Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నిర్గమ 10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


ఎనిమిదవ తెగులు: మిడతలు

1 తర్వాత యెహోవా మోషేతో, “ఫరో దగ్గరకు వెళ్లు, ఎందుకంటే నేను అతని హృదయాన్ని అతని అధికారుల హృదయాలను కఠినం చేశాను తద్వార నేను ఈ నా సూచనలను వారి మధ్య ప్రదర్శించవచ్చు,

2 అప్పుడు మీరు మీ పిల్లలకు మనవళ్ళకు నేను ఈజిప్టు వారితో ఎలా కఠినంగా వ్యవహరించానో, వారి మధ్య నా సూచనలను ఎలా కనుపరిచానో చెప్పగలరు, నేను యెహోవానై ఉన్నాను అని మీరు తెలుసుకుంటారు” అన్నారు.

3 కాబట్టి మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లి అతనితో అన్నారు, “నేను యెహోవాను, హెబ్రీయుల దేవుడు ఇలా చెప్పారు: ‘ఎంతకాలం నిన్ను నీవు నా ఎదుట తగ్గించుకోకుండ ఉంటావు? నన్ను సేవించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.

4 నీవు వారిని వెళ్లనివ్వకపోతే రేపు నేను నీ దేశం మీదికి మిడతలను రప్పిస్తాను.

5 ఎవరు నేలను చూడలేనంతగా అవి నేలను కప్పివేస్తాయి. వడగండ్ల దెబ్బ నుండి తప్పించుకుని మీకు మిగిలిన కొద్ది దాన్ని కూడా అవి తినివేస్తాయి. మీ పొలంలో పెరుగుతున్న ప్రతి చెట్టును అవి తింటాయి.

6 నీ ఇల్లు నీ అధికారులందరి ఇల్లు ఈజిప్టు వారందరి ఇల్లు వాటితో నిండిపోతాయి. మీ తల్లిదండ్రులు గాని మీ పూర్వికులు గాని వారు ఈ దేశంలో స్థిరపడినప్పటి నుండి ఇప్పటివరకు అటువంటి వాటిని ఎన్నడూ చూడలేదు.’ ” తర్వాత మోషే ఫరో దగ్గర నుండి తిరిగి వచ్చేశాడు.

7 ఫరో అధికారులు అతనితో, “ఈ మనిషి ఎంతకాలం మనకి ఉరిగా ఉంటాడు? ఈ ప్రజలు తమ దేవుడైన యెహోవాను సేవించడానికి వారిని వెళ్లనివ్వు. ఈజిప్టు నాశనం చేయబడుతుందని నీవు గ్రహించవా?” అని అన్నారు.

8 అప్పుడు మోషే అహరోనులను తిరిగి ఫరో దగ్గరకు తీసుకువచ్చినప్పుడు అతడు, “వెళ్లండి, మీ దేవుడైన యెహోవాను సేవించండి, కాని ఎవరు వెళ్తారో నాకు చెప్పండి” అని అన్నాడు.

9 అందుకు మోషే, “మేము యెహోవాకు పండుగ జరుపుకోవాలి కాబట్టి మేము మాలో చిన్నవారిని పెద్దవారిని మా కుమారులను కుమార్తెలను మా గొర్రెలను పశువులను తీసుకెళ్తాము” అన్నాడు.

10 అందుకు ఫరో, “యెహోవా మీతో ఉండును గాక! ఒకవేళ నేను మిమ్మల్ని మీ స్త్రీలు, పిల్లలతో సహా వెళ్లనిస్తే! మీ చెడు ఆలోచన నాకు తెలుసు.

11 కాబట్టి కేవలం పురుషులు మాత్రమే వెళ్లి యెహోవాను సేవించండి; మీరు అడుగుతుంది ఇదే కదా” అని వారితో అన్నాడు. అప్పుడు వారు ఫరో ఎదుట నుండి తరిమివేయబడ్డారు.

12 అప్పుడు యెహోవా మోషేతో, “ఈజిప్టు దేశమంతటిమీదికి మిడతల దండు వచ్చి పొలంలో పెరుగుతున్న ప్రతి మొక్కను, వడగండ్ల వలన పాడవని ప్రతిదాన్ని తినివేసేలా నీ చేతిని ఈజిప్టు మీద చాపు” అని చెప్పారు.

13 మోషే తన కర్రను ఈజిప్టు మీద చాపినప్పుడు యెహోవా పగలంతా రాత్రంతా ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశారు. ఉదయానికి ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చాయి.

14 ఆ మిడతలు ఈజిప్టు దేశమంతటిని ఆక్రమించుకుని దేశంలోని ప్రతిచోట వాలాయి. అవి అసంఖ్యాకమైనవి. అటువంటి మిడతలు గతంలో ఎన్నడూ లేవు ఇకముందు ఉండవు.

15 నల్లగా ఉండే వరకు అవి భూమి అంతా కప్పాయి. వడగళ్ళకు పాడవకుండ పొలాల్లో ఉన్నవాటిని చెట్లకున్న పండ్లను అవి తినివేశాయి. ఈజిప్టు దేశమంతా చెట్టు మీద గాని మొక్క మీద గాని పచ్చదనం మిగల్లేదు.

16 ఫరో వెంటనే మోషే అహరోనులను పిలిపించి వారితో, “మీ దేవుడైన యెహోవాకు మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను.

17 దయచేసి మరొకసారి నా పాపాన్ని క్షమించి మరణం కలిగించే ఈ తెగులును నా నుండి తొలగించమని మీ దేవుడైన యెహోవాకు ప్రార్థించండి” అని అన్నాడు.

18 మోషే ఫరో దగ్గర నుండి వెళ్లి యెహోవాకు ప్రార్థన చేశాడు.

19 అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి బలమైన పడమటి గాలి వీచేలా చేసినప్పుడు ఆ గాలికి మిడతలు ఎర్ర సముద్రంలోకి కొట్టుకుపోయాయి. ఈజిప్టులో ఎక్కడ కూడా ఒక్క మిడత కూడా మిగల్లేదు.

20 అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశారు కాబట్టి అతడు ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వలేదు.


తొమ్మిదవ తెగులు: చీకటి

21 అప్పుడు యెహోవా మోషేతో, “ప్రతి ఒక్కరూ తడుముకునేంత కటిక చీకటి ఈజిప్టు దేశం మీద కమ్ముకునేలా నీ చేతిని ఆకాశం వైపు చాపు” అన్నారు.

22 మోషే తన చేతిని ఆకాశం వైపు చాపినప్పుడు మూడు రోజులపాటు ఈజిప్టు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంది.

23 ఆ మూడు రోజులు ఎవరూ ఎవరిని చూడలేకపోయారు తామున్న చోట నుండి లేవలేకపోయారు. అయినప్పటికీ ఇశ్రాయేలీయులు నివసిస్తున్న ప్రాంతాల్లో వెలుగు ఉంది.

24 అప్పుడు ఫరో మోషేను పిలిపించి, “వెళ్లి యెహోవాను సేవించండి. మీ స్త్రీలు పిల్లలను కూడా మీతో వెళ్లవచ్చు; కాని మీ గొర్రెలు పశువులను ఇక్కడే వదిలేయండి” అన్నాడు.

25 అందుకు మోషే, “మేము మా దేవుడైన యెహోవాకు బలులు, దహనబలులు అర్పించడానికి కావలసిన పశువులను నీవు మాకు ఇవ్వాలి.

26 మా పశువులు కూడా మాతో రావాలి; ఒక్క డెక్క కూడా వదిలిపెట్టము. మా దేవుడైన యెహోవాను సేవించడానికి వాటిలో నుండే మేము తీసుకోవాలి, మేము అక్కడికి వెళ్లి మేము వేటితో యెహోవాను సేవించాలో మాకు తెలియదు” అన్నాడు.

27 అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశారు కాబట్టి అతడు వారు వెళ్లడానికి ఒప్పుకోలేదు.

28 అప్పుడు ఫరో మోషేతో, “నా ఎదుట నుండి వెళ్లిపో! మరలా నీవు నాకు కనపడకుండా చూసుకో! నీవు నా ముఖాన్ని చూసిన రోజునే నీవు మరణిస్తావు” అన్నాడు.

29 అందుకు మోషే, “నీవన్నట్లే చేస్తాను, మళ్ళీ ఇంకెప్పుడు నీ ముందు కనబడను” అన్నాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan