో ఒకే ఖండంగా ఉండేలా చేశారు.

26 దాని పైభాగానికి, అన్ని ప్రక్కలకు, కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకుతో పొదిగించి దాని చుట్టూ బంగారు కడ్డీ చేశారు.

27 మోయడానికి ఉపయోగించే మోతకర్రలను పెట్టడానికి, కడ్డీ క్రింద రెండు బంగారు ఉంగరాలు, ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా తయారుచేశారు.

28 వారు తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించారు.

29 అంతేకాక వారు పవిత్ర అభిషేక తైలాన్ని, స్వచ్ఛమైన, పరిమళద్రవ్యాలు చేసేవాని పనిలా పరిమళ వాసనగల ధూపాన్ని తయారుచేశారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan