Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నిర్గమ 35 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


సబ్బాతు నియమాలు

1 మోషే ఇశ్రాయేలీయుల సమాజమంతటిని సమావేశపరచి వారితో, “మీరు పాటించడానికి యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు ఇవే:

2 ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు మీ పరిశుద్ధ దినం, అది యెహోవాకు సబ్బాతు విశ్రాంతి దినము. ఆ రోజు ఎవరు ఏ పని చేసినా వారికి మరణశిక్ష విధించబడాలి.

3 సబ్బాతు దినాన మీరు మీ నివాసాల్లో మంట వెలిగించకూడదు.”


సమావేశ గుడారానికి సామాగ్రి

4 మోషే ఇశ్రాయేలీయుల సమాజమంతటితో, “యెహోవా ఆజ్ఞాపించింది ఇదే:

5 మీ దగ్గర ఉన్నదానిలో నుండి యెహోవా కోసం అర్పణ తీసుకురావాలి. ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుక తెచ్చే ప్రతి ఒక్కరు ఇవి తీసుకురావలసినవి: “బంగారం, వెండి, ఇత్తడి;

6 నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నారబట్ట; మేక వెంట్రుకలు;

7 ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మాలు మన్నికైన తోలు; తుమ్మకర్ర;

8 దీపాలకు ఒలీవనూనె; అభిషేక తైలానికి సువాసనగల ధూపానికి సుగంధద్రవ్యాలు;

9 ఏఫోదు మీద, రొమ్ము పతకం మీద పొదగడానికి లేతపచ్చ రాళ్లు, ఇతర రత్నాలు.

10 “మీలో నైపుణ్యం ఉన్నవారు వచ్చి యెహోవా ఆజ్ఞాపించిన ప్రతిదీ తయారుచేయాలి:

11 “అవేమంటే, సమావేశ గుడారం, దాని గుడారం, దాని పైకప్పు, దాని కొలుకులు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు;

12 మందసం, దాని మోతకర్రలు, ప్రాయశ్చిత్త మూత దానిని కప్పివుంచే తెర;

13 బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణాలన్నీ, సన్నిధి రొట్టెలు;

14 వెలుగు కోసం దీపస్తంభం, దాని ఉపకరణాలు, దీపాలు, వెలిగించడానికి ఒలీవనూనె;

15 ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం; సమావేశ గుడారపు ద్వారానికి తెర;

16 దహనబలిపీఠం దాని ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని పాత్రలన్నీ; ఇత్తడి గంగాళం, దాని పీట;

17 ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, దిమ్మలు, ఆవరణ ద్వారానికి తెర;

18 సమావేశ గుడారానికి, ఆవరణానికి మేకులు, వాటి త్రాళ్లు;

19 పరిశుద్ధాలయంలో పరిచర్య చేయడానికి ధరించే నేసిన వస్త్రాలు; యాజకుడైన అహరోనుకు పవిత్ర వస్త్రాలు, యాజకులుగా సేవ చేస్తున్నప్పుడు అతని కుమారులకు వస్త్రాలు” అని చెప్పాడు.

20 అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే దగ్గరి నుండి వెళ్లి,

21 ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకున్న ప్రతిఒక్కరు, హృదయాల్లో ప్రేరేపించబడిన ప్రతి ఒక్కరు వచ్చి, సమావేశ గుడారం యొక్క పనుల కోసం, దాని సేవలన్నిటి కోసం, పవిత్ర వస్త్రాల కోసం యెహోవాకు అర్పణలు తెచ్చారు.

22 ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకున్న స్త్రీలు పురుషులు వచ్చి, చెవికమ్మలు, వ్రేలి ఉంగరాలు, నగలు, వివిధ రకాల బంగారు ఆభరణాలు తెచ్చి ఆ బంగారాన్ని పైకెత్తి ఆడించి యెహోవాకు ప్రత్యేక అర్పణగా సమర్పించారు.

23 తమ దగ్గర నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నార మేక వెంట్రుకలు ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మాలు, మన్నికైన తోళ్లు ఉన్నవారు వాటిని తెచ్చారు.

24 వెండిని ఇత్తడిని అర్పించాలనుకున్నవారు వాటిని యెహోవాకు అర్పణగా తెచ్చారు, ఆ పనిలో దేనికైనా ఉపయోగపడే తుమ్మకర్రలు ఉన్న ప్రతిఒక్కరు వాటిని తెచ్చారు.

25 నైపుణ్యం కలిగిన ప్రతి స్త్రీ తమ చేతులతో వడికి తాము వడికిన నీలం ఊదా ఎరుపు రంగుల నూలు లేదా సన్నని నార తెచ్చారు.

26 నైపుణ్యం కలిగి ప్రేరేపించబడిన స్త్రీలందరు మేక వెంట్రుకలను వడికారు.

27 నాయకులు ఏఫోదులో, రొమ్ము పతకంలో పొదగడానికి లేతపచ్చ రాళ్లు, ఇతర రత్నాలు తెచ్చారు.

28 అలాగే దీపాలు వెలిగించడానికి ఒలీవనూనె, అభిషేక తైలానికి, పరిమళ వాసనగల ధూపానికి సుగంధద్రవ్యాలు తెచ్చారు.

29 మోషే ద్వారా యెహోవా వారికి చేయమని ఆజ్ఞాపించిన పనులన్నిటి కోసం ఇశ్రాయేలీయుల స్త్రీలు పురుషులలో ప్రేరేపించబడిన వారందరు ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుకలు తెచ్చారు.


బెసలేలు, అహోలీయాబు

30 తర్వాత మోషే ఇశ్రాయేలీయులతో, “చూడండి, యెహోవా యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును ఏర్పరచుకొని,

31-33 బంగారం వెండి ఇత్తడితో కళాత్మక నమూనాలను రూపొందించడానికి, రాళ్లను చెక్కి అమర్చడం, చెక్క పని చేయడం వంటి అన్ని రకాల కళాత్మక నైపుణ్యాలతో పని చేయడానికి అతన్ని దేవుని ఆత్మతో జ్ఞానంతో సామర్థ్యంతో తెలివితో అన్ని రకాల నైపుణ్యతలతో నింపారు.

34 ఆయన బెసలేలుకు, అలాగే దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన ఒహోలీయాబుకు ఇతరులకు నేర్పగల సామర్థ్యాన్ని ఇచ్చారు.

35 చెక్కేవారి పని, కళాకారుల పని, నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నారతో కుట్టుపని, నేతగాని పని, చిత్రకారులు చేయగల అన్ని రకాల పనులను చేయడానికి కావలసిన నైపుణ్యంతో యెహోవా వారిని నింపారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan