నిర్గమ 17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంబండ నుండి నీళ్లు 1 ఇశ్రాయేలీయుల సమాజమంతా సీను అరణ్యం నుండి బయలుదేరి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించారు. వారు రెఫీదీములో బస చేశారు, కాని అక్కడ ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేవు. 2 కాబట్టి వారు మోషేతో గొడవపడుతూ, “మాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వు” అని అడిగారు. అందుకు మోషే, “నాతో ఎందుకు గొడవపడుతున్నారు? యెహోవాను ఎందుకు పరీక్షిస్తున్నారు?” అన్నాడు. 3 కాని అక్కడ ప్రజలు దాహం తట్టుకోలేక మోషే మీద సణుగుతూ, “మీరు మమ్మల్ని ఈజిప్టు నుండి ఎందుకు తీసుకువచ్చారు? దాహంతో మేము మా పిల్లలు మా పశువులు చావాలనా?” అన్నారు. 4 అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టి, “ఈ ప్రజలతో నేనేం చేయాలి? వీరు దాదాపు నన్ను రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు” అన్నాడు. 5 యెహోవా మోషేతో, “ప్రజలకు ముందుగా వెళ్లు. నీతో ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకుని నైలు నదిని కొట్టిన చేతికర్రను పట్టుకుని వెళ్లు. 6 అక్కడ హోరేబులో బండ దగ్గర నేను నీకు ఎదురుగా నిలబడి ఉంటాను. నీవు ఆ బండను కొట్టు, ప్రజలు త్రాగడానికి ఆ బండ నుండి నీళ్లు వస్తాయి” అని చెప్పారు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలు చూస్తుండగా యెహోవా చెప్పినట్టు చేశాడు. 7 ఇశ్రాయేలీయులు, “యెహోవా మన మధ్య ఉన్నాడా లేడా?” అని అంటూ మోషేతో జగడమాడి, యెహోవాను పరీక్షించారు కాబట్టి మోషే ఆ చోటికి మస్సా అని మెరీబా అని పేరు పెట్టాడు. అమాలేకీయులు ఓడించబడుట 8 రెఫీదీములో అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలీయులపై దాడి చేశారు. 9 అప్పుడు మోషే యెహోషువతో, “మన పురుషులలో కొందరిని ఎంపిక చేసుకుని అమాలేకీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్లు. రేపు దేవుని కర్ర నా చేతులతో పట్టుకుని కొండ శిఖరం మీద నిలబడతాను” అని చెప్పాడు. 10 మోషే ఆజ్ఞాపించిన ప్రకారం యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేశాడు. మోషే అహరోను హూరు అనేవారు కొండశిఖరానికి ఎక్కి వెళ్లారు. 11 మోషే తన చేతులు పైకి ఎత్తినంతసేపు ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే తన చేతులు క్రిందికి దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. 12 మోషే చేతులు అలసిపోయినప్పుడు వారు ఒక రాయిని తెచ్చి అతని దగ్గర వేయగా అతడు దాని మీద కూర్చున్నాడు. అహరోను హూరులు అతనికి ఆ ప్రక్కన ఒకరు ఈ ప్రక్కన ఒకరు నిలబడి సూర్యుడు అస్తమించే వరకు మోషే చేతులు స్థిరంగా ఉండేలా పైకి ఎత్తి పట్టుకున్నారు. 13 దాని ఫలితంగా యెహోషువ ఖడ్గంతో అమాలేకీయుల సైన్యాన్ని జయించాడు. 14 తర్వాత యెహోవా మోషేతో, “అమాలేకు పేరును ఆకాశం క్రింద ఉండకుండ పూర్తిగా కొట్టివేస్తాను, కాబట్టి జ్ఞాపకం చేసుకునేలా దీనిని ఒక గ్రంథంలో వ్రాసి యెహోషువకు వినిపించు” అని చెప్పారు. 15 మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టారు. 16 అతడు, “యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా తమ చేతిని పైకి ఎత్తారు, కాబట్టి యెహోవా అమాలేకీయులతో తరతరాల వరకు యుద్ధం చేస్తూనే ఉంటారు” అన్నాడు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.