Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నిర్గమ 32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


బంగారు దూడ

1 మోషే పర్వతం దిగిరావడానికి ఆలస్యం చేయడం చూసిన ప్రజలు అహరోను చుట్టూ గుమికూడి, అతనితో, “ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన ఈ మోషే అనే వానికి ఏమి జరిగిందో మాకు తెలియదు కాబట్టి నీవు వచ్చి మాకు ముందు నడవడానికి మాకు దేవుళ్ళను తయారుచేయి” అని అన్నారు.

2 అందుకు అహరోను, “అయితే మీ భార్యలు మీ కుమారులు మీ కుమార్తెలు ధరించిన బంగారు చెవికమ్మలు తీసి నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు.

3 కాబట్టి ప్రజలందరు తమ చెవికమ్మలు తీసి అహరోను దగ్గరకు తెచ్చారు.

4 అతడు వారు తనకు ఇచ్చిన వాటిని తీసుకుని ఒక సాధనంతో దూడ రూపంలో పోతపోసి ఒక విగ్రహం తయారుచేశాడు. అప్పుడు వారు, “ఓ ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుళ్ళు వీరే” అని అన్నారు.

5 అహరోను ఇది చూసి ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం కట్టించి, “రేపు యెహోవాకు పండుగ జరుగుతుంది” అని ప్రకటించాడు.

6 కాబట్టి మరునాడు ప్రజలు ఉదయాన్నే లేచి దహనబలులు సమాధానబలులు అర్పించారు. ఆ తర్వాత ప్రజలు తినడానికి త్రాగడానికి కూర్చుని ఆడడానికి లేచారు.

7 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు క్రిందికి వెళ్లు, ఈజిప్టులో నుండి నీవు తీసుకువచ్చిన నీ ప్రజలు చెడిపోయారు.

8 నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి చాలా త్వరగా తప్పిపోయి ఒక దూడ రూపంలో పోతపోసిన విగ్రహాన్ని తమ కోసం తయారుచేసుకుని దానికి సాష్టాంగపడి బలి అర్పించి, ‘ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుళ్ళు వీరే’ అని అన్నారు.

9 “నేను ఈ ప్రజలను చూశాను” అని అంటూ యెహోవా మోషేతో ఇలా అన్నారు, “వారు మొండి ప్రజలు,

10 నా కోపం వారి మీద రగులుకొని, నేను వారిని నాశనం చేస్తాను, నీవు నన్ను వదిలేయి. తర్వాత నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను.”

11 అయితే మోషే తన దేవుడైన యెహోవా దయ కోసం మొరపెడుతూ, “యెహోవా, మీరు గొప్ప బలముతో బలమైన చేతితో ఈజిప్టులో నుండి రప్పించిన మీ ప్రజల మీద ఎందుకంత కోపం?

12 ‘వారిని పర్వతాల మధ్య చంపాలని భూమి మీద ఉండకుండా వారిని నాశనం అయ్యేలా కీడు చేయడానికే ఆయన వారిని బయటకు రప్పించారని ఈజిప్టువారు ఎందుకు చెప్పుకోవాలి?’ రగులుతున్న నీ కోపాన్ని విడిచిపెట్టండి; మనస్సు మార్చుకోండి, మీ ప్రజలపై విపత్తును తీసుకురావద్దు.

13 మీ సేవకులైన అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరే స్వయంగా ఇలా ప్రమాణం చేశారు: ‘నేను మీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లా అసంఖ్యాకంగా చేసి వారికి ఇస్తానని నేను వాగ్దానం చేసిన ఈ దేశాన్నంతా మీ సంతానానికి ఇస్తాను, అది వారి వారసత్వంగా నిరంతరం ఉంటుంది.’ ”

14 అప్పుడు యెహోవా మనస్సు మార్చుకొని తన ప్రజలకు తాను తెస్తానని చెప్పిన విపత్తును వారి మీదికి తేలేదు.

15 మోషే తన చేతులతో రెండు నిబంధన పలకలు పట్టుకుని పర్వతం దిగి వెళ్లాడు. ఆ పలకలకు రెండు వైపులా ముందు వెనుక వ్రాసి ఉంది.

16 ఆ పలకలు దేవుని పని; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేతివ్రాత.

17 ప్రజలు కేకలు వేస్తున్న శబ్దం యెహోషువ విని మోషేతో, “శిబిరంలో యుద్ధధ్వని వినబడుతుంది” అన్నాడు.

18 మోషే ఇలా జవాబిచ్చాడు: “అది విజయధ్వని కాదు, అపజయధ్వని కాదు; నేను వింటుంది పాడుతున్న ధ్వని.”

19 మోషే శిబిరాన్ని సమీపించి ఆ దూడ విగ్రహాన్ని, వారు నాట్యం చేయడాన్ని చూసినప్పుడు అతనికి చాలా కోపం వచ్చి, అతడు తన చేతుల్లో ఉన్న రెండు పలకలను విసిరి, పర్వత అడుగు భాగాన వాటిని ముక్కలు చేశాడు.

20 అతడు ఆ ప్రజలు చేసిన దూడ విగ్రహాన్ని తీసుకుని అగ్నిలో కాల్చివేశాడు; తర్వాత అతడు దానిని పొడిచేసి, నీళ్ల మీద చల్లి, ఆ నీళ్లను ఇశ్రాయేలీయులతో త్రాగించాడు.

21 అప్పుడు మోషే అహరోనును, “నీవు వారిని ఇలాంటి ఘోరమైన పాపం చేసేలా నడిపించడానికి ఈ ప్రజలు నిన్ను ఎలా ప్రేరేపించారు?” అని అడిగాడు.

22 అందుకు అహరోను, “నా ప్రభువా, కోప్పడకు, ఈ ప్రజలు చెడుకు ఎంతగా అలవాటుపడ్డారో నీకు తెలుసు.

23 వీరు నన్ను, ‘ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన ఈ మోషే అనే వానికి ఏమి జరిగిందో మాకు తెలియదు కాబట్టి నీవు వచ్చి మాకు ముందు నడవడానికి మాకు దేవుళ్ళను తయారుచేయి’ అని అన్నారు.

24 అందుకు నేను, ‘ఎవరి దగ్గర బంగారు ఆభరణాలు ఉంటే వారు తీసుకురండి’ అని చెప్పాను. అప్పుడు వారు నాకు బంగారం ఇచ్చారు, నేను దాన్ని అగ్నిలో పడేస్తే, ఈ దూడ అయ్యింది!” అని చెప్పాడు.

25 ప్రజలు విచ్చలవిడిగా తిరగడం మోషే చూశాడు. వారి శత్రువుల ముందు నవ్వులపాలయ్యేలా అహరోను వారిని వదిలేశాడు.

26 కాబట్టి మోషే శిబిరం ద్వారం దగ్గర నిలబడి, “యెహోవా పక్షం ఉన్నవారందరు నా దగ్గరకు రండి” అని అన్నాడు. అప్పుడు లేవీయులందరు అతని దగ్గరకు వచ్చారు.

27 అతడు వారితో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: ‘ప్రతి ఒక్కరు తన కత్తిని తన నడుముకు కట్టుకుని, శిబిరం ఒక ద్వారం నుండి ఇంకొక ద్వారం వరకు వెళ్తూ ప్రతివారు తన సోదరులను స్నేహితులను పొరుగువారిని చంపాలి.’ ”

28 లేవీయులు మోషే ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు; ఆ రోజు సుమారు మూడువేలమంది చనిపోయారు.

29 అప్పుడు మోషే, “ఈ రోజు, మీరు మీ సొంత కుమారులకు సోదరులకు వ్యతిరేకంగా మిమ్మల్ని మీరు యెహోవా కోసం ప్రత్యేకించుకున్నారు, కాబట్టి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించారు” అని అన్నాడు.

30 ఆ మరునాడు మోషే ప్రజలతో, “మీరు ఘోరమైన పాపం చేశారు. కాని నేను యెహోవా దగ్గరకు ఎక్కి వెళ్తాను; బహుశ మీ పాపాల కోసం నేనేమైనా ప్రాయశ్చిత్తం చేయగలనేమో” అని అన్నాడు.

31 అప్పుడు మోషే యెహోవా దగ్గరకు తిరిగివెళ్లి, “అయ్యో, ఈ ప్రజలు ఎంతో ఘోరమైన పాపం చేశారు! తమ కోసం బంగారంతో దేవుళ్ళను తయారుచేసుకున్నారు.

32 కాని ఇప్పుడు, దయచేసి వారి పాపాలను క్షమించండి, వారిని మీరు క్షమించకపోతే మీరు వ్రాసిన గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయండి” అని అడిగాడు.

33 అందుకు యెహోవా మోషేకు, “నాకు వ్యతిరేకంగా ఎవరు పాపం చేశారో వారి పేరును నా గ్రంథంలో నుండి కొట్టివేస్తాను.

34 నీవు వెళ్లి, నేను నీకు చెప్పిన చోటికి ప్రజలను నడిపించు, నా దూత మీకు ముందుగా వెళ్తాడు. అయితే నేను శిక్ష విధించవలసిన సమయం వచ్చినప్పుడు వారి పాపాలకు వారికి శిక్ష విధిస్తాను” అని సమాధానం ఇచ్చారు.

35 అహరోను చేసిన దూడ విగ్రహంతో వారు చేసిన దానిని బట్టి యెహోవా ప్రజలను తెగులుతో మొత్తారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan