నిర్గమ 34 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంక్రొత్త రాతిపలకలు 1 యెహోవా మోషేతో, “మొదటి పలకలవంటి మరో రెండు రాతిపలకలను చెక్కు, నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే నేను వాటిపై వ్రాస్తాను. 2 నీవు ఉదయమే సిద్ధపడి, సీనాయి పర్వతం మీదికి రా. ఆ పర్వత శిఖరం మీద నీవు నా ఎదుట నిలబడు. 3 నీతో మరెవరూ రాకూడదు, ఈ పర్వతం మీద ఎవరూ కనపడకూడదు; ఈ పర్వతం దగ్గర పశువులు గాని గొర్రెలు గాని మేయకూడదు” అని చెప్పారు. 4 కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మొదటి వాటిలా రెండు రాతిపలకలను చెక్కి తన చేతులతో ఆ రెండు రాతిపలకలు పట్టుకుని తెల్లవారుజామునే సీనాయి పర్వతం పైకి వెళ్లాడు. 5 అప్పుడు యెహోవా మేఘంలో దిగివచ్చి అతనితో అక్కడ నిలబడి యెహోవా అనే తన పేరును ప్రకటించారు. 6 మోషే ఎదుట నుండి ఆయన దాటి వెళ్తూ, “యెహోవా, దేవుడైన యెహోవా కనికరం దయ కలిగినవారు, త్వరగా కోప్పడరు, ప్రేమ నమ్మకత్వాలతో నిండియున్నవారు, 7 వేలాదిమందికి ప్రేమను చూపిస్తూ, దుర్మార్గాన్ని, తిరుగుబాటును, పాపాన్ని క్షమిస్తారు గాని ఆయన దోషులను నిర్దోషులుగా విడిచిపెట్టక, మూడు నాలుగు తరాల వరకు తల్లిదండ్రుల పాపానికి పిల్లలను వారి పిల్లలను శిక్షిస్తారు” అని ప్రకటించారు. 8 వెంటనే మోషే నేలవరకు తలవంచి ఆరాధిస్తూ, 9 “ప్రభువా, నా మీద మీకు దయ కలిగితే, ప్రభువు మాతో పాటు రావాలి. వీరు లోబడని ప్రజలే అయినప్పటికీ, మా దుర్మార్గాన్ని మా పాపాన్ని క్షమించి, మమ్మల్ని మీ స్వాస్థ్యంగా తీసుకోండి” అన్నాడు. 10 అందుకు యెహోవా: “నీతో నేను ఒక ఒడంబడిక చేస్తున్నాను. ఈ భూమి మీద ఏ దేశంలో ఎప్పుడూ జరుగని అద్భుతాలు నేను నీ ప్రజలందరి ఎదుట చేస్తాను. నీవు ఏ ప్రజలమధ్య నివసిస్తున్నావో వారందరు యెహోవానైన నేను మీ కోసం చేసే భయంకరమైన కార్యాన్ని చూస్తారు. 11 నేడు నేను మీకు ఆజ్ఞాపించే దానికి లోబడాలి. నేను అమోరీయులు, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్లగొడతాను. 12 మీరు వెళ్లబోతున్న దేశంలో నివసిస్తున్న వారితో సంధి చేసుకోకుండ జాగ్రత్తపడండి, లేకపోతే వారు మీ మధ్య ఉరిగా ఉంటారు. 13 మీరు వారి బలిపీఠాలను పడగొట్టండి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టండి, వారి అషేరా స్తంభాలను ముక్కలు చేయండి. 14 మీరు ఇతర దేవుళ్ళను ఆరాధించకూడదు, ఎందుకంటే రోషం గలవాడని పేరుగల యెహోవా, రోషం గల దేవుడు. 15 “ఆ దేశంలో నివసిస్తున్న వారితో సంధి చేసుకోకుండ జాగ్రత్తపడండి; ఎందుకంటే వారు తమ దేవుళ్ళతో వ్యభిచరించి వాటికి బలులు అర్పించినప్పుడు, వారు మిమ్మల్ని ఆహ్వానిస్తారు, మీరు ఆ బలులను తింటారు. 16 మీరు మీ కుమారులకు వారి కుమార్తెలను భార్యలుగా చేసుకున్నప్పుడు ఆ కుమార్తెలు తమ దేవుళ్ళతో వ్యభిచరించి మీ కుమారులచేత అదే విధంగా చేయిస్తారు. 17 “ఏ దేవుళ్ళ విగ్రహాలు చేసుకోకూడదు. 18 “పులియని రొట్టెల పండుగ జరుపుకోవాలి. ఎందుకంటే నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం, ఏడు రోజులు మీరు పులియని పిండితో చేసిన రొట్టెలే తినాలి. అబీబు నెలలో నిర్ణీత సమయంలో మీరిలా చేయాలి, ఎందుకంటే ఆ నెలలో మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చారు. 19 “ప్రతి గర్భం యొక్క మొదటి సంతానం నాదే, మీ పశువుల్లో మొదటి సంతానమైన ప్రతి మగపిల్ల అది దూడ గాని, గొర్రెపిల్ల గాని, అది నాకు చెందుతుంది. 20 గొర్రెపిల్లను ఇచ్చి మొదటి సంతానమైన గాడిదను విడిపించుకోవాలి, అలా మీరు దాన్ని విడిపించుకోకపోతే, దాని మెడ విరగ్గొట్టాలి. మీ ప్రతి మొదటి మగపిల్లవాన్ని విడిపించుకోవాలి. “నా సన్నిధిలో ఎవరూ వట్టి చేతులతో కనిపించకూడదు. 21 “ఆరు రోజులు మీరు పని చేయాలి, కాని ఏడవ రోజు మీరు విశ్రాంతి తీసుకోవాలి; అది దున్నే కాలమైనా పంట కోసే కాలమైనా సరే మీరు విశ్రాంతి తీసుకోవాలి. 22 “గోధుమపంటలోని ప్రథమ ఫలాలతో వారాల పండుగ ఆచరించాలి, సంవత్సరం చివరిలో పంటకూర్పు పండుగ ఆచరించాలి. 23 సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులందరు ఇశ్రాయేలీయుల దేవుడు ప్రభువైన యెహోవా సన్నిధిలో కనబడాలి. 24 నేను మీ ఎదుట నుండి దేశాలను తరిమివేసి, మీ భూభాగాన్ని విస్తరింపజేస్తాను, మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో కనబడడానికి మీరు సంవత్సరానికి మూడుసార్లు పైకి వెళ్లినప్పుడు మీ భూమిని ఎవరూ ఆశించరు. 25 “పులిసిన దానితో కలిపి నాకు బలి యొక్క రక్తాన్ని అర్పించకూడదు, పస్కా పండుగ నుండి ఏ బలికి చెందినది ఏదీ ఉదయం వరకు మిగలకూడదు. 26 “మీ పొలంలో పండిన ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైన వాటిని మీ దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి. “మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.” 27 తర్వాత యెహోవా మోషేతో, “ఈ మాటలను వ్రాయి; ఎందుకంటే ఈ మాటలను అనుసరించి నేను నీతో, అలాగే ఇశ్రాయేలీయులతో నిబంధన చేశాను” అన్నారు. 28 మోషే నలభై రాత్రింబవళ్ళు యెహోవాతో పాటు అక్కడే, ఆహారం తినకుండ నీళ్లు త్రాగకుండ ఉన్నాడు. అతడు నిబంధన మాటలు అనగా పది ఆజ్ఞలు ఆ పలకల మీద వ్రాశాడు. ప్రకాశమానమైన మోషే ముఖం 29 మోషే తన చేతుల్లో ఆ రెండు నిబంధన పలకలను మోస్తూ సీనాయి పర్వతం దిగివస్తున్నప్పుడు, అతడు యెహోవాతో మాట్లాడాడు కాబట్టి అతని ముఖం ప్రకాశమానంగా ఉందని అతనికి తెలియదు. 30 అహరోను, ఇశ్రాయేలీయులందరు మోషేను చూసినప్పుడు అతని ముఖం ప్రకాశవంతంగా ఉంది కాబట్టి అతని దగ్గరకు వెళ్లడానికి వారు భయపడ్డారు. 31 అయితే మోషే వారిని పిలిచాడు; కాబట్టి అహరోను, సమాజ నాయకులు అతని దగ్గరకు తిరిగి వచ్చారు, అతడు వారితో మాట్లాడాడు. 32 ఆ తర్వాత ఇశ్రాయేలీయులందరు అతని దగ్గరకు రాగా సీనాయి పర్వతం మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని అతడు వారికిచ్చాడు. 33 మోషే వారితో మాట్లాడడం ముగించినప్పుడు తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. 34 అయితే మోషే యెహోవాతో మాట్లాడడానికి ఆయన సన్నిధిలోనికి వెళ్లినప్పుడెల్లా బయటకు వచ్చేవరకు అతడు ముసుగు తీసివేసేవాడు. అతడు బయటకు వచ్చి తనకు ఆజ్ఞాపించిన వాటిని ఇశ్రాయేలీయులకు చెప్పేవాడు. 35 అప్పుడు అతని ముఖం ప్రకాశించడం ఇశ్రాయేలీయులు చూశారు; మోషే తిరిగి యెహోవాతో మాట్లాడడానికి వెళ్లేవరకు తన ముఖం మీద ముసుగు వేసుకునేవాడు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.