Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నిర్గమ 33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 అప్పుడు యెహోవా మోషేతో, “ఈ స్థలాన్ని విడిచి, నీవు, నీవు ఈజిప్టు నుండి తీసుకువచ్చిన ప్రజలు, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు, ‘నేను దాన్ని మీ వారసులకు ఇస్తాను’ అని ప్రమాణం చేసిన దేశానికి వెళ్లండి.

2 నేను నా దూతను మీకు ముందుగా పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్లగొడతాను.

3 పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్లండి. అయితే మీరు లోబడని ప్రజలు కాబట్టి నేను మీతో రాను, ఎందుకంటే మార్గం మధ్యలో నేను మిమ్మల్ని అంతం చేస్తానేమో” అన్నారు.

4 ప్రజలు ఈ బాధ కలిగించే మాటలు విన్నప్పుడు, వారు దుఃఖించడం మొదలుపెట్టారు, ఎవరూ ఆభరణాలు ధరించలేదు.

5 యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు లోబడని ప్రజలు. ఒకవేళ నేను ఒక్క క్షణం మీతో కలిసి వెళ్లినా, మిమ్మల్ని అంతం చేయవచ్చు. కాబట్టి మీ ఆభరణాలను తీసివేయండి మిమ్మల్ని ఏం చేయాలో నేను నిర్ణయిస్తాను.’ ”

6 కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు పర్వతం దగ్గర నుండి తమ ఆభరణాలను ధరించలేదు.


సమావేశ గుడారం

7 మోషే గుడారం తీసుకుని శిబిరం బయట కొంత దూరంలో దానిని వేసి, దానికి “సమావేశ గుడారం” అని పేరు పెట్టాడు. యెహోవా దగ్గర విచారణ చేసే ప్రతి ఒక్కరు శిబిరం బయట ఉన్న సమావేశ గుడారానికి వెళ్లేవారు.

8 మోషే గుడారంలోకి వెళ్లినప్పుడెల్లా, ప్రజలంతా వారి గుడారపు ద్వారాల దగ్గర నిలబడి, మోషే ఆ గుడారం లోపలికి వెళ్లేవరకు కనిపెట్టుకుని ఉండేవారు.

9 మోషే ఆ గుడారం లోపలికి వెళ్లగానే, మేఘస్తంభం దిగివచ్చి దాని ద్వారం దగ్గర నిలబడేది, అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడేవారు.

10 ఆ గుడారపు ద్వారం దగ్గర మేఘస్తంభం నిలబడడం ప్రజలు చూసినప్పుడెల్లా, వారంతా లేచి నిలబడి, ప్రతిఒక్కరు తమ గుడారపు ద్వారం దగ్గర యెహోవాను ఆరాధించేవారు.

11 ఒకరు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవారు. తర్వాత మోషే శిబిరానికి తిరిగి వచ్చేవాడు, కాని అతని సేవకుడు నూను కుమారుడైన యెహోషువ అనే యువకుడు ఆ గుడారాన్ని విడిచిపెట్టేవాడు కాదు.


మోషే, యెహోవా మహిమ

12 మోషే యెహోవాతో, “ ‘ఈ ప్రజలను నడిపించు’ అని మీరు నాకు చెప్తున్నారు, కాని నాతో ఎవరిని పంపుతారో నాకు చెప్పలేదు. ‘నీ పేరుతో సహా నీవు నాకు తెలుసు, నీవు నా దయను పొందావు’ అని మీరు అన్నారు.

13 ఒకవేళ మీకు నా మీద దయ ఉంటే, నేను మిమ్మల్ని తెలుసుకొని మీ దయ పొందుతూ ఉండేలా మీ మార్గాలను నాకు బోధించండి. ఈ జనులు మీ ప్రజలేనని జ్ఞాపకముంచుకోండి” అని అన్నాడు.

14 అందుకు యెహోవా, “నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి ఇస్తాను” అన్నారు.

15 అప్పుడు మోషే ఆయనతో, “మీ సన్నిధి మాతో పాటు రాకపోతే మమ్మల్ని ఇక్కడినుండి పంపవద్దు.

16 మీరు మాతో రాకపోతే నా పట్ల మీ ప్రజల పట్ల మీరు కనికరం చూపించారని ఎవరికైనా ఎలా తెలుస్తుంది? ఈ భూమి మీద ఉన్న ఇతర ప్రజల నుండి నన్ను, మీ ప్రజలను ఏది ప్రత్యేకపరుస్తుంది?” అని అడిగాడు.

17 అందుకు యెహోవా మోషేతో, “నీవడిగినట్టే నేను చేస్తాను, ఎందుకంటే నీ మీద నాకు దయ కలిగింది, నీ పేరుతో సహా నీవు నాకు తెలుసు” అని అన్నారు.

18 అప్పుడు మోషే, “ఇప్పుడు నీ మహిమ నాకు చూపించు” అని అన్నాడు.

19 అందుకు యెహోవా, “నా మంచితనమంతా నీ ఎదుట నుండి దాటిపోయేలా చేస్తాను. యెహోవా అనే నా పేరును నీ ఎదుట ప్రకటిస్తాను. నాకు ఎవరి మీద కనికరం కలుగుతుందో వారిని కనికరిస్తాను, నాకు ఎవరి మీద దయ కలుగుతుందో వారికి నేను దయ చూపిస్తాను.”

20 అయితే ఆయన, “నీవు నా ముఖాన్ని చూడలేవు; ఎందుకంటే నన్ను చూసిన మనుష్యులు బ్రతుకరు” అని అన్నారు.

21 యెహోవా, “నాకు దగ్గరగా ఒక స్థలముంది అక్కడ నీవు బండ మీద నిలబడు.

22 నా మహిమ నిన్ను దాటి వెళ్తున్నప్పుడు ఆ బండ సందులో నిన్ను ఉంచి నేను వెళ్లిపోయేవరకు నా చేతితో నిన్ను కప్పుతాను.

23 నేను చేయి తీసిన తర్వాత నీవు నా వెనుక భాగం చూస్తావు; కాని నా ముఖం నీకు కనబడదు” అన్నారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan